logo

ఇది జగనన్న చెత్త పన్ను

ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వంగా పేరుగాంచింది వైకాపా. అన్నిరకాల పన్నులు పెంచేసింది. వివిధ రకాల ఛార్జీల భారాన్ని మోపింది.

Published : 17 Apr 2024 04:39 IST

ప్రజలపై  ప్రతి నెలా ఆర్థిక భారం

రెండు జిల్లా కేంద్రాల్లో బాదుడు

ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో దోపిడీ ప్రభుత్వంగా పేరుగాంచింది వైకాపా. అన్నిరకాల పన్నులు పెంచేసింది. వివిధ రకాల ఛార్జీల భారాన్ని మోపింది. చివరకు చెత్తకూ పన్ను వేసి, పురపాలక ప్రజల నుంచి డబ్బులు గుంజేసింది. క్షేత్రస్థాయిలో తీవ్ర విమర్శలు ఎదురైనప్పటికీ పట్టించుకోని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కచ్చితంగా వసూలు చేయాలని పురపాలక శాఖ ద్వారా ప్రత్యేక ఆదేశాలు సైతం జారీ చేశారు. దీంతో కొన్ని నెలల పాటు పట్టణాల వాసులు గగ్గోలు పెట్టారు. ఎన్నికల నేపథ్యంలో రెండు నెలలుగా ప్రక్రియను ఆపినట్లు తెలుస్తోంది.

ఈనాడు- విజయనగరం: - న్యూస్‌టుడే, విజయనగరం పట్టణం

వ్యతిరేకించినా..

పన్ను చెల్లించడానికి చాలామంది బలవంతంగానే ముందుకొచ్చారు. కొందరు వ్యతిరేకించారు. మరోవైపు నెలవారీ గృహ, వాణిజ్య సంస్థల నుంచి పూర్తి స్థాయిలో పన్ను వసూలు కాకపోవడంతో చెత్త వాహనాల నిర్వాహకులకు సాధారణ నిధుల నుంచి చెల్లిస్తున్నారు. విజయనగరంలో అమలవుతుండగా, బొబ్బిలి, సాలూరు, రాజాం పురపాలికలు, పాలకొండ, నెల్లిమర్ల నగర పంచాయతీల్లో గతంలో నమూనాగా అమలు చేశారు.

నగరపాలక సంస్థలో..

క్లాప్‌ కార్యక్రమం అమలులో భాగంగా నగరానికి 63 వాహనాలు ఇచ్చారు. వీటి నిర్వహణకు చెత్త పన్ను సొమ్మును వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. సంబంధిత ఏజెన్సీకి ఒక్కో వాహనానికీ అద్దె రూపంలో నెలకు రూ.65,300 చొప్పున చెల్లించాలి. ఏడాదికి 5 శాతం పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నగరపాలక సంస్థ పరిధిలో కనిష్ఠంగా రూ.150 నుంచి గరిష్ఠంగా రూ.15 వేల వరకు తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో 53 వాహనాలు తిప్పారు. ప్రస్తుతం 47 తిరుగుతున్నాయి. వీటికి ఇప్పటికే రూ.3 కోట్ల మేర ఇవ్వాలి. దీంతో సాధారణ నిధుల నుంచి చెల్లింపులు చేశారు. అభివృద్ధికి ఉపయోగించాల్సిన సొమ్మును అటువైపు మళ్లించడంతో సభ్యులు సైతం మండిపడ్డారు.

యూజర్‌ ఛార్జీల కింద..

‘క్లాప్‌ వాహనాల నిర్వహణకు యూజర్‌ ఛార్జీల రూపేణా వసూలు చేస్తున్నాం. ఈ మేరకు సచివాలయాల సిబ్బందికి ఆదేశాలు జారీ చేశాం. దీనిపై అవగాహన కల్పించాల్సి ఉంది. పన్ను వసూళ్లు తగ్గడంతో ఇప్పటి వరకు సాధారణ నిధులు రూ.42 లక్షలు చెల్లించాం’ అని నగరపాలక సంస్థ కమిషనర్‌ మల్లయ్యనాయుడు తెలిపారు.


పింఛను నుంచి తీసుకునేవారు

ప్రతి నెలా చెత్త పన్ను చెల్లించడం భారంగా ఉంది. చెల్లించకపోతే పింఛను నుంచి తీసుకుంటున్నారు. మూడు నెలల క్రితం నా భర్త చనిపోయారు. అప్పటి నుంచి ఇవ్వనని చెప్పేశాను.  

-ముగతమ్మ, విజయనగరం


నెలకు రూ.60

చెత్తపన్ను నెలకు రూ.60 తీసుకుంటున్నారు. ఇంటి పన్ను చెల్లిస్తున్నాం. అందులో కూడా చెత్త పన్ను ఉందని అన్నారు. మళ్లీ కొత్తగా తీసుకోవడం ఏంటో అర్థం కావడం లేదు. అయినా పారిశుద్ధ్య పనులు చేయడం లేదు. రోజుల తరబడి వ్యర్థాలు పేరుకుపోతున్నాయి.
-కె. గౌరి, గాజులరేగ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని