logo

ఉద్ధండుల బరి... ఎవరిదో గెలుపు మరి

పశ్చిమ బెంగాల్‌ సరిహద్దులోని బాలేశ్వర్‌ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది.

Published : 16 Apr 2024 04:08 IST

బాలేశ్వర్‌లో ప్రతాప్‌, శ్రీకాంత్‌, లేఖాశ్రీల ముక్కోణ పోరు

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: పశ్చిమ బెంగాల్‌ సరిహద్దులోని బాలేశ్వర్‌ లోక్‌సభ స్థానం అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇక్కడ ముగ్గురు ఉద్ధండులు తలపడుతున్నారు. భాజపా, బిజద, కాంగ్రెస్‌ నాయకత్వాలు ఎంపిక చేసిన అభ్యర్థులు రాజకీయ చరిత్ర, అనుభవం కలవారు కావడంతో ముక్కోణ పోటీ నువ్వా? నేనా? అన్న రీతిలో ఉంటుందని పరిశీలకులంటున్నారు.


ఆయన సర్వసంగ పరిత్యాగి

బాలేశ్వర్‌ సిటింగ్‌ ఎంపీ ప్రతాప్‌చంద్ర షడంగి సర్వసంగ పరిత్యాగి. నిరాడంబరుడు. నిత్యం యోగా సాధన చేసే ఆయన సన్యాసి జీవనం సాగిస్తున్నారు. సమాజ సేవకు అంకితమయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయనను రాజయోగిగా సంబోధించి గౌరవిస్తారు. మోదీ మంత్రివర్గంలో కొంతకాలం పనిచేసిన ప్రతాప్‌ నిజాయతీకి మారుపేరు. అన్ని రాజకీయ పార్టీల నాయకుల మన్ననలందుకున్న ఆయనను భాజపా నాయకత్వం మళ్లీ బాలేశ్వర్‌ ఎన్నికల బరిలో దించింది. రాజకీయాల్లోనూ మేధావిగా గుర్తింపు పొందిన ప్రతాప్‌ దేశ ప్రజల దృష్టిని ఆకర్షించిన సన్యాసి.

జనం నా బలం, బలగం

ప్రతాప్‌ సోమవారం బాలేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. జనం తన బలం, బలగమని వివరించారు. వారి కోసమే తన జీవితం అంకితమన్నారు. లేఖాశ్రీ గురించి చెప్పేదేమీ లేదని, నిన్నటి వరకు వెంట ఉన్న ఆమె ఇప్పుడు తప్పుకున్నారన్నారు. ప్రజలు న్యాయ నిర్ణేతలని, వారి తీర్పు శిరసా వహిస్తానని, గొప్పలు చెప్పుకోవడం తన నైజం కాదన్నారు.


ఫైర్‌ బ్రాండ్‌

లేఖాశ్రీ సామంతశింగార్‌. ఈమె కొన్నిరోజుల క్రితం వరకు భాజపాలో ఫైర్‌ బ్రాండ్‌గా ముద్రపడ్డారు. ఉన్నత విద్యావంతురాలైన ఆమె కమలదళం అధికార ప్రతినిధిగా, ప్రధాన కార్యదర్శిగా, ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వ వైఫల్యాలను ప్రసార సాధనాల ముందు నిత్యం ఎండగట్టేవారు. ప్రతాప్‌చంద్ర షడంగిని గురువుగా, ఆప్తునిగా చెప్పుకునేవారు. లేఖాశ్రీ పుట్టినిల్లు, మెట్టినిల్లు బాలేశ్వర్‌ పరిధిలోని నీలగిరి కాగా ఇటీవల ఆమె భాజపాను వీడి బిజదలో చేరి ఆ పార్టీ తరఫున బాలేశ్వర్‌ ఎన్నికల బరిలో నిలిచారు.

నా గురించి ప్రజలకు తెలుసు

లేఖాశ్రీ విలేకరులతో మాట్లాడుతూ... తన జీవితం తెరిచిన పుస్తకమని ప్రజలకంతా తెలుసునన్నారు. జన్మ భూమికి ఎంతో కొంత చేయాలన్న తపన ఉందన్నారు. ప్రతాప్‌ విలువలకు కట్టుబడిన యోగి అని, ఆయన గురించి తానేమీ చెప్పలేనన్నారు. ముఖ్యమంత్రి నవీన్‌ నీతి, నిజాయతీ, దూరదృష్టిని గమనించి ఆయనతో కలసి పని చేయాలని నిర్ణయించుకున్నానన్నారు. బాలేశ్వర్‌ ప్రాంతాభివృద్ధికి కట్టుబడిన తనను ఓటర్లు తోబుట్టువుగా ఆదరిస్తారన్న నమ్మకం ఉందన్నారు.


రాజకీయాల్లో ఘనాపాటి

ఐ.కె.గుజ్రాల్‌, దేవెగౌడ, వి.పి.సింగ్‌, మన్మోహన్‌ సింగ్‌ల మంత్రివర్గాల్లో కీలక శాఖల మంత్రిగా విధులు నిర్వహించిన శ్రీకాంత్‌ జెనా రాజకీయాల్లో ఘనాపాటి. రాజకీయ వ్యూహరచనల్లో దిట్టగా గుర్తింపు పొందారు. నిష్కళంక చరిత్ర గల ఆయన రాష్ట్ర కాంగ్రెస్‌లో అగ్రనేతగా గుర్తింపుపొందారు. తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడిన ముక్కుసూటితనం ఆయన సొంతం. కొన్నాళ్లు ఆ పార్టీకి దూరంగా ఉంచింది. 2014 తర్వాత రాజకీయాల జోలికి వెళ్లని శ్రీకాంత్‌ ఇటీవల మళ్లీ కాంగ్రెస్‌కు దగ్గరయ్యారు. రాజకీయాల్లో క్రియాశీలకమయ్యారు. ఈసారి ఏఐసీసీ నాయకత్వం ఆయనను బాలేశ్వర్‌ అభ్యర్థిగా చేసింది.

చేయాలన్న తపనతో వచ్చా

శ్రీకాంత్‌ బాలేశ్వర్‌లో విలేకరులతో మాట్లాడుతూ... కొంతకాలం విరామం తర్వాత బాలేశ్వర్‌ ప్రజలకు సేవ చేయాలన్న ధ్యేయంతో పోటీకి సిద్ధమయ్యానని, కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ దిశగా తనను కోరిందన్నారు. గతంలో కేంద్ర మంత్రిగా రాష్ట్ర ప్రయోజనాలు ధ్యేయంగా పనులు చేశానన్నారు. భాజపా, బిజదల గురించి తెలిసిన ఓటర్లు మార్పు కోరి కాంగ్రెస్‌కు కేంద్రం, రాష్ట్రంలో అధికారమిస్తారన్న నమ్మకం ఉందన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని