logo

పాఠశాలల అభివృద్ధికి రూ.39.38 కోట్లు

ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది.

Published : 10 May 2024 02:51 IST

దొంకల్‌ ప్రాథమిక పాఠశాలలో కొనసాగుతున్న మరుగుదొడ్ల మరమ్మతు పనులు

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ విద్యావిభాగం: ప్రభుత్వ పాఠశాలల పర్యవేక్షణలో ‘అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ’ల పేరుతో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేసి వారి సహకారంతోనే బడుల్లో మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ మేరకు జిల్లాలో ప్రభుత్వ పాఠశాలలను బాగు చేసేందుకు రూ.39.38 కోట్లు కేటాయించారు. వీటితో పనులు పూర్తి చేసే బాధ్యతను కమిటీలకు అప్పగించారు. గత నెల గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ అధికారులు, పట్టణ ప్రాంతాల్లో పురపాలిక అధికారులు, పీఆర్‌ అధికారులు పనులకు సంబంధించి ప్రతిపాదనలు అందించారు. జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు వాటికి అమోదం తెలిపారు. పది శాతం నిధుల్ని మండలాభివృద్ధి అధికారి ఖాతాల్లోకి జమ చేయించారు. ఇప్పటికే కొన్ని చోట్ల పనులు ప్రారంభమయ్యాయి.  

నిధుల కేటాయింపు ఇలా..

జిల్లాలో మొత్తం 1156 ప్రభుత్వ, స్థానిక సంస్థలకు చెందిన పాఠశాలలున్నాయి. అమ్మ ఆదర్శ కమిటీలతో పనులు చేపట్టేందుకు 792 బడులను గుర్తించగా వీటిలో విద్యార్థుల నమోదు లేనివి, విలీన బడులను తొలగించారు. 739 పాఠశాలల్లో వెంటనే మరమ్మతులు అవసరమని ఇంజినీరింగ్‌ అధికారులు తేల్చారు. ప్రస్తుతం 549 పాఠశాలల్లో మరమ్మతులు, విద్యుత్తు సరఫరా, మరుగుదొడ్ల నిర్మాణం వంటివి చేపట్టనున్నారు. జూన్‌ 10వ తేదీనాటికి పనులన్నీ పూర్తి చేయాలని ఆదేశాలున్నాయి. లక్ష్యాన్ని చేరేందుకు విద్యాశాఖ, ఇంజినీరింగ్‌ అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఎన్నికల తర్వాత వేగం

ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల పనుల్లో అధికారులు తీరిక లేకుండా ఉన్నారు. దీంతో పర్యవేక్షణ లేక కొంత నెమ్మదిగా సాగుతోంది. ఈ నెల 13న పోలింగ్‌ ముగిశాక పనుల్లో వేగం పెరగనుంది. గతంలో ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో చేసిన పనులకు ఇంతవరకు నిధులు రాలేదు.  

గడువులోపు పూర్తి

జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీ హన్మంతు, డీఈవో దుర్గాప్రసాద్‌ ఆదేశాలతో అమ్మ ఆదర్శ కమిటీలతో పాఠశాలల్లో మరమ్మతులు చేపట్టాం. ప్రస్తుతం అధికారులు ఎన్నికల హడావుడిలో ఉన్నారు. నిర్దేశించిన గడువులోపు పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

శ్రీధర్‌రెడ్డి, ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌, జిల్లా విద్యాశాఖ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని