logo

ముగ్గురు అభ్యర్థుల్ని మార్చిన కాంగ్రెస్‌

ఏఐసీసీ అధిష్ఠానం ఇదివరకు ఖరారు చేసిన 3 స్థానాల అభ్యర్థులను ఆదివారం మార్చింది. ఇప్పటికే మూడుసార్లు ఈ తరహా మార్పులు చేసిన నాయకత్వం వ్యవహారశైలి ఇతర అభ్యర్థులందర్నీ అసంతృప్తికి గురిచేస్తోంది.

Published : 06 May 2024 04:09 IST

దేవాశిష్‌ నాయక్‌

భువనేశ్వర్‌, న్యూస్‌టుడే: ఏఐసీసీ అధిష్ఠానం ఇదివరకు ఖరారు చేసిన 3 స్థానాల అభ్యర్థులను ఆదివారం మార్చింది. ఇప్పటికే మూడుసార్లు ఈ తరహా మార్పులు చేసిన నాయకత్వం వ్యవహారశైలి ఇతర అభ్యర్థులందర్నీ అసంతృప్తికి గురిచేస్తోంది.

దేవాశిష్‌కు టికెట్‌

ఇటీవల బిజద, భాజపాలను వీడి శనివారం కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి దేవాశిష్‌ నాయక్‌కు ఆయన కోరుకున్న బొరి అసెంబ్లీ స్థానానికి అభ్యర్థిగా చేశారు. నీలగిరిలో అక్షయ ఆచార్యను నిలిపారు. ఇదివరకు ప్రకటించిన దేవీప్రసన్న చాంద్‌ను జలేశ్వర్‌ నుంచి తప్పించి సుదర్శన్‌ దాస్‌కు టికెట్‌ కేటాయించారు. బొరిలో ఆరతిదేవ్‌ స్థానంలో దేవాశిష్‌ను, అఠామల్లిక్‌ బిజయానంద చౌలియాను తప్పించి హిమాంశు చేలియాను, అఠాగఢ్‌లో మోహబూబ్‌ అహమ్మద్‌ ఖాన్‌ స్థానంలో సుదర్శన్‌ సాహును, పూరీలో సుజిత్‌ మహాపాత్ర్‌ను తప్పించి ఉమావల్లబ్‌ రథ్‌ను అభ్యర్థులుగా చేశారు. 

అభ్యర్థుల్లో అసహనం: ఈసారి 15 లోక్‌సభ, 90 అసెంబ్లీ సీట్లు కచ్చితంగా గెలుస్తామని, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పదేపదే చెబుతున్న పీసీసీ నాయకత్వం స్థిర నిర్ణయంతో ముందుకు సాగడం లేదు. ప్రచారానికి ఇంతవరకు రూపాయి కేటాయించలేదని పలువురు అభ్యర్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పీసీసీ అధ్యక్షుడు శరత్‌ పట్నాయక్‌ నువాపడ అసెంబ్లీ స్థానానికి పోటీ చేస్తున్నారు. నర్లాలో కేంద్ర మాజీ మంత్రి భక్తచరణ్‌దాస్‌, భొండారి పొకరిలో పీసీసీ మాజీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ అభ్యర్థులు. సీఎల్పీనేత నర్సింగ మిశ్ర కుమారుడు సమరేంద్ర మిశ్ర బొలంగీర్‌ అసెంబ్లీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కొడుకును గెలిపించుకోవడానికి నర్సింగ తన శక్తులన్నీ ఒడ్డుతున్నారు. కాంగ్రెస్‌లో కాస్తో, కూస్తో పలుకుబడి గల నేతలంతా తమ ప్రాంతాలకు పరిమితం కావడంతో మిగిలిన చోట్ల రంగంలో ఉన్న అభ్యర్థులు తీవ్ర అసహనం, అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు