logo

కాంగ్రెస్‌కు పూర్వవైభవం దక్కేనా

కొరాపుట్‌ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి.

Published : 27 Apr 2024 05:58 IST

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లాలోని అయిదు నియోజకవర్గాలు ఒకప్పుడు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేవి. ఆ పార్టీలో నెలకొన్న వివాదాలు పార్టీకి తీవ్ర నష్టాన్ని తీసుకువస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్‌ను నడిపించే రథసారథి కరవయ్యారు. 2019 ఎన్నికల్లో కేవలం జయపురంలో మాత్రమే కాంగ్రెస్‌ గెలుపొందింది. మిగతా నియోజకవర్గాలు పొట్టంగి, లక్ష్మీపూర్‌, కొట్పాడు, కొరాపుట్‌లో బిజదదే పైచేయి. దీంతో శంఖం పార్టీ విజయావకాశాలు మెరుగయ్యాయి.

విభేదాలతో బలహీనం

జిల్లాలో కాంగ్రెస్‌ రెండు వర్గాలుగా చీలి విభేదిస్తున్నాయి. గతంలో జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా మీనాక్షి వాహనిపతి కొనసాగుతున్న సమయంలో 2022లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాలేదు. దీంతో ఓ వర్గం అధిష్ఠానంపై ఒత్తిడి తెచ్చి మీనాక్షిని తొలగించి దుర్గాశంకర్‌ సాహును అధ్యక్షుడిగా నియమించేలా చేసింది. ఆయనతోనూ కొంతమందికి వివాదాలు తలెత్తడంతో తొమ్మిది నెలలకే పదవి నుంచి తొలగించారు. అనంతరం సీనియర్‌ నేత శశి భూషణ్‌ పాత్ర్‌ను నియమించారు. కొన్ని నియోజకవర్గాల్లో ఇటీవల సమితి కాంగ్రెస్‌ అధ్యక్షులను సైతం మార్చేశారు. పార్టీలో సరైన నాయకత్వం కరవవడంతో కాంగ్రెస్‌ బలహీనపడుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

జయపురంపైనే ప్రధాన పార్టీల కన్ను..

ప్రాధాన్యత సంతరించుకున్న జయపురం నియోజకవర్గంలో కాంగ్రెస్‌తోపాటు బిజద, భాజపా పార్టీలు తమ జెండా ఎగరవేసేందుకు చూస్తున్నాయి. హ్యాట్రిక్‌ సాధించాలని సిటింగ్‌ ఎమ్మెల్యే వాహినిపతి విశ్వ ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఆయనను ఓడించాలని బిజద మహిళా అభ్యర్థి ఇందిరా నందోను బరిలో నిలిపింది. భాజపా సైతం ఈ నియోజకవర్గం దక్కించుకునేందుకు, కాంగ్రెస్‌, బిజదను ఢీకొట్టే నేతను బరిలో దించేందుకు యోచిస్తోంది. ఈ నియోజకవర్గంలో 1951 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో తొమ్మిదిసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. రఘునాథ్‌ పట్నాయక్‌ (కాంగ్రెస్‌) ఆరుసార్లు, గుప్త ప్రసాద్‌ దాస్‌ (కాంగ్రెస్‌), రబి నారాయణ నందో (బిజద) మూడుసార్లు, 2014, 2019లలో తారాప్రసాద్‌ (కాంగ్రెస్‌) ఎమ్మెల్యేలుగా గెలుపొందారు.

పొట్టంగికి ప్రాతినిధ్యం వహించేది ఎవరో?

పొట్టంగి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ నేతల మధ్య నెలకొన్న విభేదాలతో ఇక్కడ కాంగ్రెస్‌కు అనుకూల పరిస్థితి కనిపించడం లేదు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్యే రామ్‌చంద్ర కడమ్‌కు టికెట్‌ ఇవ్వడంతో పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందా అన్న అనుమానం పలువురిలో వ్యక్తమవుతోంది. 2014, 2019 ఎన్నికల్లో ఓటమి పాలైన హస్తం ఈసారైనా పొట్టంగి సింహాసనం అధిష్ఠిస్తోందో లేదో వేచి చూడాలి.

లక్ష్మీపూర్‌లో వ్యతిరేకత

లక్ష్మీపూర్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌కు వ్యతిరేకత కనిపిస్తుండడంతో బిజద, భాజపాల మధ్య ప్రధాన పోటీ నెలకొనే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులంటున్నారు. చాలా మంది అభ్యర్థులు టికెట్‌ రేస్‌లో ఉండగా పవిత్ర శాంతకు అవకాశం ఇవ్వడంతో పార్టీలో అసంతృప్తి నెలకొంది. కొంతమంది రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఇక్కడ హస్తం పార్టీనే ఎక్కువసార్లు గెలుపొందింది. ఈసారి అభ్యర్థి ఎంపికలో జాగ్రత్తలు తీసుకోలేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

కొట్పాడులో నాయకత్వం కరవు..

హస్తం పార్టీకి అనుకూలమైన కొట్పాడు నియోజకవర్గంలోనూ నాయకత్వం కరవవుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. 1961 నుంచి 14 సార్లు జరిగిన ఎన్నికల్లో 11 సార్లు కాంగ్రెస్‌ గెలిచింది. బసుదేవ్‌ మాఝి 8 సార్లు గెలుపొందడం గమనార్హం. 1961లో మహదేవ్‌ బకరా, 1967లో సూర్యనారాయణ మాఝి, చంద్రశేఖర్‌ మాఝి కాంగ్రెస్‌ తరఫున, 1971లో స్వతంత్ర పార్టీ, 1990లో జనతా పార్టీ, 2019లో బిజద అభ్యర్థులు గెలుపొందారు. కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలమైన నియోజకవర్గం కావడం విశేషం. తాజా ఎన్నికల్లో అన్నమ్‌ దియాన్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉండగా, కాంగ్రెస్‌ నుంచి బిజదలో చేరిన చంద్రశేఖర్‌ మాఝి ఆ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.

కొరాపుట్‌లో హస్తం స్థితి మెరుగుపడేనా?

కొరాపుట్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ స్థితి మెరుగుపడుతుందా అన్నది అంతు చిక్కడం లేదు. ఇక్కడ ఇంతవరకు ఆరుసార్లు కాంగ్రెస్‌, రెండుసార్లు బిజద (2009, 2019లో), రెండుసార్లు జనతా పార్టీ, రెండుసార్లు గణతంత్ర పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థి కృష్ణ కుల్‌దీప్‌ రెండోసారి బిజదను ఢీకొట్టనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని