logo

నవీన్‌ ప్రభుత్వాన్ని గద్దె దించండి

సామర్థ్యం కొరవడిన నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు.

Published : 26 Apr 2024 02:24 IST

భాజపాకు అయిదేళ్లు అవకాశమివ్వండి
సోన్‌పూర్‌ భాజపా సంకల్ప సమావేశంలో అమిత్‌షా

ప్రజలకు అభివాదం చేస్తున్న అమిత్‌షా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: సామర్థ్యం కొరవడిన నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని గద్దె దించాలని, అయిదేళ్లు భాజపాకు అవకాశం ఇవ్వాలని, ఒడిశాను దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దుతామని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా పిలుపునిచ్చారు. గురువారం సాయంత్రం సోన్‌పూర్‌లోని రామేశ్వర్‌ మైదానంలో రాష్ట్ర భాజపా నాయకత్వం చేపట్టిన విజయ సంకల్ప ఎన్నికల బహిరంగ సభలో పాల్గొన్న షా నవీన్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. 25 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన ఆయన ఏం సాధించారు? ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. కేంద్రంలో పదేళ్లు అధికారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోదీ పాలనలో దేశం పురోగతి బాట పట్టిందని జమ్ము కాశ్మీరానికి 370వ అధికరణ రద్దుతో స్వేచ్ఛకు బాటలు పడ్డాయన్నారు. దీర్ఘకాలంగా నలిగిన అయోధ్య రామజన్మభూమిలో దేదీప్యమైన రామాలయ నిర్మాణం జరిగిందని, పాకిస్థాన్‌ తిరుగుబాటుదారులకు, ఉగ్రవాద శక్తులను తిప్పికొట్టారని, మావోయిస్టుల కార్యకలాపాలు తగ్గుముఖం పట్టాయన్నారు.పేదలకు కేంద్రం ఉచితంగా బియ్యం కేటాయిస్తే ఇది తామే ఇస్తున్నామని నవీన్‌ ప్రజలకు అవాస్తవాలు చెబుతున్నారన్నారు.

వలసలు నివారిస్తాం: రాష్ట్రం నుంచి ముంబయి, గుజరాత్‌, దిల్లీ బెంగళూరు ప్రాంతాలకు తరలుతున్నారని, భాజపా అధికారంలోకి వస్తే పరిశ్రమలు ఏర్పాటు చేసి వలసలు ఆపుతామన్నారు.
పూరీకి అంతర్జాతీయ ఖ్యాతి: భాజపా అధికారంలోకి వస్తే పూరీ శ్రీక్షేత్రాన్ని కాశీ విశ్వనాథ్‌ క్షేత్రం తరహాలో అభివృద్ధి, సౌకర్యాలు కల్పించి అంతర్జాతీయ ఖ్యాతి కల్పిస్తామన్నారు.  
20 లోక్‌సభ సీట్లు అవసరం: ఈసారి కేంద్రంలో ఏన్డీయేకు 400 సీట్లు అవసరమని మోదీ పునరుద్ఘాటిస్తున్న తరుణంలో రాష్ట్ర ప్రజలు 20 లోక్‌సభ స్థానాల్లో విజయం చేకూర్చాలని డబుల్‌ ఇంజిన్‌ పాలనకు ఓట్లేయాలని అమిత్‌ షా పిలుపునిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు