logo

ఉల్లి.. ఏడిపిస్తోంది..!

ఏటా ఉల్లి ధరలు ఆకాశాన్నంటి ప్రజలను కన్నీళ్లు పెట్టించడం చూస్తూనే ఉంటాం.

Updated : 11 Mar 2024 06:04 IST

ఇతర రాష్ట్రాల నుంచి సరకు రాకతో రైతుల దిగులు

రాంపూర్‌లో కోసిన ఉల్లిని విక్రయించేందుకు సంచుల్లో నింపుతున్న రైతులు

న్యూస్‌టుడే, డిచ్‌పల్లి: ఏటా ఉల్లి ధరలు ఆకాశాన్నంటి ప్రజలను కన్నీళ్లు పెట్టించడం చూస్తూనే ఉంటాం. ఈసారి మాత్రం పంట సాగు చేసిన రైతులకు ఆశించిన ధర దక్కకపోవడంతో దిగులు చెందుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ధర పర్వాలేదనిపిస్తున్నా.. ఇతర రాష్ట్రాల నుంచి సరకు దిగుమతి అవుతుండడంతో స్థానిక రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం క్రమేణా తగ్గుతూ వస్తోంది. ఈ యాసంగిలో సుమారు 230 ఎకరాల్లో సాగైంది. విస్తీర్ణం తగ్గడంతో ధర పెరుగుతుందని అన్నదాతలు భావించారు. గత నెలలో క్వింటాకు రూ.1,450-1,550 ధర పలుకగా ప్రస్తుతం రూ.1,250-1,300గా ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దళారులు మహారాష్ట్ర, గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటూ జిల్లాలోని హోల్‌సేల్‌ దుకాణాలకు సరఫరా చేయడమే ఇందుకు కారణం.

తప్పని పరిస్థితుల్లో విక్రయం

ఈ ఏడాది వర్షాలు బాగా కురిసినందున రైతులు యాసంగిలో వరి సాగుకే మొగ్గు చూపారు. జిల్లాలోని డిచ్‌పల్లి, మోపాల్‌, ఇందల్‌వాయి, సిరికొండ, మోర్తాడ్‌, బాల్కొండ, వేల్పూర్‌, ఆర్మూర్‌ మండలాల్లో ఉల్లి సాగవుతోంది. ఈ సాగుకు పెట్టుబడి అధికంగా ఉంటుందని రైతులు ముందుకు రావడం లేదు. అంతేకాక చేతికొచ్చిన పంటను నిల్వ చేసేందుకు వసతులు లేక అమ్ముకోవాల్సి వస్తోంది. ధర తక్కువగా ఉండడం, మార్కెట్‌కు తరలించేందుకు ఖర్చులు అధికమవుతుండడంతో పొలాల్లోకే వచ్చిన దళారులకు విక్రయిస్తున్నారు. ప్రతి సీజన్‌లో నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, భువనగిరి, ఖమ్మం జిల్లాల నుంచి వ్యాపారులు వచ్చి పంటను కొనుగోలు చేస్తున్నారు.

నిల్వలపై నిఘా అవసరం

అన్నదాతల అమాయకత్వాన్ని ఆసరా చేసుకుంటున్న దళారులు ముందుచూపుతో ఉల్లి కొనుగోలు చేసి నిల్వ చేసుకుంటున్నారు. ధర పెరిగినప్పుడు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. ఇలా నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు చేసే వారిపై చర్యలు తీసుకోవాలని, ధరలను కట్టడి చేయాలని కేంద్ర ఆహార, వినియోగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలను 2020 డిసెంబరులో ఆదేశించింది. హోల్‌సేల్‌ వ్యాపారులు 250 క్వింటాళ్లు, రిటెయిలర్స్‌ 20 క్వింటాళ్లకు మించి ఉల్లిని నిల్వ చేసుకోవచ్చని సూచించింది. కానీ వ్యాపారులు అధికంగా నిల్వ చేస్తున్నారు. వీటిపై నిఘా అవసరం.

క్వింటాకు రూ.1,500 చెల్లించాలి: రఘుపతి, రైతు, నర్సింగ్‌పూర్‌

రెండున్నర ఎకరాల్లో ఉల్లి సాగు చేశా. గత నెలతో పోలిస్తే ధర తగ్గింది. ఈ సాగుకు ఖర్చులు అధికంగా అవుతాయి. క్వింటాకు రూ.1,500 ధర చెల్లిస్తే మేలు జరుగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని