logo

‘జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదు’

కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ హెచ్చరించారు.

Published : 05 May 2024 06:08 IST

మాట్లాడుతున్న మాజీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌
కామారెడ్డి అర్బన్‌, న్యూస్‌టుడే: కొత్తగా ఏర్పాటైన కామారెడ్డి జిల్లాను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రద్దు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ప్రభుత్వ విప్‌ గంప గోవర్ధన్‌ హెచ్చరించారు. జిల్లాకేంద్రంలోని ఆయన నివాసంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్‌, భారాస జిల్లా అధ్యక్షుడు ఎంకే ముజీబుద్దీన్‌లతో కలిసి శనివారం ఆయన మాట్లాడారు. కొత్తజిల్లాలను రద్దుచేసి ప్రతి లోక్‌సభ స్థానాన్ని ఒక్కో జిల్లాకేంద్రంగా మార్చాలనే కాంగ్రెస్‌ ప్రభుత్వ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తప్పుడు ఆలోచనను విరమించుకోవాలని.. లేదంటే ఉద్యమించక తప్పదని వారు పేర్కొన్నారు. ఈ విషయమై మే 13లోగా కచ్చితమైన ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. కామారెడ్డి జిల్లాను రద్దు చేసి 170 కిలోమీటర్ల దూరంలో ఉండే జహీరాబాద్‌ను జిల్లాను చేస్తే ప్రజలు అక్కడికి వెళ్లి పనులు చేసుకోవాలంటే ఏవిధమైన కష్టాలను అనుభవిస్తారో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి తెలియడం లేదని వారు ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ తప్పుడు హామీలిచ్చి అధికారంలోకి వచ్చిందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆర్టీసీని నష్టాల్లోకి నెట్టారన్నారు. రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ కాలేదన్నారు. కరెంటు కష్టాలు మొదలయ్యాయన్నారు. తెలంగాణలో కాంగ్రెస్‌ కృత్రిమ కరవు తీసుకొచ్చిందన్నారు. ఫోన్‌ ట్యాపింగ్‌ పేరుతో కొత్త గేమ్‌ ఆడుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు సీఎం అయితే తెలంగాణను ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రద్దు చేస్తాడేమో అంటూ ఎద్దేవా చేశారు. కేంద్రంలోని భాజపా ప్రజలకు చేసిందేమీ లేదన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని