logo

నేతల నోట.. తీయటి మాట

నిజాం సుగర్స్‌.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత.

Published : 07 May 2024 06:13 IST

అందరి ప్రసంగాల్లో నిజాం సుగర్స్‌ పునరుద్ధరణ
న్యూస్‌టుడే, బోధన్‌ పట్టణం

నిజాం సుగర్స్‌.. ఆసియాలోనే అతిపెద్ద చక్కెర కర్మాగారంగా పాఠ్య పుస్తకాల్లో పారిశ్రామిక గుర్తింపు. తెలంగాణకే తలమానికంగా భౌగోళిక ప్రత్యేకత. ఉద్యమ కాలంలో తెలంగాణ అస్తిత్వం. ఇప్పుడు రాజకీయ నినాదం. ఇవీ పరిశ్రమ గురించి క్లుప్త విషయాలు.. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి లోక్‌సభ ఎన్నికల్లో నిజాం సుగర్స్‌ ప్రధాన పార్టీలకు ముఖ్య అజెండాగా మారింది. ప్రచారంలో పరిశ్రమ పేరు లేకుండా ముఖ్య నాయకులు, అభ్యర్థుల ప్రసంగాలు ముగియడం లేదంటే ఎంత ప్రాముఖ్యం ఏర్పడిందో అర్థం చేసుకోవచ్చు.

ఇదీ నేపథ్యం..

నిజాం కాలంలో ఏర్పాటైన చక్కెర కర్మాగారాల్లో బోధన్‌ చక్కెర పరిశ్రమ, ఆల్కహాల్‌, మెదక్‌, మెట్‌పల్లి యూనిట్లు మిగిలాయి. వాటిని 51 శాతం ప్రైవేట్‌, 49 శాతం ప్రభుత్వ వాటాతో నిజాం దక్కన్‌ సుగర్స్‌గా భాగస్వామ్య యాజమాన్యంగా మార్చారు. అలా 2002 నవంబర్‌ 1 నుంచి నిర్వహిస్తున్న భాగస్వామ్య యాజమాన్యంపై 2004లో ఏర్పాటైన సభాసంఘం కమిటీ ప్రభుత్వ స్వాధీనానికి సిఫార్సు చేసింది. అది అమలుకు నోచుకోకపోవడంతో పాటు రాష్ట్ర ఆవిర్భావం తదనంతర పరిణామాలతో 2015 డిసెంబర్‌లో యాజమాన్యం లేఆఫ్‌ ప్రకటించింది. పరిశ్రమ నిర్వహణ బాధ్యతలు రైతులు తీసుకుంటే ఆర్థికంగా ప్రభుత్వం నుంచి చేయూత అందిస్తామని నాటి సర్కారు ప్రకటించగా.. కర్షకులు విముఖత చూపారు. అప్పటి నుంచి కర్మాగారంపై అనిశ్చితి ఏర్పడింది.

ఎన్నికలతో తెరమీదకు..

ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో ఉన్న పరిశ్రమకు చెందిన మూడు యూనిట్లలో రెండు (బోధన్‌, మెట్‌పల్లి) యూనిట్లు లోక్‌సభ పరిధిలో భారీ పరిశ్రమలు కావడంతో వాటి పునరుద్ధరణను ప్రధానాంశంగా తీసుకుంటున్నారు. పరిశ్రమను పునరుద్ధరిస్తామని 2023 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ మ్యానిఫెస్టోలో ప్రకటించి అధికారంలోకి వచ్చాక ప్రక్రియను ప్రారంభించింది. ఈ మేరకు ప్రాథమికంగా రుణ బకాయిల చెల్లింపును పరిష్కరించాలని గుర్తించి ఇటీవల ఒక విడతగా రూ.43 కోట్లు చెల్లించినట్లు తెలుస్తోంది. తమ ప్రభుత్వం పునరుద్ధరణపై కట్టుబడి ఉందని కాంగ్రెస్‌ ఉద్ఘాటిస్తుండగా.. కేంద్ర సహకారంతో పునరుద్ధరించడానికి సిద్ధమని భాజపా ప్రకటించింది. ఇతర పార్టీలు ఇచ్చిన హామీలపై భారాస నిలదీస్తోంది.

మూడు యూనిట్ల గురించి క్లుప్తంగా..

  • బోధన్‌లో 163 ఎకరాల్లో విస్తరించిన  పరిశ్రమ సామర్థ్యం (గానుగాడించే) రోజుకు 3500 మె.ట. తర్వాత దీనిని 5 వేల మె.టకు విస్తరించారు. దాదాపు ఎనిమిది మండలాల పరిధిలో  15వేల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. రోజుకు  30వేల లీటర్లకు పైగా ఆల్కహాల్‌ ఉత్పత్తి   డిస్టిలరీ ఉంది. 20 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు చేశారు. వేలాది మంది చెరకు సాగు రైతులు పరిశ్రమకు అనుబంధంగా ఉంటారు. 300 మంది వరకు కార్మికులు ప్రత్యక్షంగా పనిచేస్తారు. ఇక్కడ క్వార్టర్లను కార్మికులకే విక్రయించారు.
  • మెట్‌పల్లిలో 204 ఎకరాల్లో విస్తరించిన కర్మాగార సామర్థ్యం రోజుకు 2500 మె.ట. ఇక్కడ 120 ఫ్యాక్టరీ క్వార్టర్లు ఉన్నాయి. పర్మనెంట్‌ 200, సీజనల్‌ కార్మికులు 300 మంది. దాదాపు 4-5వేల ఎకరాల్లో చెరకు సాగయ్యేది. ఇప్పటికీ అక్కడ చెరకు సాగు చేస్తున్న రైతులు వంద కి.మీ పరిధిలోని కామారెడ్డి పరిశ్రమకు తరలిస్తున్నారు. గత ఏడాది 1.20లక్షల మె.ట, ఈ సారి 98 వేల మె.ట చెరకు దిగుబడి అయిందని అధికారవర్గాల ద్వారా తెలిసింది. వచ్చే ఏడాదికి 60వేల ఎకరాల వరకు సాగు చేస్తున్నట్లు సమాచారం.
  • మెదక్‌లో 153 ఎకరాల్లో ఉన్న కర్మాగారం సామర్థ్యం రోజుకు 1800 మె.ట. 10-15 మండలాల పరిధిలో 4500 హెక్టార్లలో చెరకు సాగయ్యేది. ఇక్కడ 280 మంది కార్మికులుండేవారు. వారి కోసం నిర్మించిన 130 క్వార్టర్లు ఉన్నాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని