logo

పనిచేయని బిజూ కార్డు.. ఆగిన శస్త్రచికిత్స

బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్‌ జిల్లాలో జరిగింది.

Published : 26 Apr 2024 02:22 IST

బిజు కార్డును చూపిస్తున్న మిధున్‌ దంపతులు

జయపురం, న్యూస్‌టుడే: బిజు కార్డు పని చేయకపోవడంతో ఎనిమిదేళ్ల బాలుడికి చేయవలసిన శస్త్రచికిత్స ఆపేశారు. గత్యంతరం లేక బాలుడిని పట్టుకొని తల్లిదండ్రులు ఇంటికి తిరిగొచ్చిన ఘటన నవరంగపూర్‌ జిల్లాలో జరిగింది. వివరాల్లోకి వెళితే... రాయ్‌ఘర్‌ సమితి గోన పంచాయతీ డీఎన్‌కే గ్రామానికి చెందిన మిధున్‌ హల్దార్‌ కుమారుడు పీయూష్‌కు రెండు రోజుల క్రితం కడుపులో నొప్పి రావడంతో నవరంగపూర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తీసుకెళ్లారు.  పరీక్షించిన వైద్యులు అపెండిసైటిస్‌ శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. తన వద్ద బిజూ కార్డు ఉందని చికిత్స ప్రారంభించాలని మిధున్‌ చెప్పడంతో గురువారం ఆపరేషన్‌కి సిద్ధం చేశారు. బిల్లు చెల్లిస్తున్న సమయంలో కార్డు పని చేయలేదు. ఆసుపత్రి సిబ్బంది వైద్యులకు తెలియజేయడంతో ఆపరేషన్‌ నిలిపేశారు. ఆర్థిక స్థోమత లేక మిధున్‌ కుమారుడిని తీసుకుని ఇంటికి వెళ్లిపోయాడు. ఈ కార్డులు మే తర్వాత యాక్టివ్‌ అవుతాయని తెలుసుకున్న మిధున్‌ గురువారం మీడియాతో మాట్లాడుతూ పనికిరాని కార్డులు ఎరవేసి బిజద ఓట్లు అడుక్కుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్డులు మే నుంచి పనిచేస్తే సిట్టింగ్‌ ఎంపీ రమేష్‌ చంద్ర మాఝి, జిల్లా బిజద అధ్యక్షుడు నవీన్‌ నాయక్‌ ఫిబ్రవరిలో ఎందుకు ప్రజలకు అందజేశారని ప్రశ్నించారు. యంత్రాంగం తనిఖీలు నిర్వహించి కార్డులు తక్షణం పని చేసేలా చేయాలని, ఇందుకు తగు చర్యలు తీసుకోవాలని, తన కుమారుడి చికిత్స కోసం సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు