logo

ప్రజలు మళ్లీ మోసపోవద్దు

భాజపా అభ్యర్థి అర్వింద్‌ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు.

Published : 20 Apr 2024 07:02 IST

భాజపా, కాంగ్రెస్‌లను ఓడించాలి

బహిరంగ సభలో భారాస నేతలు

 భారాస అభ్యర్థి బాజిరెడ్డికి మద్దతు తెలుపుతున్న రాజ్యసభ సభ్యుడు సురేష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి (బాల్కొండ), డాక్టర్‌ సంజయ్‌ (కోరుట్ల), డాక్టర్‌ సంజయ్‌(జగిత్యాల), కమలాకర్‌ (కరీంనగర్‌), నిజామాబాద్‌ జడ్పీ ఛైర్మన్‌ విఠల్‌రావు, మాజీ మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, జగిత్యాల,  నిజామాబాద్‌ భారాస జిల్లా అధ్యక్షులు విద్యాసాగరరావు, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్‌.రమణ, మేయర్‌ నీతూకిరణ్‌ తదితరులు

ఈనాడు, నిజామాబాద్‌: భాజపా అభ్యర్థి అర్వింద్‌ రాముడి పేరుతో రాజకీయం తప్ప.. ప్రజలకు చేసింది ఏమీ లేదని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ విమర్శించారు. పొద్దునలేస్తే హిందూ-ముస్లిం, పాకిస్థాన్‌-ఇండియా, రోహింగ్యాలంటూ మాటలు చెప్పడమే గాని ఎంపీగా ప్రజలకు చేసింది శూన్యమని ఎద్దేవా చేశారు. నామినేషన్‌ దాఖలు సందర్భంగా నిజామాబాద్‌ పాత కలెక్టరేట్‌ మైదానంలో శుక్రవారం నిర్వహించిన బహిరంగ సభలో బాజిరెడ్డి ప్రసంగించారు. రాముడి పేరు చెప్పుకొని పాలన సాగించే మోదీ పేదలను విస్మరించారని విమర్శించారు. ఒకే కుటుంబం నుంచి తండ్రి-కొడుకులు ఎంపీలుగా ఉండటం అరుదుగా ఉంటుందని, ఆ అవకాశం దక్కిన అర్వింద్‌, ఐదేళ్ల కాలాన్ని వృథా చేసుకున్నారన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి.. ఈ ప్రాంత ఎమ్మెల్సీగా ఉండి కూడా ఇక్కడి ప్రజల మంచి చెడ్డలు పట్టించుకోలేదన్నారు. అసలు కాంగ్రెస్‌ రాజశేఖర్‌రెడ్డితోనే పోయిందని.. ఇప్పుడు పాత కాంగ్రెసోళ్లు రేవంత్‌కు వెన్నుపోటు పొడిచేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

 గులాబీ శ్రేణుల్లో జోష్‌..

అధికారం కోల్పోయాక భారాస జిల్లాలో తొలి బహిరంగ సభను శుక్రవారం నగరంలో నిర్వహించింది. సభ చెప్పిన సమయం కంటే ఆలస్యమైనప్పటికీ.. పార్లమెంట్‌ పరిధిలోని అన్ని నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు తరలిరావటంతో నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నాయకులు ఉద్యమ కాలంలో మాదిరిగా కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగించారు. గ్రామగ్రామాన ప్రచారం ఉద్ధృతం చేసి నిజామాబాద్‌ స్థానాన్ని గెలిపించుకుందామని నాయకులు కోరారు.ఎమ్మెల్సీ రమణ, మాజీ మంత్రి మహమూద్‌ అలీ, జగిత్యాల, నిజామాబాద్‌ జిల్లాల భారాస అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గణేశ్‌గుప్తా, మాజీ ఎమ్మెల్యే షకీల్‌ సతీమణి అయేషా ఫాతిమా సభలో ప్రసంగించారు. బోధన్‌ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి తప్పుడు కేసులతో భారాస నేతలను ఇబ్బంది పెడుతున్నారని జీవన్‌రెడ్డి ఆరోపించారు. చిన్న కేసులో తన కొడుకును చిత్రహింసలకు గురిచేసి.. రాజకీయ కక్ష సాధింపులకు దిగారని అయేషా ఫాతిమా పేర్కొన్నారు. జగిత్యాల, కోరుట్ల ఎమ్మెల్యేలు డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, రెండు జిల్లాల జడ్పీ ఛైర్మన్లు విఠల్‌రావు, వసంత, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్‌, నిజామాబాద్‌ మేయర్‌ నీతూ కిరణ్‌, జడ్పీటీసీ సభ్యులు జగన్‌, సుమన, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


అర్వింద్‌-సుదర్శన్‌రెడ్డి కుమ్మక్కు  
- ప్రశాంత్‌రెడ్డి, మాజీ మంత్రి

అసెంబ్లీ ఎన్నికల్లో సుదర్శన్‌రెడ్డి గెలిచేందుకు అర్వింద్‌ సహకరించారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో భాజపా గెలుపు కోసం అర్వింద్‌తో సుదర్శన్‌రెడ్డి కుమ్మక్కయ్యారు. బడాభాయ్‌..చోటా భాయ్‌ బంధంలో భాగంగా రేవంత్‌రెడ్డి మోదీతో  ఒప్పందంలో భాగంగా బలహీనమైన అభ్యర్థులను నిలిపారు. పసుపు సాగు విస్తీర్ణం తగ్గి డిమాండ్‌ ఏర్పడి ఈ సారి ధర పెరిగింది. ఇందులో అర్వింద్‌ కృషి ఏమీ లేదు.  


ఇద్దరం పోరాడుతాం..  
- సురేష్‌రెడ్డి, ఎంపీ రాజ్యసభ

డిసెంబరు 9న చేస్తానన్న రుణమాఫీ గురించి అడిగితే.. ఆగస్టు 15 అంటున్నారు. ప్రజలకు మేలు చేసే పనులు ఎగవేస్తున్నారు. భారాసను గెలిపిస్తే రాజ్యసభలో నేను, లోక్‌సభలో బాజిరెడ్డి జూన్‌లో మొదలయ్యే పార్లమెంటు సమావేశాల్లో పసుపు బోర్డు అంశం మీదే మాట్లాడతాం.    


వంద రోజుల్లో ఆగం చేశారు..
- శ్రీనివాస్‌ గౌడ్‌, మాజీ మంత్రి

కేసీఆర్‌ పదేళ్లు కష్టపడి అన్నిరంగాల్లో రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలిపితే.. కాంగ్రెసోళ్లు వంద రోజుల్లో ఆగం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మోసపూరిత మాటలతో మభ్యపెడుతోంది.


ప్రైవేటులో ధాన్యం అమ్మకం
- గంగుల కమలాకర్‌, మాజీ మంత్రి

నేను మంత్రిగా ఉన్నప్పుడు ధాన్యం కొనుగోళ్లకు మూడు నెలల ముందే కసరత్తు చేసి ఇబ్బందులు లేకుండా చూశాం. ఇప్పుడు ప్రభుత్వం డబ్బులు ఖాతాలో వేస్తుందో లేదో తెలియక రైతులు ప్రైవేటులో అమ్ముకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని