logo

2024 ఒడిశాలో కమలం వికసించాలి

బిజదకు దిల్లీలో బాస్‌లు లేరని, నాలుగున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజలు వారి యజమానులని ఆ పార్టీ పెద్దలు అంటున్నారని, వాస్తవానికి హస్తినలో సేవకులు పాలిస్తున్నారని, 130 కోట్ల ప్రజల బాస్‌ జగన్నాథుడన్న వాస్తవాన్ని

Published : 01 Oct 2022 01:48 IST

 ఇప్పటి నుంచే భాజపా కార్యకర్తలు ఉద్యమించాలి

 7 మోర్చాల ప్రతినిధులకు నడ్డా ఉద్బోధ

నడ్డాకు జగన్నాథుని ఫోటో బహూకరిస్తున్న ధర్మేంద్ర, సమీర్‌లు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: బిజదకు దిల్లీలో బాస్‌లు లేరని, నాలుగున్నర కోట్ల మంది రాష్ట్ర ప్రజలు వారి యజమానులని ఆ పార్టీ పెద్దలు అంటున్నారని, వాస్తవానికి హస్తినలో సేవకులు పాలిస్తున్నారని, 130 కోట్ల ప్రజల బాస్‌ జగన్నాథుడన్న వాస్తవాన్ని బిజద నేతలు విస్మరిస్తున్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. భువనేశ్వర్‌ జనతా మైదానంలో శుక్రవారం (రెండో రోజు) భాజపా యువ, మహిళా, ఛాత్ర, మైనార్టీ, కృషక్‌, ఎస్సీ, ఎస్టీ మోర్చా కార్యకర్తల సమావేశం ఏర్పాటైంది.
సైనికుల్లా ఉద్యమించండి
రాష్ట్రంలో ఉత్తమ పాలన, అందరికీ సమాన న్యాయం, సమగ్రాభివృద్ధి ధ్యేయం నెరవేరాలంటే ఇక్కడ భాజపా అధికారంలోకి రావాలన్నారు. ఈ దిశగా 7 మోర్చాల కార్యకర్తలు సైనికుల్లా ఉద్యమించాలన్నారు. మోదీ పాలనలో జరిగిన అభివృద్ధి, రాష్ట్రానికి జరిగిన కేటాయింపులు ప్రజలకు వివరించి ఇక్కడి అవినీతి పాలన, వైఫల్యాలు చాటి చెప్పాలన్నారు. భాజపాలో సభ్యత్వాలు పెంచాలన్న నడ్డా 2024లో ఒడిశాలో కమల వికాసం తధ్యమన్నారు డబుల్‌ ఇంజిన్‌ పాలన ధ్యేయంగా కార్యకర్తలు కలిసిమెలసి పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్‌, భాజపా రాష్ట్ర శాఖ అధ్యక్షుడు సమీర్‌ మహంతి ఇతర నాయకులు ప్రసంగించారు.
బిష్ణుశెఠికి శ్రద్ధాంజలి
ఉదయం భద్రక్‌ జిల్లా తిహిడి చేరుకున్న నడ్డా భాజపా సభాపక్షం ఉపనేత బిష్ణుశెఠి మృతికి సంతాపం తెలిపారు. శెఠి కుటుంబ సభ్యులను కలుసుకుని పరామర్శించిన ఆయన పార్టీ అండగా ఉంటుందన్నారు. తిహిడి కళాశాల ఆవరణలో ఏర్పాటైన సంతాపసభలో పాల్గొన్న నడ్డా సాహితీ, రాజకీయ రంగాల్లో శెఠి చేసిన సేవలు ప్రస్తుతించారు. తర్వాత కటక్‌ జిల్లా ఒలటపూర్‌లో ఏర్పాటైన ఆసుపత్రి భవనాన్ని నడ్డా ప్రారంభించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని