logo

దక్షిణంలోనూ కమల వికాసం

రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల బిజద పాలన చూసిన ప్రజలకు ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని, భాజపాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న ధ్యేయంతో ఉన్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు.

Published : 30 Apr 2024 04:59 IST

బిజదపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది: నడ్డా
గోపాల్‌పూర్‌లో అగ్రనేతలతో చర్చ

వేదికపై జె.పి.నడ్డా, విజయ్‌పాల్‌ సింగ్‌ తోమార్‌, లతా ఉసండె, బైజయంత్‌ పండా, బిప్లవ్‌ కుమార్‌ దేవ్‌, మన్మోహన్‌సామల్‌

గోపాలపూర్‌, న్యూస్‌టుడే: రాష్ట్రంలో రెండున్నర దశాబ్దాల బిజద పాలన చూసిన ప్రజలకు ఆ పార్టీపై వ్యతిరేకత ఉందని, భాజపాకు ఈసారి అవకాశం ఇవ్వాలన్న ధ్యేయంతో ఉన్నారని భాజపా కేంద్రశాఖ అధ్యక్షుడు జె.పి.నడ్డా పేర్కొన్నారు. ఆదివారం రాత్రి గోపాల్‌పూర్‌లో ఆయన గంజాం, గజపతి, కొరాపుట్‌, రాయగడ, నవరంగపూర్‌, మల్కాన్‌గిరి జిల్లాలకు చెందిన 200 మంది సీనియర్‌ నేతలతో చర్చించారు.

కలిసికట్టుగా శ్రమిస్తే...: 2019లో భాజపాకు లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 38 శాతం ఓట్లు పోలయ్యాయని, అసెంబ్లీలో ఇది 32 శాతం అని వివరించిన నడ్డా భాజపా నేతలు ఈసారి కలిసికట్టుగా శ్రమిస్తే 45 శాతానికి మించి ఓటు బ్యాంకు దక్కించుకోవచ్చని, అధికారం చిక్కుతుందని వివరించారు.

మోదీ గ్యారంటీ తారక మంత్రం రావాలి..: దేశవ్యాప్తంగా మోదీకి అనుకూల పవనాలు వీస్తున్నాయని, ఇది రాష్ట్రంలోనూ కనిపిస్తోందని నడ్డా పేర్కొన్నారు. విశ్వసనీయతకు మరో పేరైన ప్రధాని గ్యారంటీ ప్రజల్లో నమ్మకం పెంచిందన్నారు. అన్నదాతలు, యువత, మహిళల ప్రయోజనాలతో కూడిన మోదీ గ్యారంటీని అందరికీ వివరించాలన్నారు. 24 ఏళ్ల నవీన్‌ పాలనా వైఫల్యాలపై రాష్ట్ర భాజపా రూపకల్పన చేసిన ఛార్జిషీట్‌ ప్రతి ఓటరుకు చేర్చాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ బలం నామమాత్రమని, భాజపాకు ప్రత్యర్థి బిజదయేనని నడ్డా అభివర్ణించారు.  

రాష్ట్రానికి ఎంతో చేశారు: ఒడిశాలో భాజపాయేతర ప్రభుత్వం అధికారంలో ఉన్నా మోదీ  అధిక ప్రాధాన్యమిచ్చారన్నారు. ఐఐఎం, ఐఐటీ, ఐజర్‌ తదితర ఉన్నత విద్యాసంస్థలు, కేంద్ర వర్సిటీలు ఏర్పాటయ్యాయని, రైల్వే రంగం విస్తరించిందన్నారు. నిధుల కేటాయింపులు పెరిగాయని, సద్వినియోగం చేసుకోవడంలో నవీన్‌ ప్రభుత్వం విఫలమైందన్నారు.

దక్షిణ వాసుల్లోనూ నమ్మకం కుదిరింది..: దక్షిణంలో ఈసారి కమల వికాసం తథ్యమని, ఓటర్లు మార్పు కోరుతున్నారని నడ్డా చెప్పారు. రాష్ట్రాన్ని పాండ్యన్‌ పాలిస్తున్నారని, అధికారులు పెత్తనం చలాయిస్తున్నారని అందరికీ తెలిసింద]న్నారు. బ్రహ్మపుర, అస్కా, కొరాపుట్‌, నవరంగపూర్‌ లోక్‌సభ స్థానాలు, వాటి పరిధుల్లోని 28 అసెంబ్లీ సీట్లలో 3/4 వంతు భాజపా ఖాతాలోకి వస్తాయన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని