logo

వారసులొచ్చారు

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్‌ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు.

Updated : 19 Apr 2024 02:08 IST

ఎన్నికల రణంలో కుమారులు, భార్యలు

 భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్‌ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు.


 దంపతుల పోటీ


కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌                సంగీతాకుమారీ సింగ్‌దేవ్‌


బొలంగీర్‌ రాజు. మాజీ మంత్రి కనకవర్ధన్‌ సింగ్‌దేవ్‌ పాట్నాగఢ్‌ అసెంబ్లీ స్థానానికి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, ఆయన భార్య, సిటింగ్‌ ఎంపీ సంగీతాకుమారీ సింగ్‌దేవ్‌ మళ్లీ బొలంగీర్‌ లోక్‌సభ అభ్యర్థిగా రంగంలో దిగారు.


తండ్రి ఒకటి తలస్తే...

     సురేష్‌ రౌత్రాయి                      మన్మధ రౌత్రాయి


రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి సురేష్‌ రౌత్రాయి పోటీ నుంచి తప్పుకొన్నారు. కుమారుడు మన్మధ రౌత్రాయిని జట్నీ అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్‌ అభ్యర్థిగా చేయాలని భావించారు. మన్మధ బిజదలో చేరి భువనేశ్వర్‌ లోక్‌సభ అభ్యర్థిగా పోటీకి దిగారు. సురేష్‌ కుమారుని కోసం ప్రచారం చేసి కాంగ్రెస్‌ ఆగ్రహానికి గురై పార్టీకి దూరమయ్యారు.


రంగంలో తండ్రీకుమారుడు

కేంద్ర మాజీ మంత్రి భక్త చరణదాస్‌ కలహండి జిల్లా నర్లా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఆయన కుమారుడు సాగర్‌ చరణ్‌ దాస్‌ భవానీపాట్నా శాసనసభకు అదే పార్టీ నుంచి తొలిసారిగా పోటీ చేస్తున్నారు.


తల్లి స్థానంలో కొడుకు

పరాజయం ఎరుగని గంజాం జిల్లా చికిటి రాణి, మంత్రి ఉషాదేవి ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. తన కుమారుడు చిన్మయానంద శ్రీరూప్‌దేవ్‌కు టికెట్‌ తెచ్చుకున్నారు. బిజద అభ్యర్థిగా బరిలో ఉన్న కుమారుడి విజయానికి రాణి ప్రచారం చేస్తున్నారు.


ఉప సభాపతి భార్యకు

అనుగుల్‌ నుంచి వరుసగా మూడుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన ఉపసభాపతి రజనీకాంత్‌ సింగ్‌ ఈసారి పోటీ నుంచి తప్పుకున్నారు. ఆయన భార్య సంజుక్తా సింగ్‌ను ఈసారి బిజద తరఫున రంగంలోకి దించుతున్నారు.


ఈసారి సమరేంద్ర

రాష్ట్ర కాంగ్రెస్‌కు పెద్ద దిక్కుగా ఉన్న శాసనసభా పక్షం (సీఎల్ఫీ) నేత నర్సింగ మిశ్ర వయోభారం పెరిగినందన్న కారణంగా పోటీ నుంచి తప్పుకున్నారు. తన కుమారుడు సమరేంద్ర మిశ్రను బొలంగీర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టి, ఆయన విజయానికి కృషి చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని