logo

602 కిలోల గంజాయి స్వాధీనం

ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిను పాడువా పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు.

Published : 16 Apr 2024 03:53 IST

స్వాధీనం చేసుకున్న గంజాయి బస్తాలు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: ఇతర రాష్ట్రాలకు రవాణా చేసేందుకు సిద్ధంగా ఉంచిన గంజాయిను పాడువా పోలీసులు ఆదివారం రాత్రి స్వాధీనం చేసుకున్నారు. ఠాణా అధికారి అశోక్‌ కుమార్‌ బిసోయి అందించిన వివరాల ప్రకారం ఏఎస్సై హెచ్‌.బెనియా నేతృత్వంలో పోలీసులు పెట్రోలింగ్‌ చేస్తుండగా బడేల్‌ గ్రామ పంచాయతీకి చెందిన గొడిపుట్‌ అటవీ ప్రాంతంలో రహస్యంగా దాచిపెట్టిన గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. వీరిని చూసి నిందితులు పరారయ్యారు. సోమవారం ఠాణాలో తూనికి చేయగా 602 కిలోలు ఉన్నట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


విదేశీ మద్యం స్వాధీనం

స్వాధీనం చేసుకున్న మద్యం, అరెస్ట్‌ అయిన నిందితుడితో పోలీసులు

సిమిలిగుడ, న్యూస్‌టుడే: సిమిలిగుడ సమీపంలో డోలియంబ వద్ద ఉన్న డాబా హోటల్‌పై పోలీసులు సోమవారం ఉదయం దాడులు జరిపి భారీ ఎత్తున విదేశీ మద్యంను స్వాధీనం చేసుకున్నారు. సునాబెడ ఎస్‌డిపిఓ మనోబ్రాట శత్పతీ అందించిన వివరాల ప్రకారం డాబా హోటల్‌లో మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు దాడులు జరిపి తనిఖీ చేశారు. భారీ ఎత్తున విదేశీ మద్యం స్వాధీనం చేసుకొని యజమాని సురేంద్ర కోసలను అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.


డీహెచ్‌హెచ్‌లో నిస్సహాయ స్థితిలో వృద్ధురాలు

చికిత్స పొందుతున్న వృద్ధురాలు

జయపురం, న్యూస్‌టుడే: జయపురం పట్టణానికి చెందిన నిస్సహాయ వృద్ధురాలిని ఓ వ్యక్తి మూడు రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించాడు.  సోమవారం నాటికి ఆమె ఆరోగ్యంకుదుటపడటంతో, ఆమె ఆచూకీ తెలుసుకునే ప్రయత్నం ఆసుపత్రి సిబ్బంది చేశారు. ఆమె పట్టణంలో రత్నాకర్‌గూడ ప్రాంతానికి చెందిన విమల శెఠి(70)గా గుర్తించారు. వృద్ధురాలికి బంధువులు, ఆత్మీయులు లేకపోవడంతో ఒంటరిగా ఉంటున్నట్టు తెలిపింది. ఈ విషయంపై ఆసుపత్రి మేనేజర్‌ రూప్సి మధుమిత మాట్లాడుతూ మహిళ గురించి సామాజిక సంక్షేమ శాఖకు తెలియజేశామని, ఆమె ఆరోగ్యం కుదుపడే సమయానికి బంధువులు వస్తే అప్పగిస్తామని లేకపోతే సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వృద్ధాశ్రమానికి తరలిస్తామని తెలిపారు.


విద్యుదాఘాతంతో బాలుడు మృతి

జయపురం, న్యూస్‌టుడే: జయపురం సమితిలో విద్యుదాఘాతానికి గురై బాలుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఉమురి పంచాయతీ మకాపుట్‌ గ్రామానికి చెందిన జిషుదాన్‌ నాగ్‌ కుమారుడు పాల్‌ నాగ్‌(10) సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఆడుకుంటున్నాడు. స్టాండింగ్‌ పంకాకు అనుసంధానమైన తీగను పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. బాలుడి కేకలు విని కుటుంబ సభ్యులు వెంటనే ఇంట్లోకి వెళ్ళి చూడగా స్పృహ కోల్పోయి కనిపించాడు. అనంతరం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.


తల్లి దాడి కొడుకు మృతి

మల్కాన్‌గిరి, న్యూస్‌టుడే: మద్యం మత్తులో ఓ తల్లి సొంత కొడుకు గుండెలపై తన్నడంతో ఆయన మృతిచెందిన సంఘటన మల్కాన్‌గిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... బాలుని తండ్రి మడ్కామి కథనం ప్రకారం...ఆదివారం తన కుమారుడు రోహిత్‌ పడియామి (8) తన తల్లి వగి పడియామికి డబ్బులు అడిగాడు. ఆమె లేవని చెప్పి బయటకు వెళ్లిపోయింది. ఇంతలో ఆమె దాచుకున్న డబ్బులు తీసి రోహిత్‌ ఖర్చు పెట్టేశాడు. రాత్రి తాగి ఇంటికొచ్చిన వగి తాను దాచిపెట్టిన డబ్బులు కనిపించకపోవడంతో కొడుకును అడిగింది. తాను ఖర్చు చేసేశానని బాలుడు చెప్పడంతో గట్టిగా కొట్టి గుండెలపై బలంగా తన్నడంతో రోహిత్‌ ప్రాణాలొదిలాడు. తర్వాత దంపతులు నిద్రపోయారు. ఉదయం లేచి చూసేసరికి కొడుకు మృతిచెంది కనిపించాడు. విషయం గ్రామస్థులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు మృతదేహాన్ని పరీక్షల కోసం తరలించి వగి పడియామిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.


గంజాయి విసిరేసి పరారీ

పర్లాఖెముండి, న్యూస్‌టుడే: జిల్లాలో అక్రమ గంజాయి రవాణాను అరికట్టేందుకు పోలీసులు, ఆబ్కారీ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి గారబంద ఠాణా పరిధిలోని బోడోహంస గ్రామ ప్రాంతంలో ఎస్సై లోకనాథ్‌ బెహరా ఓ బృందంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్ర వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి తనిఖీ చేస్తుండగా నిందితుడు పోలీసులపై గంజాయి సంచిని విసిరి పరారయ్యాడు. ఠాణా అధికారి రీనా రాణి సాహు, తహసిల్దార్‌, మేజిస్ట్రేట్‌ నారాయణ బెహరా ఘటన స్థలానికి చేరుకొని గంజాయిని తూనిక చేయగా 13 కిలోల 400 గ్రాములు ఉన్నట్లు తెలిపారు. పోలీసులు నిందితుడు వివరాలు సేకరిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని