logo

అలజంగిపై ప్రేమ ఏల??

పార్వతీపురం నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే జోగారావు ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి.

Published : 16 Apr 2024 05:37 IST

ఏఎస్పీకి వినతిపత్రం అందిస్తున్న మాజీ ఎమ్మెల్సీ జగదీశ్‌, మాజీ ఎమ్మెల్యే చిరంజీవులు

పార్వతీపురం, న్యూస్‌టుడే: పార్వతీపురం నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే జోగారావు ఎన్నికల నియమావళిని పదేపదే ఉల్లంఘిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. వాలంటీర్లు, ఉద్యోగులపై చర్యలు తీసుకుంటూ ఆయన విషయంలో ఎందుకు వెనుకంజ వేస్తున్నారో అర్థం కావడం లేదని పట్టణ వాసులు ప్రశ్నిస్తున్నారు.

నర్సిపురంలోని తన ఇంటి వద్ద ఎమ్మెల్యే ఆదివారం వాలంటీర్లతో సమావేశం నిర్వహించారని తెదేపా నాయకులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు విచారణ చేపట్టి 24 మంది వాలంటీర్లను తొలగించినట్లు ఆర్డీవో, నియోజకవర్గ ఆర్వో హేమలత తెలిపారు. ఇందులో నర్సిపురానికి చెందిన 11 మంది, పెదబొండపల్లికి చెందిన 13 మంది ఉన్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఇంటి నుంచి బయటకు రావడం నిర్ధారణ కావడంతో తొలగిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.

అంటే.. ఎమ్మెల్యే వాలంటీర్లతో సమావేశం అయినట్లా కాదా.. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధమా కాదా.. అన్నది అధికారులు తేల్చలేదు. ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు చేపట్టలేదు. దీనిపై పార్వతీపురం ఎంపీడీవో అకీబ్‌ జావేద్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా.. ఇంట్లో సమావేశం నిర్వహించినట్లు తమకు ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పడం విశేషం.

నడిరోడ్డుపై సభ..

ఆదివారం పట్టణంలో సిద్ధం సభ నిర్వహణకు అనుమతి తీసుకుని నడిరోడ్డుపై వేదిక ఏర్పాటు చేశారు. వీధి సందులో (స్ట్రీట్‌ కార్నర్‌) సమావేశం నిర్వహిస్తామని అనుమతి కోరి ప్రధాన రహదారిని మూసేసి మరీ వేదిక ఏర్పాటు చేశారు. ఓ వైపు ట్రాఫిక్‌కు గంటల పాటు ఇబ్బందులు ఎదురైనా ఎవరూ పట్టించుకోలేదు. విషయం తెలిసిన వెంటనే పోలీసులను పంపించామని ఆర్వో చెబుతున్నారు. ఇక నుంచి రోడ్డుపై ఎవరికీ అనుమతులు ఇవ్వమని పేర్కొన్నారు.

సందేశం బయటకు వచ్చినా..

ఇప్పటి వరకు జగన్‌ ప్రభుత్వంలో లబ్ధి పొందిన వారు వైకాపాకు ఓట్లేసేలా వాలంటీర్లు కృషి చేయాలని ఎమ్మెల్యే జోగారావు చరవాణిలో సందేశం ఇచ్చినట్లు సామాజిక మాధ్యమాల్లో ఆడియో వైరలైంది. బహిరంగంగా చీరలు, డబ్బులు పంపిణీ చేశారనే వీడియోలు బయటకు వచ్చాయి. అయినా అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదని ప్రతిపక్ష నాయకులు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎఫ్‌ఎస్టీ బృందాలు ఆయన వెంట తిరుగుతున్నా ఎందుకు గుర్తించడం లేదంటున్నారు.

పరస్పర ఫిర్యాదులు

పార్వతీపురం, గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా, తెదేపా నాయకుల మధ్య ఆదివారం నెలకొన్న ఉద్రిక్త వాతావరణంపై ఇరువర్గాల నాయకులు ఇచ్చిన ఫిర్యాదులపై పార్వతీపురం గ్రామీణ పోలీసులు కేసులు నమోదు చేశారు. విచారణ చేపడుతున్నట్లు సీఐ శశిభూషణరావు తెలిపారు.

  • తెదేపా అభ్యర్థి విజయచంద్ర ఫిర్యాదుపై ఎమ్మెల్యే జోగారావు, జె.ప్రవీణ్‌, పి.మురళీకృష్ణ, ఎస్‌.సందీప్‌, ఆర్‌.చిన్నంనాయుడు, బి.రవికుమార్‌, కె.బాలకృష్ణ, ఎస్‌.శ్రీనివాసరావు, ఎన్‌.సుధీర్‌పై ఎన్నికల నియమావళి అతిక్రమణ, కులదూషణ కేసులు నమోదు చేశారు.
  • తనపై దాడికి యత్నించాడని ఓ టీవీ ఛానల్‌ రిపోర్టర్‌ ఫిర్యాదుపై ఎస్‌.శ్రీనివాసరావుపై కేసు నమోదు చేశారు.
  • అనుమతి లేకుండా తన కార్యాలయంలోకి ప్రవేశించడం, కులం పేరుతో దూషించారని ఎమ్మెల్యే ఇచ్చిన ఫిర్యాదుపై విజయచంద్ర, బి.సీతారాం, జి.వెంకటనాయుడు, బి.చంద్రమౌళీశ్వరరావు, కె.ప్రసాద్‌ తదితరులపై కేసులు నమోదయ్యాయి.
  • నిబంధనల అతిక్రమణలకు పాల్పడినట్లు విజయచంద్రపై ఎంపీడీవో ఫిర్యాదు చేయడంతో మరో కేసు పెట్టారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని