logo

కొరాపుట్‌ ఎవరికి సొంతం?

కొరాపుట్‌, రాయగడ జిల్లాల్లో ప్రతిష్ఠాత్మక కొరాపుట్‌ లోక్‌సభ స్థానంలో విజయంపై అందరి దృష్టి పడింది. ఇక్కడ కాంగ్రెస్‌, బిజద, భాజపాల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉండగా, విజయం ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది.

Updated : 07 May 2024 06:47 IST

మూడు పార్టీల మధ్య తీవ్ర పోటీ
సిమిలిగుడ, న్యూస్‌టుడే

కొరాపుట్‌, రాయగడ జిల్లాల్లో ప్రతిష్ఠాత్మక కొరాపుట్‌ లోక్‌సభ స్థానంలో విజయంపై అందరి దృష్టి పడింది. ఇక్కడ కాంగ్రెస్‌, బిజద, భాజపాల మధ్య తీవ్ర పోటీ నెలకొనే అవకాశం ఉండగా, విజయం ఎవరిదో అన్న ఉత్కంఠ నెలకొంది. గుణుపూర్‌, బిసంకటక్‌, రాయగడ, లక్ష్మీపూర్‌, కొరాపుట్‌, పొట్టంగి, జయపురం విధానసభ నియోజకవర్గాలతో కూడిన లోక్‌సభ నియోజకవర్గం 1957లో ఏర్పాటైంది. ఎస్టీల కోసం కేటాయించిన ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు 18 సార్లు జరిగిన ఎన్నికల్లో 16 సార్లు కాంగ్రెస్‌సే గెలిచింది. రెండుసార్లు (2009, 2014లో) బిజద గెలుపొందింది. 2019లోను బిజద, కాంగ్రెస్‌, భాజపా అభ్యర్థుల మధ్య ఉత్కంఠ పోరు నెలకొన్నా కాంగ్రెస్‌ అభ్యర్థి సప్తగిరి ఉలక విజయ పతాకం ఎగరేశారు. దీంతో ఆయన రాష్ట్రంలో 21 స్థానాలకుగాను కాంగ్రెస్‌ నుంచి ఎంపికైన ఏకైక ఎంపీగా నిలిచారు.

9 సార్లు గెలుపొందిన ఘనత

కొరాపుట్‌ లోక్‌సభ స్థానం నుంచి 9 సార్లు గెలుపొందిన ఘనత గిరిధర్‌ గమాంగ్‌ది. ఆయన 1972లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. 1998 వరకు వరుసగా ఓటమెరుగని వీరుడిగా గుర్తింపు పొందారు. 1999లో గిరిధర్‌కు బదులు ఆయన సతీమణి హేమా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 2004లో గిరిధర్‌ మళ్లీ బరిలో దిగి విజయ బావుటా ఎగరేశారు. 2009లో బిజూ జనతా దళ్‌ అభ్యర్థి జయరామ్‌ పంగి గిరిధర్‌ను ఓడించి సంచలనం సృష్టించారు. 2014లోనూ గిరిధర్‌ ఓటమి పాలయ్యారు. ఆ ఏడాది బిజద అభ్యర్థి జీను హికాక గెలుపొందారు. 2019లో మాజీ మంత్రి, మాజీ ఎంపీ రామ్‌చంద్ర ఉలక కుమారుడు సప్తగిరి ఉలక రాజకీయ ప్రవేశం చేసి ఎంపీ స్థానానికి బరిలో దిగారు. ఆయనకు ప్రత్యర్థులుగా జీను భార్య కౌసల్య, భాజపా తరఫున జయరామ్‌ పంగి పోటీ చేయగా, సప్తగిరి విజయ శంఖం పూరించారు. ఈ నియోజకవర్గంలో జగన్నాథరావు (1957), టి.సంగన్న (1957)లు ఇద్దరు తెలుగు అభ్యర్థులు కావడం విశేషం. ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు రాయగడ జిల్లా అభ్యర్థులే ఈ స్థానంలో గెలుపొందడం మరో విశేషమని చెప్పొచ్చు. కేవలం జయరామ్‌ పంగి, జీను హికాకలు మాత్రమే కొరాపుట్‌ జిల్లాకు చెందినవారు.

రసవత్తర పోరు

తాజా ఎన్నికల్లో కొరాపుట్‌లో రసవత్తర పోరు జరుగుతోంది. కాంగ్రెస్‌ అభ్యర్థి సప్తగిరి, బిజద తరఫున కౌసల్య హిక్కాకలు తలపడుతుండగా, కొత్త అభ్యర్థి భాజపా నుంచి కాళీరామ్‌ మాఝి తలపడుతున్నారు. రెండోసారి ఈ స్థానం చేజిక్కించుకోవాలని సప్తగిరి చూస్తుండగా, గతసారి ఓటమిని ఓ పాఠంగా మలుచుకుని విజయమే లక్ష్యంగా కౌసల్య ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఒక్క విజయమూ తన ఖాతాలో వేసుకోని భాజపా ఎలాగైనా ఈ పీఠం అధిష్ఠించాలని, కాళీరామ్‌ గెలుపు కోసం ప్రణాళికలు రచిస్తోంది. వీరితోపాటు మరో ఏడుగురు పోటీ పడుతున్నారు. స్వతంత్రులు రఘుమణి గమాంగ్‌, లాసు హంతల్‌, అవినాష్‌ గమాంగ్‌, ప్రకాష్‌ హికాక (కమ్యూనిస్టు పార్టీ), దామిని మాఝి (బీఎస్పీ), సంతోష్‌కుమార్‌ బిడిక (రిపబ్లికన్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), ప్రమీలా పూజారి (సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా) బరిలో ఉన్నారు. ఇందులో అవినాష్‌ కాంగ్రెస్‌ తిరుగుబాటుదారుడు కావడంతో కాంగ్రెస్‌కు తలనొప్పి వ్యవహారంగా మారింది. ఓట్లు చీలే అవకాశం లేకపోలేదు. పదిమంది అభ్యర్థులు బరిలో ఉన్నా, ప్రధాన పార్టీల మధ్యే తీవ్ర పోటీ ఉంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని