logo

బ్రహ్మపురలో బహుముఖ పోటీ

రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రమైన బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది.

Published : 10 May 2024 03:14 IST

బ్రహ్మపుర నగరం, న్యూస్‌టుడే: రాష్ట్రంలో ప్రధాన వాణిజ్య, విద్యా కేంద్రమైన బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం కీలకమైనది. కేవలం పట్టణ ఓటర్లున్న ఈ సెగ్మెంట్‌ గతంలో కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉండేది. తర్వాత జనతాదళ్‌, అనంతరం 2000 నుంచి 2019 వరకూ వరుసగా బిజద గెలుస్తూ వస్తున్నాయి. బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గం బిజదకు కంచుకోటగా మారింది. మరోవైపు బ్రహ్మపుర లోక్‌సభ పరిధిలోని కొణిసి వద్ద సోమవారం ప్రధాని మోదీ  విజయ సంకల్ప సమావేశంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఆయన బ్రహ్మపుర నగరం ప్రధాన వాణిజ్య కేంద్రమని, పట్టు నగరమని పేర్కొన్న సంగతి తెలిసిందే. భాజపాకు అధికారం కట్టబెడితే దీన్ని అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎన్నికల్లో ఈ నియోజకవర్గంపై విజయం సాధించేందుకు అన్ని పార్టీల నాయకులు ప్రత్యేక దృష్టిపెట్టారు.

స్వతంత్రుల పోరు

బ్రహ్మపుర మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఈఎంసీ) పరిధిలో మొత్తం 42 వార్డులున్నాయి. బ్రహ్మపుర అసెంబ్లీ సెగ్మెంట్‌లో 36 వార్డులుండగా, మిగిలినవి గోపాలపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వస్తున్నాయి. ఈసారి బ్రహ్మపురలో పోటీకి పదిహేడు మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో స్వతంత్రులు ఎక్కువ. బిజద అభ్యర్థిగా ఆ పార్టీ సీనియరు నాయకుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్‌ రమేష్‌చంద్ర చ్యవుపట్నాయక్‌ మరోసారి పోటీకి దిగారు. ఇటీవల బిజదను వీడిన యువ నాయకుడు కె.అనిల్‌కుమార్‌ భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తుండగా, న్యాయవాది, రాజకీయ నేపథ్యమున్న దీపక్‌ పట్నాయక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. వీరితోపాటు బీఈఎంసీ మాజీ మేయరు శివశంకర్‌ దాస్‌ (పింటు దాస్‌) స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆప్‌, భారతీయ వికాస్‌ పరిషత్‌, ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌, బహుజన సమాజ్‌ పార్టీ, నబ భారత నిర్మాణ సేవా పార్టీ, సోషలిస్ట్‌ యూనిటీ సెంటర్‌ ఆఫ్‌ ఇండియా (కమ్యూనిస్టు) తదితర పార్టీలతోపాటు పలువురు స్వతంత్రులు పోటీ చేస్తున్నారు. బ్రహ్మపుర అసెంబ్లీ నియోజకవర్గంలో 2,22,749 మంది ఓటర్లు (ఈ ఏడాది మార్చి 17వ తేదీ)న్నారు. వీరిలో 1,10,560 మంది పురుషులు, 1,12,121 మంది మహిళా ఓటర్లు, 68 మంది ట్రాన్స్‌జెండర్లున్నారు. బిజద, భాజపా, కాంగ్రెస్‌ పార్టీల అభ్యర్థులతో పోటీగా స్వతంత్ర అభ్యర్థి శిబ శంకర దాస్‌ (పింటు దాస్‌) ముమ్మర ప్రచారం చేస్తున్నారు. అన్ని పార్టీల అభ్యర్థులకు స్వతంత్ర అభ్యర్థుల పోరు వెంటాడుతుండగా, బ్రహ్మపుర అసెంబ్లీ సెగ్మెంట్‌ను దక్కించుకునేదెవరన్నది వేచి చూడాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని