logo

ఐదంచెల భద్రతా వ్యవస్థ

లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్‌ సింధూశర్మ పేర్కొన్నారు.

Published : 07 May 2024 06:11 IST

ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ
పౌరులు ఫిర్యాదు చేయవచ్చు: ఎస్పీ సింధూశర్మ
ఈనాడు, కామారెడ్డి

లోక్‌సభ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఐదంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు కామారెడ్డి ఎస్పీ సీహెచ్‌ సింధూశర్మ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కేంద్రాల వద్ద భద్రత, ప్రవర్తనా నియమావళి అమలుకు తీసుకుంటున్న చర్యలను ఎస్పీ ఈనాడు ముఖాముఖిలో వెల్లడించారు. వారి మాటల్లోనే...

అదనపు బలగాలు.. బందోబస్తు

ఎన్నికల విధులకు అదనపు బలగాలు వచ్చాయి. వీటితో పాటు సీఎఎస్‌ఎఫ్‌ బలగాలు బందోబస్తును పర్యవేక్షిస్తాయి. సాధారణ పోలింగ్‌ కేంద్రంలో ఇద్దరు, సమస్యాత్మక కేంద్రాల్లో అదనపు బలగాలతో భద్రత ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్‌స్టేషన్‌కో క్యూఆర్టీ (క్విక్‌రెస్పాన్స్‌ టీం)లను సైతం ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు ఈవీఎంలను భద్రంగా స్ట్రాంగ్‌రూంలకు చేర్చేందుకు నిర్దేశిత 64 మార్గాల్లో మొబైల్‌ టీంలను ఏర్పాటు చేశాం. డీఎస్పీల నేతృత్వంలో డివిజన్‌ స్థాయిలో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ నిఘా బృందాలు పనిచేయనున్నాయి. జిల్లాస్థాయిలో మరో స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ బృందాన్ని నియమించి ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.

సామాజిక మాధ్యమాలపై నిఘా

సామాజిక మాధ్యమాల్లో రాజకీయ పార్టీల నాయకులను కించపర్చేలా, ప్రజలను రెచ్చగొట్టే అంశాలను పోస్టుచేస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం. సామాజిక మాధ్యమాల్లో నమోదు అవుతున్న రాజకీయ అంశాలకు సంబంధించి ఎవరైనా ఫిర్యాదు చేసినా లేక ఎన్నికల అధికారులు పరిశీలించినా.. సంబంధిత గ్రూప్‌ అడ్మిన్‌పై, పోస్టులు నమోదు చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుంటాం. ఇటీవల రాజంపేటలో సామాజిక మాధ్యమాల్లో అనుచిత పోస్టులపై ఫిర్యాదు వస్తే చర్యలు చేపట్టాం.

రూ.1.95 కోట్ల  నగదు స్వాధీనం

ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నాటి నుంచి నేటి వరకు జిల్లావ్యాప్తంగా 6525 లీటర్ల మద్యంతో పాటు రూ.1.95 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నాం. 1052 గ్రాముల అల్ఫ్రాజోలం, 300 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. వీటితో పాటు 90 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నాం.

పర్యవేక్షణకు  కంట్రోల్‌రూం

ఈ నెల 13న జరిగే పోలింగ్‌ ప్రక్రియను పరిశీలించేందుకు కేంద్రాల్లో నిఘా కెమెరాలను ఏర్పాటు చేస్తున్నాం. సమస్యాత్మకంగా భావిస్తున్న 64 కేంద్రాల్లో లోన, బయట రెండు చొప్పున కెమెరాలు బిగించనున్నాం. వీటిని ఎప్పటికప్పుడు వీక్షించేందుకు కలెక్టరేట్‌తో పాటు సహాయఎన్నికల అధికారి కార్యాలయాలైన బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డిల్లో కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నాం. సాధారణ, పోలీసు పరిశీలకులతో సహా జిల్లా ఎన్నికల అధికారి, రిటర్నింగ్‌ అధికారులు కంట్రోల్‌రూమ్‌లో అందుబాటులో ఉండి పోలింగ్‌ సరళిని పరిశీలించనున్నారు. ఏదైనా ఘటన జరిగితే అప్రమత్తమయ్యేలా, ఘర్షణల నివారణకు పోలీసు బలగాలను రంగంలోకి దించనున్నాం.

ఉల్లంఘనలపై కేసులు

ఇప్పటివరకు జిల్లాలో 561 మందిని బైండోవర్‌ చేశాం. ఆయుధాలను స్వాధీనం చేసుకుని ఠాణాల్లో భద్రపరిచాం. భిక్కనూరు ఎంపీపీ కార్యాలయంలో పార్టీపరమైన సమావేశం నిర్వహించారనే ఫిర్యాదుతో పాటు తాడ్వాయిలో రాజకీయ పార్టీ సమావేశం అనంతరం నగదు పంపిణీ చేస్తున్న తీరుపై ఎంసీసీ ఉల్లంఘన కేసులు నమోదు చేశాం. ప్రచార గడువు ముగిసిన తర్వాత రాజకీయ పార్టీల ప్రలోభాలపై సీ-విజిల్‌ లేదా 1950 కాల్‌సెంటర్‌, డయల్‌ 100 ద్వారా పౌరులు ఫిర్యాదు చేస్తే పరిశీలించి చర్యలు చేపడతాం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని