logo

బిజదలో చేరికలు

బ్రహ్మపుర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు.

Published : 27 Apr 2024 05:46 IST

వార్డు ప్రజలతో కలిసి బిజదలో చేరిన సనాతన సాహు

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: బ్రహ్మపుర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఈఎంసీ) అయిదో వార్డుకు చెందిన యువ నాయకుడు సనాతన సాహు శుక్రవారం రాత్రి బిజదలో చేరారు. అంతకుముందు ఆయన వందలాది మంది వార్డు ప్రజలు, మద్దతుదారులతో కలిసి వార్డులో పాదయాత్ర నిర్వహించారు. ఆయనకు బ్రహ్మపుర అసెంబ్లీ బిజద అభ్యర్థి డాక్టర్‌ రమేష్‌చంద్ర చ్యవుపట్నాయక్‌ పూలమాలలు వేసి పార్టీలోకి స్వాగతించారు. ఇంతకుముందు సాహు కాంగ్రెస్‌ గంజాం జిల్లా యువ విభాగంలో వివిధ పదవుల్లో సేవలు అందించారు. ఇటీవల ఆయన కాంగ్రెస్‌ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి గమనార్హం.


చైతన్య కుల ధ్రువీకరణ పత్రంపై దర్యాప్తు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: కొరాపుట్‌ జిల్లా పొట్టంగి నియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న చైతన్య హంటల్‌ కుల ధ్రువీకరణ పత్రంపై రెవెన్యూ, పోలీస్‌ విభాగం అధికారులు దర్యాప్తు చేపట్టారు. నందపూర్‌ ఎస్‌డీపీవో సంబిత్‌ కుమార్‌ మాఝి అందించిన వివరాల ప్రకారం.. చైతన్య హంటల్‌కు భాజపా టికెట్‌ లభించింది. ఆయన దళితుడైనా ఆదివాసీ కుల ధ్రువీకరణ పత్రంతో ఈ టికెట్‌ దక్కించుకున్నట్లు ఆదివాసీ సంఘాలు ఆరోపించాయి. టికెట్‌ రద్దు చేయాలని డిమాండ్‌ చేశాయి. ఇది వివాదంగా మారడంతో భాజపా ఆయనకు టికెట్‌ రద్దు చేసింది. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. ఈ వివాదానికి సంబంధించి మాచ్‌ఖండ్‌ తహసీల్దార్‌ దివాకర్‌ భాగ్‌కు ఫిర్యాదు అందింది. ఆయన ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు టెంటులి పొదొరో గ్రామానికి వెళ్లి దర్యాప్తు చేశారు. చైతన్య దళితుడని ఆధారాలు లభించడంతో నివేదిక తహసీల్దార్‌కు అందజేశారు. ఆయన ఆదివాసీగా చూపించిన కుల ధ్రువీకరణ పత్రం నకిలీదిగా గుర్తించిన తహసీల్దార్‌ శుక్రవారం నందపూర్‌ ఠాణాలో ఫిర్యాదు చేసి చైతన్యపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఠాణా అధికారిని మమతా పండా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వారం రోజుల్లో ఠాణాలో హాజరుకావాలని చైతన్యకు నోటీసు జారీ చేశారు.


సామాజిక మాధ్యమాలే.. ప్రచారాస్త్రాలు

తమదైన శైలిలో ఓటర్లను ఆకర్షిస్తున్న అభ్యర్థులు

బ్రహ్మపుర బజారు, న్యూస్‌టుడే: ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. వివిధ పార్టీల లోక్‌సభ, అసెంబ్లీ అభ్యర్థులు ప్రచారం ముమ్మరం చేస్తున్నారు. ముఖ్యంగా సామాజిక మాధ్యమాలను ప్రచారాస్త్రాలుగా చేసుకుంటున్నారు. ఈ మాధ్యమం ద్వారా ప్రతీ ఒక్కరి వద్దకు తమ అభ్యర్థనలు చేరవేస్తున్నారు. ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రాం, వాయిస్‌ మెసేజ్‌లు, ఎక్స్‌ వేదికల ద్వారా హామీలు గుప్పిస్తూ తమను గెలిపించాలంటూ ఓటర్లను వేడుకుంటున్నారు. తమను చూసి కాదని, తమ నేతలు చేస్తున్న అభివృద్ధిని చూసి ఓటేయాలని ప్రధాన పార్టీల అభ్యర్థులు అభ్యర్థించడం గమనార్హం. ఓటర్లను ఆకర్షించేలా అభ్యర్థులు, వారి మద్దతుదారులు సినీ, జానపద రీతుల్లో పాటలు రూపొందించి సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. బ్రహ్మపుర లోక్‌సభ, గోపాలపూర్‌ అసెంబ్లీ బిజద, భాజపా, కాంగ్రెస్‌ అభ్యర్థులు, పలువురు స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని