logo

ఏ సామాజిక వర్గం ఎటు వైపో..!

లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జహీరాబాద్‌ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు.

Updated : 05 May 2024 06:41 IST

జహీరాబాద్‌ విజేతను నిర్ణయించడంలో అందరూ కీలకమే

 

న్యూస్‌టుడే,కామారెడ్డి కలెక్టరేట్‌: లోక్‌సభ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. జహీరాబాద్‌ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన పార్టీలకు చెందిన ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ తర్వాత ప్రచారం వేడెక్కింది. లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 16.40 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. వివిధ సామాజిక వర్గాలను రాజకీయ పార్టీలు మచ్చిక చేసుకుంటున్నాయి. వారి మద్దతు తమకే లభిస్తుందని ధీమాగా ఉన్నాయి.

దళితులు, క్రైస్తవుల ఓట్లు..

జుక్కల్‌, జహీరాబాద్‌, అందోల్‌ అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు విభాగానికి చెందినవి. జుక్కల్‌, అందోల్‌ నియోజకవర్గాల్లో దళితుల ఓట్లు ఎక్కువగా ఉండగా.. జహీరాబాద్‌ నియోజకవర్గంలో క్రైస్తవులు, దళితుల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ప్రధాన రాజకీయపార్టీలు ఈ వర్గం ఓట్లు తమకే పడుతాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎవరికి వారు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. దళితులకు అన్ని విధాలా న్యాయం చేసింది తమ పార్టీనే అంటూ ప్రచారం నిర్వహిస్తున్నాయి.

రెండు లక్షలకు పైనే ముస్లింలు

జహీరాబాద్‌ లోక్‌సభ పరిధిలో ముస్లింల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. లోక్‌సభ నియోజకవర్గం మొత్తంలో సుమారు 2లక్షలకు పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారని రాజకీయ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. వీరి ఓట్లను రాబట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. తాము విజయం సాధిస్తే అనేక పనులు చేస్తామని అభ్యర్థులు హామీలు ఇస్తున్నారు. జహీరాబాద్‌, కామారెడ్డి, బాన్సువాడ, నారాయణఖేడ్‌ నియోజకవర్గాల్లో ముస్లిం ఓట్లు అధికంగా ఉన్నాయి.

మున్నూరుకాపులు.. ముదిరాజ్‌లు

విజేతను నిర్ణయించడంలో మున్నూరుకాపు, ముదిరాజ్‌ ఓటర్లు కీలకం కానున్నారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి, బాన్సువాడ, జుక్కల్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల్లో మున్నూరుకాపులు, ముదిరాజ్‌ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. విజేతను నిర్ణయించడంలో వీరి ఓట్లే కీలకమవుతాయని అభ్యర్థులు భావిస్తున్నారు. ఇక్కడ పోటీ చేస్తున్న భారాస అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌ మున్నూరుకాపు సామాజిక వర్గానికి చెందిన వారే. దీంతో ఈయన ఈ వర్గం ఓటర్లపై నమ్మకం పెట్టుకున్నారు. వీరితో పాటు కర్ణాటక, మహారాష్ట్రతో సరిహద్దు కలిగిన గ్రామాల ప్రజల ఓట్లు కూడా కీలకం కానున్నాయి. వీరు కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే తెలంగాణ ఓటర్లు. జుక్కల్‌, నారాయణఖేడ్‌, జహీరాబాద్‌ నియోజకవర్గాల పరిధిలో సుమారు 40 వేల మంది వరకు ఇలాంటి వారు ఉంటారు.

లింగాయత్‌ల మద్దతు ఎవరికో..

జహీరాబాద్‌, నారాయణఖేడ్‌, జుక్కల్‌ నియోజకవర్గాల్లో లింగాయత్‌లు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థులిద్దరు లింగాయత్‌ సామాజిక వర్గానికి చెందిన వారే. నారాయణఖేడ్‌ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్‌ అభ్యర్థి సురేశ్‌కుమార్‌ షెట్కార్‌ ఇదే నియోజకవర్గం నుంచి 2009లో ఎంపీగా విజయం సాధించారు. మరోసారి ఓటమి చెందారు. జుక్కల్‌ నియోజకవర్గానికి చెందిన బీబీ పాటిల్‌ 2014, 2019లో తెరాస తరఫున ఎంపీగా విజయం సాధించారు. ఇప్పుడు భాజపా తరఫున బరిలో నిలిచారు. మొత్తం నియోజకవర్గంలో లింగాయత్‌ల ఓట్లు ఈ ఇద్దరిలో ఎవరికి పడతాయోననే ఆసక్తి నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని