logo

ఇందూరును గుండెల్లో పెట్టుకుంటా

‘‘నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్‌ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను.  ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు.

Published : 07 May 2024 06:19 IST

పోరాడేందుకు భారాసను గెలిపించాలి
కార్నర్‌ మీటింగ్‌లో గులాబీ దళపతి కేసీఆర్‌
ఈనాడు, నిజామాబాద్‌, న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

‘‘నేను గులాబీ జెండా ఎత్తిన నాడు.. నిజామాబాద్‌ నా వెంట నిలిచి జిల్లా పరిషత్తును గెలిపించింది. ఉద్యమాన్ని ఆకాశానికి ఎత్తింది. ఈ విషయాన్ని నేను ప్రాణం ఉన్నంత వరకు మరవను.  ఈ ప్రాంతాన్ని గుండెల్లో పెట్టుకుంటాను’’ అని భారాస అధినేత కేసీఆర్‌ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం సాయంత్రం నిజామాబాద్‌లో నిర్వహించిన రోడ్‌ షోలో ఆయన పాల్గొన్నారు. అనంతరం నెహ్రూ పార్క్‌ చౌరస్తాలో జరిపిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగించారు. ఆరు గ్యారంటీలంటూ హామీలిచ్చిన కాంగ్రెస్‌..వాటిని అమలు చేయటం లేదని మండిపడ్డారు. అవి అమలు కావాలంటే.. ప్రభుత్వం మెడలు వంచి .పోరాటం చేసేందుకు భారాస అభ్యర్థిని గెలిపించాలన్నారు నిజామాబాద్‌లో గత ఎన్నికల్లో భాజపా ఎంపీని గెలిపించారని..ఆయన వల్ల ఇక్కడ ఏం లాభం జరగలేదని విమర్శించారు. ఈ ప్రాంతం ఒకప్పుడు బంగారంలా ఉండేదని.. కాంగ్రెస్‌, తెలుగుదేశం ప్రభుత్వ విధానాలతో నిజాంసాగర్‌ను ఎండగొట్టి..పంటలను ఎండబెట్టారన్నారు. భారాస ప్రభుత్వం మల్లన్నసాగర్‌ను నిజాంసాగర్‌కు అనుసంధానం చేసి.. కాళేశ్వరం జలాలు వచ్చేలా చేసిందన్నారు.  పునరుజ్జీవ ద్వారా ఎస్సారెస్పీకి నీళ్లు వచ్చే ఏర్పాటు చేసి వరద కాలువను రిజర్వాయర్‌గా మార్చుకున్నామన్నారు.  మైనార్టీల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేశామని చెప్పారు. తమది సెక్యులర్‌ విధానన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థికి 20 శాతం ఓట్లు మాత్రమే వస్తున్నాయని.. ముస్లింలు ఆ పార్టీకి ఓటేస్తే భాజపా లాభపడుతుందన్నారు. మోసపూరిత మాటలు నమ్మొద్దని, ఆలోచన చేయాలని కోరారు. పులిలాంటి బాజిరెడ్డి గోవర్ధన్‌ను ఇక్కడ గెలిపించాలని చెప్పారు. తెల్లారితే విద్వేషాలు రెచ్చగొట్టే భాజపాకు ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు.

ప్రసంగిసున్న మాజీ సీఎం కేసీఆర్‌, హాజరైన ప్రజలు


భారాస శ్రేణుల్లో జోష్‌..

బస్సులో నుంచి ప్రజలకు అభివాదం చేస్తున్న మాజీ సీఎం కేసీఆర్‌, ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌, జీవన్‌రెడ్డి

నిజామాబాద్‌కు చేరుకున్న భారాస అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆ పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కంఠేశ్వర్‌ బైపాస్‌ రోడ్డు వద్ద మహిళలు మంగళహారతులతో స్వాగతం చెప్పారు. పాత కలెక్టరేట్‌ కూడలి నుంచి ర్యాలీ ప్రారంభమైంది. నెహ్రూ పార్క్‌ చౌరస్తా వరకు సాగింది. బస్సులో నుంచే కేసీఆర్‌ ప్రజలకు అభివాదం చేశారు. దారి పొడవునా బస్సుపై పూలు చల్లారు. బాణసంచా వెలుగులు విరజిమ్మాయి. అనంతరం నెహ్రూ పార్క్‌ కూడలిలో ఏర్పాటు చేసిన కార్నర్‌ మీటింగ్‌కు పెద్ద సంఖ్యలో జనం హాజరయ్యారు. కేసీఆర్‌ తెలుగు, ఉర్దూ భాషల్లో ప్రసంగించారు.  అధికారం కోల్పోయిన తర్వాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన గులాబీ దళపతి ప్రసంగం వినేందుకు కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. మీటింగ్‌ అనంతరం మాజీ ఎమ్మెల్యే గణేష్‌ గుప్తా ఇంటికి వెళ్లి బస చేశారు. మంగళవారం ఉదయం జిల్లాకు చెందిన ప్రముఖులతో ముచ్చటిస్తారు. సాయంత్రం కామారెడ్డి పట్టణంలో జరిగే రోడ్‌ షోలో పాల్గొంటారు.

మంగళహారతులతో స్వాగతం పలుకుతున్న మహిళలు


కుడకల దండ

బస్సు యాత్ర, రోడ్డు షో అనంతరం కేసీఆర్‌ నగరంలోని మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌ గుప్తా ఇంట్లో రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా మహారాష్ట్రకు చెందిన భారాస నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ రాష్ట్ర భారాస ఇన్‌ఛార్జి కల్వకుంట్ల వంశీ ఆధ్వర్యంలో నాయకులు శంకరన్న, సుధీర్‌ బిందు, గణేశ్‌ కదం తదితరులు అధినేతను కలిసి మాట్లాడారు. మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం కుడకలతో కూడిన దండను కేసీఆర్‌ మెడలో వేసి ఆరోగ్యం బాగుండాలని ఆకాంక్షించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని