logo

గడపగడపకు బూత్‌స్థాయి కమిటీలు

లోక్‌సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది.

Published : 07 May 2024 06:04 IST

పల్లెల్లో ప్రచార హోరు
న్యూస్‌టుడే, కామారెడ్డి కలెక్టరేట్‌

లోక్‌సభ ఎన్నికలు సమీపించడంతో రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఇప్పటి వరకు నియోజకవర్గ, మండల కేంద్రాలకే పరిమితమైన ప్రచారం ప్రస్తుతం పల్లెలకు చేరింది. రెండు మూడు రోజుల నుంచి అభ్యర్థులు గడపగడపకు వెళ్లి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రతి ఓటర్‌ను కలుసుకుని తమ పార్టీకే పట్టం కట్టాలని వేడుకుంటున్నారు. పోలింగ్‌కు మరో వారం రోజులే గడువు ఉండడంతో పార్టీలు దూకుడు పెంచాయి. ఒక వైపు ఆయా పార్టీల అగ్రనేతల పర్యటనలు కొనసాగిస్తూనే ఇంకోవైపు క్షేత్రస్థాయి ప్రచారం వైపు దృష్టి సారించాయి. ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా పరిధిలోని జహీరాబాద్‌, నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బూత్‌స్థాయి కమిటీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి.

10 మందికి అవకాశం

భాజపా, కాంగ్రెస్‌, భారాస పార్టీలు ఇప్పుడు ప్రచార బాధ్యతలను బూత్‌స్థాయి కార్యకర్తలపై ఉంచారు. మూడు పార్టీల్లోనూ క్రియాశీలకంగా పనిచేసేవారికి బూత్‌స్థాయి కమిటీల్లో అవకాశం కల్పించారు. ఈ కమిటీలు రెండు మూడు రోజుల నుంచి పల్లెల్లో ఇంటింటా తిరిగి తమ పార్టీ అభ్యర్థికి అనుకూలంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఒక్కో కమిటీలో పది మంది కార్యకర్తలు ఉంటున్నారు. నిత్యం వీరు గ్రామాల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రచారం చేస్తున్నారు.

ఎవరి లెక్కలు వారివే

రెండు లోక్‌సభ నియోజకవర్గాల్లో  14 అసెంబ్లీ స్థానాలున్నాయి. వీటిల్లో ఆయా పార్టీలు ఓట్ల లెక్కలు వేసుకుంటున్నాయి.  ఏ మండలంలో తమకు ఎన్ని ఓట్లు వచ్చే అవకాశం ఉంది, ప్రత్యర్థి పార్టీకి ఎన్ని వస్తాయి వంటి విషయాలను గణాంకాలు వేసుకుంటున్నాయి. మొత్తంగా విజయావకాశాలు తమకే ఉన్నాయంటూ ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నారు. ఇక అన్ని పార్టీలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారాన్ని విస్తృతం చేశాయి.

చేరికలపై నజర్‌..

ప్రత్యర్థి పార్టీలను బలహీన పర్చేందుకు ఆయా పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్‌, భాజపాల్లోకి వలసలు పెరిగాయి. ప్రత్యర్థి పార్టీల నుంచి ద్వితీయశ్రేణి నాయకులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. గ్రామాల్లోని మాజీ సర్పంచులు, తాజా మాజీలు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులను పార్టీల్లో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల తాజా మాజీలు, మాజీ సర్పంచులు, సింగిల్‌ విండో అధ్యక్షులు, డైరెక్టర్లు పార్టీలు మారారు. కులసంఘాల నేతలను కూడా ఆయా పార్టీల్లోకి చేర్చుకుంటున్నారు. పోలింగ్‌ తేదీ సమీపించడంతో ఆయా సామాజికవర్గాల ఓటర్ల దృష్టిని ఆకర్షిస్తున్నారు. తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తే ఆయా కులసంఘాలకు ఏమేమి పనులు చేస్తారో వివరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని