logo

మోదీ ఉంటేనే దేశం సురక్షితం

దేశం అభివృద్ధి పథంలో, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు.

Published : 10 May 2024 02:49 IST

కంఠేశ్వర్‌ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ప్రసంగిస్తున్న తమిళిసై, చిత్రంలో ఎంపీ అర్వింద్‌, అర్బన్‌ ఎమ్మెల్యే ధన్‌పాల్‌, నాయకులు

నిజామాబాద్‌ నగరం, న్యూస్‌టుడే: దేశం అభివృద్ధి పథంలో, సురక్షితంగా, ఆరోగ్యంగా ఉండాలంటే మళ్లీ నరేంద్ర మోదీ ప్రధాని కావాలని తెలంగాణ మాజీ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో గురువారం నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌కు ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పేదరిక నిర్మూలన జరగాలంటే బలమైన వ్యక్తి ప్రధానిగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిజామాబాద్‌ అభివృద్ధి చెందాలంటే మరోసారి అర్వింద్‌ను గెలిపించాలని, ఆయన రైతుల మిత్రుడని, పసుసు బోర్డు సాధించారని ప్రశంసించారు. గతంలో పోటీ చేసిన కేసీఆర్‌ కూతురు కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. ఎంపీ అర్వింద్‌ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు దేశానికి ఎంతో కీలకమని, హిందువులు తమ సంస్కృతి, సంప్రదాయాలు కాపాడుకోవాలంటే తప్పక గెలవాలన్నారు. నేడు ఉగ్రవాద సంస్థలు కాంగ్రెస్‌కు బహిరంగంగా మద్దతు తెలుపుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి జీవన్‌రెడ్డి శరణార్థి హిందువులకు పౌరసత్వం ఇవ్వొద్దని పీఎఫ్‌ఐ సంస్థతో కలిసి ధర్నాలు చేస్తున్నారని, బంగ్లాదేశ్‌, మయన్మార్‌ నుంచి వచ్చిన రోహింగ్యాలకు పౌరసత్వం ఇవ్వాలని కొట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. త్రిపుల్‌ తలాక్‌కు వ్యతిరేకంగా నిరసనలు తెలిపారని పేర్కొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి హిందువులను భిచ్చగాళ్లంటూ దూషిస్తున్నారని పేర్కొన్నారు. దేవుడు గుడిలో ఉండాలి.. భక్తి గుండెలో ఉండాలి ఉంటున్న ముఖ్యమంత్రికి మసీదుల నుంచి వచ్చే చప్పుడు వినపడటం లేదా? అని ప్రశ్నించారు. ఈ సారి ముస్లిం మహిళలు సైతం మోదీకి ఓటేస్తారని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో అర్బన్‌ ఎమ్మెల్మే ధన్‌పాల్‌ సూర్యనారాయణ, నాయకులు పల్లె గంగారెడ్డి, న్యాలం రాజు, స్రవంతి రెడ్డి, లక్ష్మీనారాయణ, కార్పొరేటర్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని