logo

ఓటు పిలుస్తోంది.. రారండోయ్‌

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది.

Updated : 10 May 2024 06:19 IST

వరుసగా మూడు రోజులు సెలవులే

న్యూస్‌టుడే, మోర్తాడ్‌: రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు మరో నాలుగు రోజులే ఉంది. ఈ నెల 13వ తేదీన పోలింగ్‌ నిర్వహణకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అభ్యర్థుల ప్రచారం ముగింపు దశకు వచ్చింది. ప్రజాస్వామ్యానికి బలమైన ఆయుధం ఓటు మాత్రమేనని, ఈ విషయాన్ని మర్చిపోకుండా హక్కును సద్వినియోగం చేసుకోవాలని అధికార యంత్రాంగం స్వీప్‌ ఆధ్వర్యంలో 2కె, 5కె రన్‌ కార్యక్రమాలు, ఓటరు అవగాహన ర్యాలీలు, మహిళా సంఘాలకు ముగ్గుల పోటీలు, కరపత్రాల ఆవిష్కరణ వంటి కార్యక్రమాలు చేపట్టి అవగాహన కల్పించింది. ఇక మిగిలింది ఓటర్ల వంతే.. ఎక్కడున్నా పోలింగ్‌కేంద్రం బాట పట్టి వజ్రాయుధాన్ని వినియోగించుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని గెలిపించి తీరాలి.

విద్యాసంస్థలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటించింది. మండే ఎండల్లో చల్లని ప్రదేశాలకు విహారయాత్రలకు వెళ్లడం కొందరి అలవాటు. అయితే 13వ తేదీ సోమవారం పోలింగ్‌ సందర్భంగా సెలవు కాగా దానికి ముందు రెండో శనివారం, ఆదివారం సాధారణ సెలవు. వరుసగా మూడు రోజులు సెలవులు వస్తున్నాయని ఇంటిల్లిపాదీ ఎక్కడికైనా వెళ్లాలనుకుంటే జీవితంలో విలువైన క్షణాలను కోల్పోయి మంచి భవిష్యత్తును ఇచ్చే నాయకుడిని కోల్పోయిన వారమవుతాం. ఎక్కడున్నా ఓటేయడానికే సెలవిచ్చారని గుర్తుంచుకోవాలి. పోలింగ్‌కు ఒకరోజు ముందు అంటే ఆదివారమే స్వస్థలాలకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలి.

యువత భవిత  మీదే..

దేశ భవిష్యత్తు యువత చేతిలోనే ఉంది. ఉద్యోగ, ఉపాధి కోసం చాలా మంది స్వస్థలాలకు దూరంగా పట్టణ, నగర ప్రాంతాలకు వెళ్లి ఉంటారు. ఈసారి పోలింగ్‌కు ముందురోజు కూడా సెలవు వస్తున్నందున సొంత ప్రాంతాలకు చేరుకుంటే సొంత ప్రాంతంలో ఉపాధి కల్పించేనాయకుడిని ఎన్నుకోవచ్చు. ఉపాధి కోసం వేరే ప్రాంతాలకు వెళ్లే బాధ తప్పుతుంది.

గంట పొడిగింపుతో  ఉపశమనం...

ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు వెళ్లాలంటే భయం వేస్తోంది. ఈక్రమంలో పోలింగ్‌ కూడా అగ్ని పరీక్షగా మారింది. భానుడి ప్రతాపాన్ని గుర్తించిన ఎన్నికల సంఘం పోలింగ్‌ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించింది. ఇది వృద్ధులు, మహిళలకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులంతా ఉదయం 7 గంటల నుంచి 11 గంటల లోపే ఓటు వేసి రావడం ద్వారా ఎండదెబ్బ బారిన పడకుండా ఉంటాము. అలాగే ఉదయం వీలుపడని వారు సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని