logo

ఝార్సుగుడలో రాజకీయకోలాహలం

ఝార్సుగుడలో ఉపఎన్నిక భేరీ మోగడంతో రాజకీయ కోలాహలం మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి.

Published : 31 Mar 2023 02:51 IST

బలాలు, బలహీనతలపై దృష్టి సారించిన పార్టీలు

విజయావకాశాలపై అగ్రనేతల ధీమా

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఝార్సుగుడలో ఉపఎన్నిక భేరీ మోగడంతో రాజకీయ కోలాహలం మొదలైంది. ప్రధాన పార్టీలు ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. బలాలు, బలహీనతలపై దృష్టి సారించాయి. 2024 సాధారణ ఎన్నికల ముందు జరగనున్న ఝార్సుగుడ ఉప ఎన్నికను సెమీ ఫైనల్‌ పోరుగా భావిస్తున్నారు. అన్ని పార్టీలు విజయావకాశాలపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

కమల వికాసం తథ్యం

పశ్చిమ ఒడిశా జిల్లాల్లో బూత్‌ స్థాయిలో భాజపాకు బలమైన శ్రేణులున్నాయి. ఆ పార్టీ రాష్ట్రశాఖ కార్యదర్శి టంకధర్‌ త్రిపాఠికి ఝార్సుగుడ నియోజకవర్గంలో మంచి పేరు ప్రతిష్ఠలున్నాయి. పారిశ్రామిక సంస్థలు, కార్మిక సంఘాలతో సత్సంబంధాలున్నాయి. ఆయనకు విజయావకాశాలు పుష్కలంగా ఉన్నాయని విశ్వసిస్తున్న పార్టీ నాయకత్వం టంకధర్‌ను బరిలోకి దించాలన్న ధ్యేయంతో ఉంది. భాజపా సభాపక్షం కార్యదర్శి మోహన్‌ మాఝి బుధవారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. ఖనిజ సంపదల నిలయమైన ఝార్సుగుడ ప్రాంతాల్లో సౌకర్యాలు అధ్వానంగా ఉన్నాయన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు నామమాత్రంగా ఉన్నందున సానుభూతి పని చేయదన్నారు. భాజపాకు బలమైన క్యాడర్‌, ప్రజాదరణ ఉన్నందున పార్టీ అభ్యర్థి గెలుపు సాధిస్తారన్నారు.

సానుభూతి, అభివృద్ధి పనులు

మాజీమంత్రి నబకిశోర్‌ దాస్‌ హత్యతో ఆయన కుటుంబం పట్ల ప్రజల్లో సానుభూతి ఉందని బిజద నేతలు చెబుతున్నారు. 2009, 2014లలో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఝార్సుగుడ నుంచి పోటీ చేసి గెలిచిన నబకిశోర్‌ 2019 ఎన్నికల ముందు బిజదలో చేరి ఆ పార్టీ టిక్కెట్‌తో బరిలోకి దిగి హ్యాట్రిక్‌ సాధించారు. తన హయాంలో అభివృద్ధి పనులు చేశారు. ప్రజాదరణ ఉన్న నేతగా నిరూపించుకున్నారు. బిజద విజయానికి ఇదంతా కలిసొస్తుందన్న నమ్మకం ఆ పార్టీ నాయకుల్లో బలంగా ఉంది. బుధవారం రాత్రి బిజద ఉపాధ్యక్షుడు దేవీ ప్రసాద్‌ మిశ్ర భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. పద్మపూర్‌ మాదిరిగా ఝార్సుగుడలో భారీ ఆధిక్యతతో బిజద విజయం తథ్యమన్నారు. ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ అభ్యర్థి ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారని, ఆ వెంటనే ప్రచారం ప్రారంభిస్తామన్నారు.

సంతోష్‌ సింగ్‌ నాయకత్వంలో సంఘం

నబకిశోర్‌ దాస్‌ 2019లో కాంగ్రెస్‌ వీడిన తర్వాత ఆ పార్టీకి బలమైన నాయకత్వం లేదు. కొంతమంది కార్యకర్తలు బిజదలో చేరారు. ప్రస్తుత ఝార్సుగుడ జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అశోక్‌ మిశ్రా ఈసారి పోటీ చేయడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ బుధవారం రాత్రి భువనేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కంటాబంజి ఎమ్మెల్యే సంతోష్‌ సింగ్‌ సలూజా అధ్యక్షతన అయిదుగురు సభ్యులతో పరిశీలన సంఘం ఏర్పాటు చేశామన్నారు. ఈ సంఘం ఝార్సుగుడలో పరిస్థితి అధ్యయనం చేసి అభ్యర్థిగా ఎవరిని నిలపాలో నివేదిక ఇస్తుందన్నారు. తర్వాత అధిష్ఠానం అధికారికంగా అభ్యర్థి పేరు ప్రకటిస్తుందన్నారు. క్షీణించిన శాంతిభద్రతలు, తాగునీటి ఎద్దడి, నిరుద్యోగం, అన్నదాతల ఇబ్బందులను కాంగ్రెస్‌ ప్రచారాస్త్రాలుగా చేస్తుందన్నారు. విజయంపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని