logo

ఔషధ దుకాణాలపై నజర్‌

గతంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్‌ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్‌లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు.

Published : 28 Mar 2024 03:41 IST

ఔషధ దుకాణాలపై నజర్‌
ముమ్మరంగా కొనసాగుతున్న దాడులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వైద్యవిభాగం

  • జిల్లా కేంద్రం వినాయక్‌నగర్‌లోని బయోమెడిక్‌ ఫార్మాస్యూటికల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో రూ.6 లక్షల విలువ చేసే నకిలీమందులను ఔషధ నియత్రణ శాఖ ఏడీ నర్సయ్య, శ్రీకాంత్‌, శ్రీలత స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి ఔషధాలను కోర్టుకు అప్పగించారు.
  • నెల కిందట నగరంలోని బొబ్బిలి వీధి వీక్లీమార్కెట్‌లోని శ్రీనారాయణ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్‌ డీపీసీ(డ్రగ్‌ కంట్రోల్‌ ప్రైజ్‌) నిర్వాహకులు ఎక్కువ ధరకు విక్రయిస్తూ ఔషధ నియంత్రణ అధికారులకు పట్టుబడ్డారు. నిబంధనల ప్రకారం ప్లూనారిజిన్‌ 10 మాత్రలు రూ.40.82 అమ్మాల్సి ఉండగా రూ.99కి విక్రయించారు.
  • కొద్ది రోజుల కిందట వాతారిన్‌ ఆయుర్వేద మాత్రలపై తప్పుడు ప్రచారం చేస్తున్నట్లు గుర్తించి దేవిరోడ్‌లోని దుకాణాన్ని తనిఖీ చేశారు. మాత్రలు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

​​​​​​​

తంలో ఏ జిల్లావారు అక్కడే తనిఖీలు చేసేవారు. కానీ గతేడాది నుంచి జంబ్లింగ్‌ పద్ధతిని పాటిస్తున్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఇతర జిల్లాల అధికారులు నిజామాబాద్‌లో, ఇక్కడి వారు వేరేచోట తనిఖీలు చేస్తున్నారు. ఫలితంగా స్థానిక పరిచయాలు, నాయకుల పైరవీలు, ఒత్తిడి వంటి అంశాల నుంచి వారికి స్వేచ్ఛ లభిస్తోంది. గత నెలలో ఆదిలాబాద్‌ అధికారులు నగరశివారు ఖానాపూర్‌(భాగ్యనగర్‌)లోని నాలుగు మందుల దుకాణాలు, ముబారక్‌నగర్‌లో ఒకటి, దుబ్బాలో రెండింటిని సీజ్‌ చేశారు.

ఫార్మాసిస్టులు తప్పనిసరి

గతంలో పలు దుకాణాల్లో ఫార్మసిస్టులు ఉండేవారు కాదు. కానీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యహరించేవారు. ప్రస్తుతం తనిఖీల్లో ప్రధానంగా ఫార్మసిస్టు ఉండటం, మత్తు ఔషధాల విక్రయం, బిల్లు బుక్కుల నిర్వహణ పక్కాగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంత చేసినా చాలా దుకాణాల్లో ఫార్మసిస్టులను నియమించుకోవడం లేదు.

సిబ్బంది కొరత

పట్టణాల్లో గల్లీకొకటి, చిన్న గ్రామాల్లోనూ మూడు, నాలుగు ఫార్మసీలు వెలుస్తున్నాయి. అలాగే నాలుగైదుగురు ఆర్‌ఎంపీలు ఉంటున్నారు. ఎవరికితోచినట్లు వారు యాంటీ బయోటిక్స్‌, మత్తు కలిగించే, నొప్పుల మాత్రలు విక్రయిస్తున్నారు. సంబంధిత శాఖలో కేవలం ముగ్గురే అధికారులు ఉండటంతో పర్యవేక్షణ కష్టంగా మారింది.


నిబంధనలు తప్పక పాటించాలి

- శ్రీకాంత్‌, ఔషధ నియంత్రణ శాఖ అధికారి

ఔషధ దుకాణాదారులు నిబంధనలు పాటించాలి. తప్పనిసరిగా ఫార్మసిస్టును నియమించుకోవాలి. వైద్యుడి చీటి లేకుండా మందులు విక్రయించొద్దు. కొనుగోలుదారులు బిల్లులను తప్పనిసరిగా తీసుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని