logo

‘రైతులను ఆదుకునేది మోదీనే’

వికసిత్‌ భారత్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ నాయకులకు లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు.

Published : 16 Apr 2024 06:24 IST

కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌, వేదికపై ఎంపీ అర్వింద్‌, ఎమ్మెల్యేలు మహేశ్వర్‌రెడ్డి, పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ

ఆర్మూర్‌ పట్టణం, న్యూస్‌టుడే: వికసిత్‌ భారత్‌ గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ నాయకులకు లేదని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. ఆర్మూర్‌ పట్టణ శివారులోని ఓ కల్యాణ మండపంలో సోమవారం నిర్వహించిన నిజామాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ బూత్‌ స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. భాజపా మినహా పార్టీలు వారసత్వ రాజకీయాలు చేస్తాయని విమర్శించారు. భాజపా సంకల్ప పత్రం దేశ ప్రజల భవిష్యత్తు కోసం రూపొందించిందన్నారు. పసుపు రైతులకు ఇచ్చిన హామీ ఎంపీ అర్వింద్‌ నిలబెట్టుకొన్నారని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు అన్ని ఇబ్బందులే ఉన్నాయని, వారిని ఆదుకునేది ప్రధాని మోదీనే అన్నారు. కులం, మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న కాంగ్రెస్‌... కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్రంలో అమలుకానివ్వడం లేదన్నారు. భారాస నాయకులు చెబుతున్నట్లు కేసీఆర్‌ అపరభగీరథుడు కాదని, అపర అవినీతి పరుడని ఆరోపించారు. యూపీ తరహా పాలన, గుజరాత్‌ మోడల్‌ ఇక్కడ రావాలంటే భాజపాను గెలిపించాలన్నారు. రాష్ట్రంలో డజను ఎంపీ సీట్లు గెలిపించుకుందామని పిలుపునిచ్చారు. రెండు లక్షల ఓట్ల మెజార్టీతో అర్వింద్‌ను గెలిపించాలని కోరారు.

ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవి

దేశభక్తి, జాతీయ భావం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని ఎంపీ అర్వింద్‌ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హిందువుగా వ్యవహరించాలని, శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతికి ఇబ్బందులు పెట్టకుండా, డీజేలకు అనుమతివ్వాలన్నారు. పసుపు బోర్డు ఇచ్చింది ప్రధాని మోదీ, తెచ్చింది అర్వింద్‌ అని రైతులు గమనించాలన్నారు. నారీశక్తిని భాజపా ప్రభుత్వం బలపరుస్తోందని తెలిపారు.  పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని, లోక్‌సభ ఎన్నికల తర్వాత స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ  అభ్యర్థులు పోటీ చేస్తారని, వారిని గెలిపించుకుని, కాంగ్రెస్‌ను భూస్థాపితం చేస్తామని తెలిపారు. సమావేశంలో శాసనసభా పక్ష నేత మహేశ్వర్‌రెడ్డి, ఆర్మూర్‌, నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యేలు పైడి రాకేశ్‌రెడ్డి, ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నిజామాబాద్‌, జగిత్యాల జిల్లా అధ్యక్షులు దినేశ్‌ కులాచారి, సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి పల్లెగంగారెడ్డి, వివిధ మోర్చాల నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని