logo

పైసాచికత్వం

మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 30 Apr 2024 04:28 IST

సమయం ఉన్నా పింఛన్లు అందించలేరా?
గంటల్లో పూర్తయ్యే పనికి వెనకడుగెందుకు
బ్యాంకుల్లో నగదు పేరిట ప్రభుత్వం డ్రామా
ప్రతిపక్షాలపై తప్పు నెట్టేందుకు కుట్ర

పేదల ప్రభుత్వం అంటూ గొప్పలు చెప్పుకొంటూ పింఛన్లదారులతో ఆడుతోంది ఉన్నత యంత్రాంగం. తెర వెనుక ఉండి ఉన్నతాధికారులతో అష్టకష్టాలు పెట్టిస్తూ ఆ నెపాన్ని ప్రతిపక్షాలపై నెట్టేందుకు యత్నిస్తోంది.. గత రెండు నెలలుగా రాష్ట్రంలో పింఛన్ల పంపిణీ విధానం వారి వికృత చేష్టలకు అద్దం పడుతోంది. ఇప్పటి వరకు ఇంటింటికీ వెళ్లి అందించేవారు.. ఎన్నికల ముందు వారిని ఇబ్బంది పెట్టేందుకు తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. అందులో భాగంగానే ఏప్రిల్‌లో లబ్ధిదారులను సచివాలయాలకు రప్పించింది. మే నెలలో ఏకంగా బ్యాంకులకు వెళ్లాలని చెప్పడంతో ప్రభుత్వంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు.


ఈనాడు- విజయనగరం, న్యూస్‌టుడే, మయూరికూడలి: మే నెల పింఛన్ల పంపిణీకి సంబంధించి ఒకటో తేదీన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకు ఖాతాలు లేనివారికి, దివ్యాంగులకు, మంచం పట్టిన రోగులు, వీల్‌ఛైర్‌లో ఉన్నవారు, సైనిక పింఛన్లు తీసుకునే వారికి అయిదో తేదీలోగా వారింటి వద్దే అందజేయాలని ఆదేశించింది. ఉమ్మడి జిల్లాలో 4.29 మంది పింఛనుదారులున్నారు. వీరిలో ఇంటి వద్ద అందజేయాల్సిన వారు సుమారు 1.04 లక్షల మంది ఉన్నారని, మిగిలిన వారందరికీ ఆధార్‌కార్డు నంబరుతో లింకైన బ్యాంకు ఖాతాలున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పుడు వీరంతా బ్యాంకులకు వెళ్లాల్సిన పరిస్థితి.

జమ సరే.. తీసుకోవడం ఎలా?

రెండు జిల్లాల్లో బ్యాంకులకు వెళ్లాల్సిన వారు 3 లక్షల మందికి పైగా ఉన్నారు. వీరిలో చాలామందికి ఖాతాలు ఉన్నప్పటికీ అవన్నీ పాతవే. మనుగడలో ఉన్నాయో లేవో కూడా తెలియని పరిస్థితి. ఈకేవైసీ కాకపోవడం, ఆధార్‌ కార్డుతో అనుసంధానం జరగకపోవడం, సున్నా నిల్వలు.. వీటిల్లో ఏ సమస్య ఉన్నా లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవు. అసలు నగదు జమైందో లేదో కూడా కొందరికి తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో బ్యాంకులకు వెళ్లి ఎలా తీసుకోవాలని లబ్ధిదారులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు.

గంటల్లో పూర్తి చేయవచ్చు

విజయనగరం జిల్లాలోని 626 సచివాలయాల్లో 5,256 మంది పనిచేస్తున్నారు. ఒక్కోచోట 6 నుంచి 10 మంది వరకు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. వారి పరిధిలో 200 నుంచి 300 మంది లబ్ధిదారులున్నారు. గత నెలలో జిల్లా వ్యాప్తంగా 2,83,773 మందికి నగదు వచ్చింది. ఈ లెక్కన ఒక్కో ఉద్యోగి సగటున 50 మందికి ఇచ్చినా కొన్ని గంటల్లోనే పంపిణీ పూర్తిచేయగలరు.

ఇలా ఆలోచించరెందుకు?

గ్రామస్థాయిలో సచివాలయాల ఉద్యోగులతో పాటు ఆశాలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, వెలుగు క్షేత్ర సహాయకులు, వీవోఏ, వీఆర్‌ఏలున్నారు. వీరిని ఉపయోగించుకుంటే మరింత సులభంగా అందించవచ్చు.

అసత్య ప్రచారం

ఎన్నికల కమిషన్‌ పింఛన్ల నగదు వాలంటీర్లతో పంపిణీ చేయించవద్దని ఆదేశించింది. దీంతో ఏప్రిల్‌ నెలలో సచివాలయ ఉద్యోగులతో పంపిణీ చేయాలని సూచించింది. కొన్నిచోట్ల శిబిరాలు పెట్టాలని సూచించింది. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో చాలాచోట్ల పింఛనుదారులను కార్యాలయాలకే రప్పించారు. దీంతో వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. అయినా కనికరం చూపని ప్రభుత్వం.. మే నెలలో మరిన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేలా నేరుగా బ్యాంకులకు వెళ్లాలని సూచించింది.

15 కిలోమీటర్లు వెళ్లేదెలా..

మెంటాడ మండలం కొండలింగాలవలస గ్రామంలో ఏప్రిల్‌ నెలకు సంబంధించిన పింఛన్ల నగదును స్థానిక సచివాలయం వద్ద అందజేశారు. ఈసారి అక్కడి లబ్ధిదారులంతా సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెంటాడలోని బ్యాంకులకు వెళ్లాలి.


శ్రీకాకుళం వెళ్లాలా..

సంతకవిటి మండలంలో 7,483 మందికి బ్యాంకు ఖాతాలకు జమ చేయనున్నారు. పోడలి, గార్నాయుడుపేట, గుజ్జన్నపేట, చిత్తారపురం గ్రామాల్లో 435 మంది ఖాతాలు శ్రీకాకుళంలోని యూనియన్‌ బ్యాంకుకు అనుసంధానమై ఉన్నాయి. ఈ బ్యాంకు చిత్తారపురం పంచాయతీకి 45 కి.మీ. దూరంలో ఉండటంతో వారంతా అక్కడికి వెళ్లాల్సిందే. వాల్తేరులో 399, జీఎస్‌పురంలో 361 మంది 15 కి.మీ. దూరంలో ఉన్న మండవకురిటిలో బ్యాంకుకు వెళ్లి నగదు తీసుకోవాలి.


అడుగడుగునా ఇబ్బందులే

1 అవస్థ

కొందరు ఖాతాలకు సాంకేతిక కారణాలతో ఆధార్‌ నంబరు అనుసంధానం కాలేదు. అలాంటి వారు ఆందోళనకు గురవుతున్నారు. కొంత మంది కేవైసీ ప్రక్రియ పూర్తి చేయలేదు. ఇలాంటి వారు రెండు జిల్లాల్లో ఆరేడు వేల మంది ఉంటారు. పైగా చాలా గ్రామాలకు బ్యాంకులు దూరంగా ఉన్నాయి. అలాంటి వారంతా ఏం చేయాలో తెలియక మదన పడతున్నారు.


2 అవస్థ

ఒకేసారి లబ్ధిదారులందరూ బ్యాంకులకు వెళ్లినా నగదు చెల్లించే అవకాశం లేదు. ఫారంలో వివరాలు నమోదు చేసి క్లర్క్‌కు ఇస్తే వాటిని ఆన్‌లైన్‌లో చెక్‌ చేసి ఆ ఖాతాలో నగదు ఉంటే వారికి చెల్లింపులు జరుగుతాయి. ప్రతి ఖాతాదారుడికీ నగదు ఇచ్చేందుకు 10 నిమిషాలు పడుతుంది. ఈ లెక్కన ఉదయం పది గంటలకు తెరిచిన తర్వాత పనివేళలు ముగిసే వరకు 30 నుంచి 40 కంటే ఎక్కువ మందికి ఇచ్చే వీలుండదు.


3 అవస్థ

కొన్ని చోట్ల బ్యాంకుల్లో ఒకరిద్దరు సిబ్బంది ఉన్నారు. గ్రామీణ బ్యాంకుల్లో గరిష్ఠంగా రోజుకు 50 మంది కంటే ఎక్కువగా పింఛన్ల నగదు జారీ చేసే అవకాశం లేదు. ఇలా అయితే కిక్కిరిసిపోతాయి. పనివేళలు ముగిసిన తర్వాత సిబ్బంది తాళాలు వేసి వెళ్లిపోతారు. ఈక్రమంలో లబ్ధిదారులు రోజుల తరబడి తిరగాలి.


4 అవస్థ

ఉదయం 8 గంటలకే ఎండ తీవ్రత పెరుగుతోంది. బ్యాంకులు పది గంటల వరకు తెరవరు. నగదు కోసం పండుటాకులు ముందుగానే వెళ్తుంటారు. ఈక్రమంలో ఇబ్బందులు పడతారు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టడం లేదు.


8 కి.మీ వెళ్లాలి

సీతారాంపురం నుంచి గజపతినగరం 8 కి.మీ. నా దగ్గర బ్యాంకు పుస్తకం ఉంది. ఒక్కదాన్నే వెళ్లలేను. ఎవరినో తోడు పెట్టుకుని చేరుకోవాలి. బ్యాంకు పుస్తకం పని చేస్తుందో, లేదో తెలియదు. దీనికంటే సచివాలయంలోనే నయం. ఇంటి దగ్గర ఇచ్చేలా ప్రభుత్వం చూడాలి. లేకుంటే ఒకటికి, రెండుసార్లు తిరిగి మరింత ఇబ్బంది పడాల్సి వస్తుంది.  

అంటిపాక నారాయణమ్మ, సీతారాంపురం


బ్యాంకు పుస్తకం ఉందో, లేదో?

ఇంట్లో నుంచి బయటి అరుగు మీదకు రావడమే కష్టంగా ఉంది. అడుగు వేస్తే ఆయాసం వస్తోంది. గత నెల సచివాలయానికి వెళ్లడానికి ఇబ్బంది పడ్డాను. ఇప్పుడు ఖాతాలో వేస్తాం అంటున్నారు. బ్యాంకు పుస్తకం ఉందో, లేదో నాకే తెలియదు. పుస్తకం ఉన్నా నాలుగైదేళ్లుగా బ్యాంకుకు వెళ్లలేదు. పింఛను ఇవ్వడానికి ఇన్ని బాధలు పెడుతున్నారు. మా బాబు సాయంతో వెళ్లాలి.

తగరంపూడి నారాయణరావు, పురిటిపెంట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని