logo

రాటుదేలిన యోధులు... ఎవరో విజేతలు?

రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్‌ లోక్‌సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది.

Published : 26 Apr 2024 02:31 IST

ప్రతాప్‌, శ్రీకాంత్‌, లేఖశ్రీల మధ్య ముక్కోణ పోరు
అందరి దృష్టి బాలేశ్వర్‌ లోక్‌సభ స్థానంపైనే

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: రాజకీయాల్లో రాటుదేలిన ముగ్గురు యోధుల మధ్య బాలేశ్వర్‌ లోక్‌సభ పరిధిలో ఈసారి ఎన్నికల సంగ్రామం సాగుతోంది. ఇది రాష్ట్ర ప్రజలందరి దృష్టినీ అకర్షిస్తోంది. ఓటర్లు ఎవర్ని ఆదరిస్తారు. విజయలక్ష్మి ఎవరి సొంతమవుతుందన్నదిప్పుడు చర్చనీయాంశమైంది.

అందరి బంధువు ప్రతాప్‌

బాలేశ్వర్‌ సిటింగ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగి అందరి బంధువుగా ముద్రపడ్డారు. ఆధ్యాత్మిక భావాలు గల ఆయనను సర్వసంగ పరిత్యాగిగా అందరూ పేర్కొంటారు. దిగజారుడు రాజకీయాలకు దూరంగా, ప్రజలకు చేరువగా ఉంటారు. డాబు, దర్పం లేని ఆయనకు ప్రధాని నరేంద్రమోదీ అభిమానిస్తారు. బాలేశ్వర్‌ వాసులు ప్రతాప్‌ను ‘అన్నయ్య’గా ‘గురు’గా పిలుస్తారు. గడిచిన అయిదేళ్లు ఎంపీగా, కొన్నాళ్లు కేంద్ర సహాయ మంత్రిగా శ్రద్ధతో విధులు నిర్వహించిన ఆయన రెండోసారి భాజపా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రతాప్‌ ప్రచారం సాదాసీదాగా జరుగుతోంది. ఎలాంటి అట్టహాసం లేదు. కేంద్రంలో మంత్రిగా పనిచేసిన ఆయన ఏడు పదుల ప్రాయంలో సైకిల్‌పై గ్రామాల్లో పర్యటిస్తూ తనకు మరోసారి ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుతున్నారు. జన్మభూమికి సేవచేసే అవకాశం కల్పించాలని విన్నవిస్తున్నారు.

మోదీ గ్యారంటీ అండగా ఉంది

గురువారం బాలేశ్వర్‌లోని నీలగిరిలో ప్రచారం చేసిన ప్రతాప్‌ విలేకరులతో మాట్లాడుతూ... జనం అండదండలు, మోదీ గ్యారంటీ తన విజయానికి తారక మంత్రమని చెప్పారు. అధికారం కోసం సిద్ధాంతాలకు పాతరేసే వారికి ఓటర్లు బుద్ధి చెబుతారని పరోక్షంగా లేఖశ్రీ సామంతని విమర్శించారు.

తొలిసారి ఎన్నికల బరిలో: లేఖశ్రీ సామంత శింగార్‌ రాష్ట్ర ప్రజలకు చిరపరిచితురాలు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె గతంలో అధ్యాపకురాలిగా విధులు నిర్వహించారు. విద్యార్థి దశ నుంచి ఆరెస్సెస్‌ సిద్ధాంతాలు జీర్ణించుకున్న ఆమె ఉద్యోగం వదులుకుని భాజపాలో చేరి అగ్రనేతగా గుర్తింపు పొందారు. ఆ పార్టీలో ‘ఫైర్‌బ్రాండ్‌’గా ముద్ర పడిన ఆమె గడిచిన పదేళ్లు నవీన్‌ ప్రభుత్వ వైఫల్యాలు కడిగేశారు. ఊహించని విధంగా ఈసారి ఎన్నికల ముందుగా కాషాయం కండువా పడేసి బిజద గూటికి చేరారు. దీంతో ఆమెను సీఎం బాలేశ్వర్‌ లోక్‌సభ అభ్యర్థిగా చేశారు. రాజకీయాల్లో రాటుదేలిన ఆమె తనదైన శైలిలో ప్రచారం చేస్తున్నారు. నవీన్‌ అండదండలతో బాలేశ్వర్‌ ప్రాంతాలను అన్ని రంగాల్లో అభివృద్ధిలోకి తెస్తానని, లోక్‌సభలో రాష్ట్ర ప్రజల వాణి వినిపిస్తానని, తనను గెలిపించాలని కోరుతున్నారు.
ప్రతిభాశాలి:   శ్రీకాంత్‌ జెనా... రాష్ట్ర రాజకీయాల్లో ప్రతిభాశాలిగా గుర్తింపు పొందారు. గతంలో కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న ఆయన కేంద్రంలో వివిధ శాఖల మంత్రిగా విధులు నిర్వహించారు. గొప్ప వ్యూహకర్తగా గౌరవం అందుకున్నారు. ప్రలోభాలకు లొంగరని, విలువలకు కట్టుబడతారని పార్టీ నేతలంటారు. కాంగ్రెస్‌లో నాటి సిద్ధాంతాలకు నాయకులు తిలోదకాలిచ్చారని, వ్యక్తి పూజలకు పెద్ద పీట వేస్తున్నారన్న అసంతృప్తితో కొన్నాళ్లు ఆ పార్టీకి దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికల్లో పోటీ చేయని ఆయన ఈసారి పార్టీకి దగ్గరయ్యారు. ఆ పార్టీ అభ్యర్థిగా బాలేశ్వర్‌లో అదృష్టం పరీక్షించుకుంటున్నారు.
నా గురించి ఓటర్లకు తెలుసు: శ్రీకాంత్‌ బాలేశ్వర్‌లోని భస్తా ప్రాంతంలో విలేకరులతో మాట్లాడుతూ...తన గురించి ఓటర్లకు తెలుసని, తన రాజకీయ జీవితం తెరిచిన పుస్తకమన్నారు. జనం మళ్లీ తనను కోరుకున్నారని, పోటీ చేయాలని అందరూ కోరడంతో బరిలోకి దిగిన తనకు ఓటర్లు ఆదరిస్తారన్న పూర్తి నమ్మకం ఉందన్నారు.
అభివృద్ధే నా అజెండా: బాలేశ్వర్‌లోని బలియాపాల్‌ ప్రాంతంలో లేఖశ్రీ విలేకరులతో మాట్లాడుతూ.. అభివృద్ధే అజెండాగా చేసుకున్న తనకు నవీన్‌ అండగా నిలిచారని, ఆయనతో రానున్న అయిదేళ్లు కలిసి పనిచేసి జన్మభూమి రుణం తీర్చుకోవాలన్నది తన జీవితాశయమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని