logo

ఉత్కంఠకు తెర.. ఛైర్‌పర్సన్‌గా ఇందుప్రియ

జిల్లాకేంద్రం పురపాలిక ఛైర్‌పర్సన్‌ ఎవరనేదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత నెలలో భారాస ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఛైర్‌పర్సన్‌ పదవి కోసం కౌన్సిలర్లు ఇందుప్రియ, వనితలు పోటీపడ్డారు.

Updated : 16 Apr 2024 06:38 IST

ఎన్నికకు దూరంగా భారాస, భాజపా
ఈనాడు, కామారెడ్డి, న్యూస్‌టుడే- కామారెడ్డి పట్టణం, కలెక్టరేట్‌

ఛైర్‌పర్సన్‌గా ఎన్నికైన గడ్డం ఇందుప్రియకు ధ్రువపత్రం ఇస్తున్న ఆర్డీవో రఘునాథ్‌రావు

జిల్లాకేంద్రం పురపాలిక ఛైర్‌పర్సన్‌ ఎవరనేదానిపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. గత నెలలో భారాస ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై కాంగ్రెస్‌ పార్టీ ప్రవేశపెట్టిన అవిశ్వాసం నెగ్గిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఛైర్‌పర్సన్‌ పదవి కోసం కౌన్సిలర్లు ఇందుప్రియ, వనితలు పోటీపడ్డారు. భారాస, భాజపాకు చెందిన కౌన్సిలర్లు ఈ ఎన్నికకు దూరంగా ఉన్నారు. కౌన్సిలర్ల  ఏకాభిప్రాయ సాధనకు ప్రయత్నించిన కాంగ్రెస్‌ ముఖ్యనేతలు చివరకు పీసీసీ నిర్ణయం మేరకు గడ్డం ఇందుప్రియను ఛైర్‌పర్సన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

శిబిరం నుంచి నేరుగా..

హైదరాబాద్‌ శిబిరం నుంచి నేరుగా పురపాలక సంఘం కార్యాలయంలో ఆర్డీవో రఘునాథ్‌రావు అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశానికి కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు తెలుపుతున్న 28 మంది కౌన్సిలర్లు హాజరయ్యారు. సీల్డ్‌ కవర్‌లో ఛైర్‌పర్సన్‌ అభ్యర్థిగా ఇందుప్రియను పార్టీ నిర్ణయించగా 48వ వార్డు కౌన్సిలర్‌ సయ్యద్‌ అన్వర్‌ అహ్మద్‌, 38వ వార్డు కౌన్సిలర్‌ చాట్ల రాజేశ్వర్‌ ప్రతిపాదించగా సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. సమావేశానికి హాజరైన సభ్యులు చేతులెత్తారు.

పురపాలక కార్యాలయంలో చేయి ఎత్తి ఛైర్‌పర్సన్‌ ఎన్నికకు మద్దతిస్తున్న కౌన్సిలర్లు

సీల్డ్‌ కవర్‌లో పేరు

మూడు రోజుల కిందట కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్లను హైదరాబాద్‌లోని శిబిరానికి తరలించింది. మాజీ మంత్రి షబ్బీర్‌అలీ ఆదివారం సాయంత్రం ఛైర్‌పర్సన్‌ ఎవరైతే బాగుంటుందనే దానిపై కౌన్సిలర్లతో చర్చలు జరిపారు. ఛైర్‌పర్సన్‌ ఎంపికపై సభ్యుల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో నిర్ణయాన్ని పీసీసీకి వదిలిపెట్టారు. తుదకు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన మేరకు సీల్డ్‌కవర్‌లో అభ్యర్థిని నిర్ణయించి ప్రత్యేక సమావేశానికి పది నిమిషాల ముందు ప్రకటించారు.

హస్తం నేతలు, కార్యకర్తల సంబరాలు

ఛైర్‌పర్సన్‌గా ఇందుప్రియ ఏకగ్రీవంగా ఎన్నిక కాగానే బల్దియా కార్యాలయం ముందు కాంగ్రెస్‌నేతలు, కార్యకర్తలు బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకొన్నారు. తొమ్మిదేళ్ల అనంతరం పురపాలికను హస్తగతం చేసుకున్నందుకు పార్టీనేతలు హర్షం వ్యక్తం చేశారు.

శిబిరం నుంచి బస్సులో వచ్చిన కౌన్సిలర్లు కార్యాలయంలోకి వెళ్తూ..

ప్రక్రియను గమనించిన భారాస కౌన్సిలర్లు

పురపాలక సంఘంలో ప్రస్తుతం భారాసకు పదిహేను మంది కౌన్సిలర్లు ఉన్నారు. ఇందులో నిట్టు వేణుగోపాల్‌రావు వర్గంలో ఆరుగురు ఉండగా, మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌ వర్గంలో తొమ్మిది మంది ఉన్నారు. భారాసకు చెందిన నలుగురు కౌన్సిలర్లు కౌన్సిల్‌ కార్యాలయం ముందు వాహనంలో ఉండి సమావేశ పరిణామాలను గమనిస్తూ ఉండిపోయారు.


అనూహ్య పరిణామాలు

సమావేశం అనంతరం బయటకు వెళ్తున్న కౌన్సిలర్‌ వనిత

ఛైర్‌పర్సన్‌ అభ్యర్థి ఎంపికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి 28 మంది సభ్యులు మద్దతు ప్రకటించారు. ఇందులో వనిత, ఇందుప్రియ పదవి కోసం పోటీపడ్డారు. అభిప్రాయాల సేకరణ సమయంలో మెజారిటీ కౌన్సిలర్లు వనిత పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందుకు విరుద్ధంగా పీసీసీ అధిష్ఠానం మాత్రం సీల్డ్‌ కవర్‌లో ఇందుప్రియ పేరు ప్రకటించడంతో కౌన్సిలర్లు విస్తుపోయినట్లు తెలిసింది. ఇందుప్రియ పేరును ప్రకటించగానే వనిత సమావేశం నుంచి బయటకురాగా కౌన్సిలర్లు నచ్చచెప్పడంతో ఎన్నిక పూర్తయ్యేంత వరకు ఉన్నారు. ఎన్నిక ప్రక్రియ పూర్తికాగానే సమావేశం నుంచి వనిత వెళ్లిపోయారు. మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ నివాసంలో నిర్వహించిన సమావేశానికి సైతం మెజారిటీ కౌన్సిలర్లు హాజరుకాకపోవడం గమనార్హం.

వైస్‌ఛైర్‌పర్సన్‌గా వనిత పేరు

మాజీ మంత్రి షబ్బీర్‌అలీ తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వైస్‌ఛైర్‌పర్సన్‌గా పీసీసీ సూచన మేరకు ఉరుదొండ వనితను ఖరారు చేసినట్లు వెల్లడించారు. ఇందుప్రియ ఛైర్‌పర్సన్‌గా ఎన్నిక కావడంతో వైస్‌ఛైర్‌పర్సన్‌ పదవి ఖాళీ కానుంది. ఈ విషయాన్ని పురపాలక సంఘం అధికారులు ఎన్నికల సంఘానికి లేఖ ద్వారా తెలియజేయనున్నారు. ఆ తర్వాత ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదల కానుంది.


పట్టణ అభివృద్ధికి కృషి చేస్తా
- ఇందుప్రియ, నూతన ఛైర్‌పర్సన్‌

కామారెడ్డి పట్టణ అభివృద్ధికి కృషి చేస్తాను. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీల సహకారంతో పురపాలికకు ప్రత్యేకంగా నిధులు తీసుకువచ్చి ప్రగతిపథంలో నిలిపేందుకు తోడ్పాటునందిస్తా. ప్రస్తుతం బల్దియాలో తాగునీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యం ఇస్తాం. ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లు, కాంగ్రెస్‌ నేతలకు ధన్యవాదాలు. కౌన్సిలర్లు నా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయకుండా పనిచేస్తాను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని