logo

నేతల నోట అభివృద్ధి మంత్రం

‘రాష్ట్రంలో రాజకీయ కాక ఊపందుకుంది. ఒకవైపు టికెట్లు ఖరారు కాని స్థానాలకు సంబంధించి ఆశావహుల పైరవీలు, ప్రకటించిన చోట్ల ప్రచారానికి సిద్ధమవుతున్న నేతలు, ముందస్తుగా పాదయాత్రలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న నాయకుల సందడి కనిపిస్తోంది.

Published : 16 Apr 2024 04:01 IST

విజయావకాశాలపై ప్రధాన పార్టీల నేతల ధీమా

బ్రహ్మపుర బిజద అభ్యర్థి భృగుబక్షికి తిలకం దిద్దుతున్న వృద్ధురాలు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ‘రాష్ట్రంలో రాజకీయ కాక ఊపందుకుంది. ఒకవైపు టికెట్లు ఖరారు కాని స్థానాలకు సంబంధించి ఆశావహుల పైరవీలు, ప్రకటించిన చోట్ల ప్రచారానికి సిద్ధమవుతున్న నేతలు, ముందస్తుగా పాదయాత్రలు చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్న నాయకుల సందడి కనిపిస్తోంది. అందరి నోటా అభివృద్ధి మంత్రం వినిపిస్తోంది. తమను విజయ తీరాలకు చేర్చాలని ఆరాధ్య దైవాల సన్నిధిలో పూజలూ చేస్తున్నారు.

బాలేశ్వర్‌లో లేఖాశ్రీ ప్రచారం

ముందంజలో భాజపా, బిజద

ఇంతవరకు ప్రచారంలో భాజపా, బిజదలు ముందంజలో ఉన్నాయి. లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తున్న అభ్యర్థులు కార్యకర్తలు, నేతలతో కలిసి పాదయాత్రలు, రోడ్‌షోలు నిర్వహిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక భువనేశ్వర్‌, పూరీ, కటక్‌, సంబల్‌పూర్‌, సుందర్‌గఢ్‌, బాలేశ్వర్‌, బ్రహ్మపుర స్థానాల్లో పోటీ చేస్తున్న ఈ రెండు పార్టీల అభ్యర్థులు మండుటెండల్లో చెమటోడుస్తున్నారు. పదిహేనేళ్ల తర్వాత ప్రత్యక్ష ఎన్నికల బరిలో ఉన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ సంబల్‌పూర్‌లో మకాం వేశారు. ఆయన ప్రతి అవకాశం వినియోగించుకుంటున్నారు. పూరీ బరిలో బిజద అభ్యర్థి, ఐపీఎస్‌ మాజీ అధికారి అరూప్‌ పట్నాయక్‌, భాజపా తరఫున పోటీ చేస్తున్న సంబిత్‌ పాత్ర్‌లు ప్రజలతో మమేకమవుతున్నారు. బాలేశ్వర్‌లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న బిజద అభ్యర్థి లేఖాశ్రీ సామంత శింగార్‌, బ్రహ్మపురలో ప్రదీప్‌కుమార్‌ పాణిగ్రహి (భాజపా), భృగు బక్షిపాత్ర్‌లు ప్రచారం ముమ్మరం చేశారు. ఇంతవరకు వెనుకబడిపోయిన కాంగ్రెస్‌ నేతలూ జనాల్లోకి కదిలారు.

శ్రీక్షేత్రం ఎదుట జగన్నాథునికి దీపారాధన చేస్తున్న పూరీ లోక్‌సభ, అసెంబ్లీ భాజపా అభ్యర్థులు సంబిత్‌ పాత్ర్‌, జయంత షడంగి

18 తర్వాత అగ్రనేతల రాక

ఈ నెల 18న తొలివిడతగా బ్రహ్మపుర, కొరాపుట్‌, నవరంగపూర్‌, కలహండి లోక్‌సభ పరిధుల్లోని 28 అసెంబ్లీ స్థానాలకు నోటిఫికేషన్‌ జారీ కానుంది. దీంతో నామినేషన్ల దాఖలు సందడి ప్రారంభమవుతుంది. దిల్లీ నుంచి భాజపా, కాంగ్రెస్‌ అగ్రనేతలు ప్రచారానికి చేరుకోనున్నారు. బిజద అధినేత, సీఎం నవీన్‌, వి.కార్తికేయ పాండ్యన్‌తో కలిసి ఈసారి ప్రచార యాత్ర చేస్తారని తెలిసింది.

గిరిజన వాడల్లో ఓట్లు అర్థిస్తున్న సుందర్‌గఢ్‌ భాజపా అభ్యర్థి జోయల్‌ ఓరం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని