logo

ఆమె నిర్ణయం.. అభ్యర్థి విజయం

ఆకాశంలో సగం.. అన్నింటా మేమున్నామంటూ చాటుతున్న మహిళలు పార్లమెంటు ఎన్నికల్లో కీలకం కానున్నారు.

Published : 07 May 2024 06:12 IST

స్వయం సహాయక సంఘాలకు గాలం
జిల్లాలో 3.64 లక్షల మంది సభ్యులు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

ఆకాశంలో సగం.. అన్నింటా మేమున్నామంటూ చాటుతున్న మహిళలు పార్లమెంటు ఎన్నికల్లో కీలకం కానున్నారు. అభ్యర్థి భవిష్యత్తు వారే తేల్చబోతున్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. నిజామాబాద్‌ జిల్లాలో గ్రామీణ, నగరం, పట్టణాల్లో కలిపి 35,273 స్వయం సహాయక సంఘాలు ఉండగా అందులో 3,64,837 మంది సభ్యులున్నారు. వారి ఓట్లు రాబట్టుకునేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.

రంగంలోకి స్థానిక నాయకులు

మహిళా సంఘాలపై ప్రధాన పార్టీలు దృష్టి సారించాయి. స్వయం సహాయక సంఘాల పనితీరు గ్రామాల్లో జిల్లా గ్రామీణాభివృద్ధి, నగరం, పట్టణాల్లో మెప్మా అధికారులు చూస్తుంటారు. ముఖ్యంగా గ్రూపు లీడర్లను తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు స్థానిక నాయకులు రంగంలోకి దిగారు. లీడర్లను సమన్వయం చేసే ఆర్పీ, సీసీలను జాబితాలు తెప్పించుకొని వారికి ఫోన్లు చేసి మహిళలు తమకు మద్దతిచ్చేలా చూడాలని కోరుతున్నారు. సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు సభ్యులకు కావాల్సిన ఖర్చులు ఇచ్చేందుకు ముందుకొస్తున్నారు. స్థానికంగా ఉండే చోటామోటా నాయకులు రంగంలోకి దిగి మహిళలతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థి ఎంపీగా గెలిస్తే మీ సంఘానికి తోడ్పాటు అందిస్తారని హామీ ఇస్తున్నారు. సంఘాలకు సామాజిక భవనాల నిర్మాణంతో పాటు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు సహాయం చేస్తామని భరోసా ఇస్తున్నారు. నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గంలో తాజాగా ఓ పార్టీ నేతలు స్వయం సహాయక గ్రూపు సభ్యులతో సమావేశం నిర్వహించారు. తాము మహిళల కోసం ఏం చేస్తామో వివరించారు. మరోవైపు తాయిలాలు ప్రకటిస్తున్నారు. కాలనీలో ఉండే మహిళలు తమకు మద్దతు ఇచ్చేలా చూడాలని గ్రూపు లీడర్లను అభ్యర్థిస్తున్నారు.

ఓటింగ్‌ శాతం పెరిగితే మేలు

అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళలే ఎక్కువగా ఉన్నారు. ఈ సారి ఓటింగ్‌ శాతం పెరిగితే బాగుంటుంది. చాలా మంది పోలింగ్‌ రోజున ఓటు వేసేందుకు ముందుకు రావడం లేదు. వారిలో చైతన్యం తెస్తే ఓటింగ్‌ శాతం పెరిగే అవకాశాలు ఉంది. గెలుపోటములు సైతం చేతిలోనే ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని