logo

అగ్రనేతలు వస్తున్నారు

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.

Updated : 07 May 2024 06:17 IST

నేడు భారాస అధినేత కేసీఆర్‌ రోడ్‌ షో
జిల్లాకేంద్రానికి 10న ప్రియాంక, సీఎం రేవంత్‌రెడ్డిల రాక
ఈనాడు, కామారెడ్డి

పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న క్రమంలో రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మంగళవారం కామారెడ్డి జిల్లాకేంద్రంలో భారాస అధినేత కేసీఆర్‌ రోడ్‌షోలో పాల్గొని తర్వాత కూడలి సమావేశంలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ నెల 10వ తేదీ మధ్యాహ్నం 11 గంటలకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో నిర్వహించే భారీ బహిరంగసభకు కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హాజరుకానున్నారు.


బస్సుయాత్రపై ఆసక్తి

సార్వత్రిక ఎన్నికల్లో సత్తా చాటాలని భారాస భావిస్తోంది. పార్టీ అధినేత కేసీఆర్‌ బస్సుయాత్రతో మళ్లీ పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్‌ కామారెడ్డి నుంచి పోటీచేసి ఓటమి చెందిన విషయం తెలిసిందే. ఉద్యమగడ్డలో పట్టు నిలుపుకొనేందుకు భారాస మున్నూరుకాపు సామాజికవర్గానికి చెందిన గాలి అనిల్‌కుమార్‌ను బరిలో నిలిపింది. కేసీఆర్‌ వస్తుండడంతో మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, భారాస జిల్లాధ్యక్షుడు ముజీబొద్దిన్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ యాత్రతో పార్టీకి పూర్వవైభవం వస్తుందనే నమ్మకంతో పార్టీశ్రేణులు ఉన్నారు. మాజీ సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఈ రోడ్‌షోకు హాజరుకానున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత తొలిసారి నియోజకవర్గానికి వస్తున్న కేసీఆర్‌ ఏం మాట్లాడుతారనే దానిపై జిల్లాకేంద్రం ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఈ మార్గంలోనే..

కేసీఆర్‌ మంగళవారం సాయంత్రం 5 గంటలకు బస్సు యాత్ర ద్వారా నిజాంసాగర్‌ చౌరస్తాకు  చేరుకుంటారు. అక్కడి నుంచి రైల్వేస్టేషన్‌- సిరిసిల్ల రోడ్‌- పొట్టిశ్రీరాములు విగ్రహం రోడ్డు మీదుగా జయప్రకాశ్‌ విగ్రహం వరకు రోడ్‌షో సాగనుంది. అక్కడే ఏర్పాటు చేసిన కూడలి సమావేశంలో మాట్లాడనున్నారు. తర్వాత మెదక్‌లో జరిగే రోడ్‌షోకు బయలుదేరి వెళ్లనున్నారు.


ప్రియాంక సభకు భారీ ఏర్పాట్లు

ప్రియాంక సభకు కాంగ్రెస్‌ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌, బాన్సువాడ నుంచి భారీగా జనాన్ని సమీకరించేందుకు ప్రత్యేకంగా వాహనాలు సమకూర్చుతున్నారు. మధ్యాహ్నం సమావేశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏఐసీసీ ప్రతినిధులు సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.


సీఎం హోదాలో మొదటిసారి జిల్లాకు

రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తొలిసారి జిల్లాకు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గ ముఖ్యనేతలు, మేధావులు, ఇతరత్రా వర్గాల నేతలతో సమావేశాలు నిర్వహించి నియోజకవర్గంలో సమకూర్చాల్సిన మౌలిక వసతులు, ఇతరత్రా అవసరాలపై నివేదికను షబ్బీర్‌అలీ రూపొందిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని