logo

రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్‌షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్‌పూర్‌ బహిరంగ సభలో నవీన్‌ పట్నాయక్‌ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు.

Published : 27 Apr 2024 05:50 IST

మోదీ అనుకూల పవనాలు వీస్తున్నాయి
ఉద్యమిస్తే భాజపాకు అధికారం తథ్యం: అమిత్‌ షా

వేదికపై అమిత్‌షా, భూపేంద్ర, మన్మోహన్‌ తదితరులు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: కేంద్ర హోంమంత్రి, భాజపా సిద్ధాంతకర్త అమిత్‌షా రాష్ట్ర పర్యటన పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం నింపింది. గురువారం సాయంత్రం పశ్చిమ ఒడిశాలోని సోన్‌పూర్‌ బహిరంగ సభలో నవీన్‌ పట్నాయక్‌ పాలనా వైఫల్యాలను విమర్శించిన షా తాము బిజదకు అనుకూలం కాదన్న సందేశమిచ్చారు. రాత్రి భువనేశ్వర్‌లో అగ్రనేతలకు విజయ తారక మంత్రం బోధించారు. రెండు గంటలు నేతలతో చర్చించిన కేంద్రమంత్రి మోదీ పవనాలు వీస్తున్నాయని, ఆయన గ్యారంటీని ప్రజలు విశ్వసిస్తున్నారన్నారు.

బలం, బలహీనతలపై విశ్లేషణ: రాష్ట్రంలో భాజపా బలం, బలహీనతలపై విశ్లేషించారు. గతసారి ఎన్నికల్లో 50 అసెంబ్లీ నియోజకవర్గాల్లో భాజపా చాలా తక్కువ ఓట్లతేడాతో ఓటమి పాలైంది. పశ్చిమ ఒడిశాలోని బొలంగీర్‌, సంబల్‌పూర్‌, కలహండి, సుందర్‌గఢ్‌, బరగఢ్‌ లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించిన కమలం అసెంబ్లీ సెగ్మెంట్లలో చతికిలపడింది. పోగొట్టుకున్న సీట్లు ఈసారి నిలబెట్టుకోవడం ధ్యేయం కావాలని షా ఉద్బోధించినట్లు తెలిసింది. శాసనసభలో 90 స్థానాలకు తగ్గకూడదని లక్ష్యం విధించారు.

నాటి ఆదరణ లేదు: 25 ఏళ్ల నవీన్‌ పాలనలో ప్రగతి శూన్యం, ప్రచారం మినహా ఒరిగిందేమీ లేదన్న వ్యతిరేకత ఓటర్లలో ఉందని నేతలు షాకు వివరించారు. వ్యవసాయరంగం, ఉపాధి కల్పన రంగాల్లో బిజద పాలకులు విఫలయమ్యారని, సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న గంజాం జిల్లాలోని హింజిలి నియోజకవర్గం వలసలకు చిరునామాగా మారిందని చెప్పారు. ఈసారి నవీన్‌ పోటీ చేయాలని నిర్ణయించుకున్న కంటాబంజి వలసల్లో రికార్డు సృష్టించిందని, సాగు, తాగునీటి సరఫరా గ్రామీణ రహదారుల నిర్మాణం చేయలేదన్నారు.

ప్రతి ఇంటికీ ఛార్జిషీట్‌ ప్రతులు: నవీన్‌ 25 ఏళ్ల పాలనా వైఫల్యాలు, అవినీతికి సంబంధించి భాజపా నాయకత్వం ఛార్జిషీట్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రతులు ప్రతి ఇంటికి చేర్చాలని షా నేతలకు సూచించారు. పశ్చిమ ఒడిశాపై ఎక్కువ శ్రద్ధ చూపాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు