logo

నాన్న లేని లోకంలో ఉండలేనని..

తనను చిన్ననాటి నుంచి కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మృతి చెందడంతో ఆ కుమార్తె హృదయం తల్లడిల్లింది.

Published : 16 Apr 2024 05:27 IST

15 రోజులకే కుమార్తె మృతి
పెదమరికిలో విషాదం

పి.రోషిణి (పాతచిత్రం)

పార్వతీపురం గ్రామీణం, పట్టణం, న్యూస్‌టుడే: తనను చిన్ననాటి నుంచి కంటికి రెప్పలా కాపాడిన తండ్రి మృతి చెందడంతో ఆ కుమార్తె హృదయం తల్లడిల్లింది. గోరుముద్దలు పెట్టి పెంచిన నాన్న ఇక రాడని తెలిసిన ఆ అమ్మాయి గొంతులో తడారింది. రోజుల తరబడి తండ్రినే గుర్తుచేసుకొని బెంగతో తిండి, నిద్ర మానేసి తనలో తానే కుమిలిపోయింది. చివరికి ఆయన మృతి చెందిన 15 రోజులకే కుటుంబానికి దూరమై కన్నీటి శోకాన్ని మిగిల్చింది.  

పి.భుజంగరావు (పాతచిత్రం)

పార్వతీపురం మండలంలో జరిగిన ఈ హృదయ విదారక ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదమరికి గ్రామానికి చెందిన పాల్తేరు భుజంగరావు (45) ఒడిశా సమీపంలోని అలమండలో ఫాస్టుఫుడ్‌ సెంటర్‌ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. ఈయనకు భార్య ఉష, కుమార్తె, కుమారుడు సాయిభార్గవ ఉన్నారు. కుమార్తె రోషిణి (19) ఇంటర్మీడియట్‌ తర్వాత చదువు మానేసి తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేది. గత నెల 31న గ్యాస్ట్రిక్‌తో మృతి చెందారు. ఆయన హఠాన్మరణంతో కుటుంబం వీధిన పడింది. తండ్రి మృతిని జీర్ణించుకోలేని కుమార్తె అప్పటి నుంచి సరిగా భోజనం చేయక, వేళకు నిద్రపోకుండా ఉండిపోయింది. ఆదివారం రాత్రి ఏమీ తినకుండా నీరసంగా ఉందని నిద్రకు ఉపక్రమించింది. కుమార్తె ఉలుకూ, పలుకూ లేకుండా ఉండటంతో పాటు శరీరం చల్లబడటం చూసిన తల్లి షాక్‌కు గురై బోరున విలపించింది. విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఇంటికి చేరుకొని ఆమె మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు. 15 రోజుల వ్యవధిలో ఇద్దరూ మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని