logo

పునరావాసంలో జగన్మోసం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు.

Published : 06 May 2024 04:03 IST

నిర్వాసితుల కాలనీలపై నిర్లక్ష్యం
పాలకుల మాట.. నీటి మూటే!
న్యూస్‌టుడే, భోగాపురం

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి భూములు ఇచ్చిన నిర్వాసితుల బాగోగులు పాలకులకు పట్టడం లేదు. పుట్టినగడ్డ నుంచి పునరావాస కాలనీలకు తరలించినా.. మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించడం లేదు. అక్కడ ఏ వీధిలో చూసినా సమస్యలు కోకొల్లలు.. పునరావాస ప్యాకేజీ పేరుతో నిర్వాసితులకు మాయ మాటలు చెప్పి మోసగించిన పరిస్థితి.  అన్నీ మేమే కట్టేస్తాం.. అందమైన నగరంగా మార్చేస్తామన్న నాయకులు, అధికారులు అటువైపు తొంగి చూడటం లేదు. నిర్వాసితుల గోడు వినే నాథుడే కనిపించడం లేదు.


సమస్యలు కోకొల్లలు

నిర్వాసితులను పునరావాస కాలనీలకు హుటాహుటిన తరలించిన అధికారులు వారి గురించి పట్టించుకోవడం లేదు.  ఆయా కాలనీల్లో పరిస్థితులు, సమస్యలపై దృష్టి సారించడం లేదు. ఇళ్ల మధ్య రాళ్ల గుట్టలు అలాగే ఉన్నాయి. కాలువల్లో బండరాళ్లు, చెత్తచెదారం పేరుకు పోయి ఉన్నాయి. మురుగు నిలిచి దుర్వాసన వెదజల్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా నిర్మాణ పనులు పూర్తి కాని ఇళ్లల్లో తలదాచుకుంటున్న నిర్వాసితులు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆవేదన చెందుతున్నారు.

లింగాలవలస కాలనీలో నిర్వాసితుల గృహాల మధ్య తొలగించని గుట్ట


వలసదారులకు కన్నీళ్లే...

మరడపాలెం, బొల్లింకలపాలెం, ముడసర్లపేట గ్రామాలకు చెందిన సుమారు 80 కుటుంబాల వారు స్థానికంగా జీవనోపాధి లేక విజయవాడ, తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలకు వలసబాట పట్టారు. ఇక్కడే ఉన్న ఇళ్లకు వచ్చిపోతుంటారు. వీరి ఆధార్‌, రేషన్‌, ఓటరు కార్డులన్నీ గ్రామాల్లోనే ఉన్నాయి. ప్రతి నెలా ఊరికి వచ్చి సరకులు విడిపించుకోవడం ఇబ్బందిగా ఉందని.. కొందరు రేషన్‌ కార్డులను వలస వెళ్లిన చోటుకు బదిలీ చేయించుకున్నారు. వీరంతా నివాసాలను కోల్పోయినా.. స్థానికులు కాదంటూ పునరావాస కాలనీలో ఇళ్ల స్థలాలు కేటాయించలేదు. గ్రామాల్లో ఇళ్లను కూల్చి వేసిన సమయంలో ఉపాధిని వదులుకొని కుటుంబాలతో తిరిగి వచ్చేశారు. నేటికీ పునరావాసం కల్పించకపోవడంతో కన్నీటి పర్యంతమవుతున్నారు.


ఉన్నఫళంగా తరలించి...

విమానాశ్రయ నిర్వాసితుల కోసం మూడు చోట్ల పునరావాస కాలనీలు ఏర్పాటు చేశారు. పోలిపల్లి రెవెన్యూ లింగాలవలసలో రెండు చోట్ల 25 ఎకరాల్లో 256 కుటుంబాలకు, గూడెపువలస రెవెన్యూలో 17 ఎకరాల్లో 140 కుటుంబాలకు పునరావాసం కల్పించారు. బాధితులందరికీ పరిహారంతో పాటు ప్యాకేజీలు చెల్లించినట్లు అధికారులు చెబుతున్నారు. పునరావాస కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తికాకుండానే తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ఐదు గ్రామాలను ఖాళీ చేయించారు. అక్కడి నుంచి హఠాత్తుగా కాలనీలకు తరలించారు. ఇక్కడికి వచ్చిన నిర్వాసితుల్లో అధికశాతం కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు.

కాలువల్లో బండరాళ్లు


గొంతు ఎండుతున్నా...

గత మూడు నెలలుగా ఎగువవీధి కాలనీకి తాగునీరు రావడం లేదు. కాలనీలో కొందరు ఇళ్లలో వేసుకున్న బోర్ల నుంచి నీరు తెచ్చుకుంటున్నామని నిర్వాసితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దిగువ వీధికి, ఎగువ వీధికి రెండు ట్యాంకులు కట్టినా ఫలితం లేదు. ఎగువవీధిలో ఉన్నది దిష్టిబొమ్మలా మారింది. అధికారులను అడిగినా సరైన సమాధానం రావడం లేదు. నిర్వాసితుల గొంతు ఎండుతున్నా వైకాపా పాలకులు పట్టించుకోవడం లేదు.

నిర్వాసిత కాలనీలో నిరుపయోగంగా ఉన్న నీటి ట్యాంకు


ప్యాకేజీ లేదు. ఇళ్లు లేవు..
- కొయ్య సూరమ్మ, నిర్వాసితురాలు

మా భూములు, గృహాలు మరడపాలెంలో ఉండేవి. జీవనోపాధికి వేరే ప్రాంతానికి వలస వెళ్లి బతకడమే తప్పయింది. ఆ రోజు మాకు ఇస్తానన్న ప్యాకేజీ ఇవ్వలేదు. రెండేళ్లుగా ఇబ్బందులు పడుతున్నాం. ఇళ్లు కట్టుకోవడానికి స్థలాలు ఇవ్వమని అధికారుల చుట్టూ తిరిగినా ప్రయోజనం లేదు. పాలకులూ పట్టించుకోలేదు.


మౌలిక వసతులు ఒట్టిమాటే..
- లోపున సత్యవతి, మరడపాలెం పునరావాస కాలనీ

కాలనీల్లో ఇళ్లు కట్టడమే కాకుండా మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పిన అధికారులు నేడు ఎక్కడా కనిపించడం లేదు. కాలువల్లో పడిన బండరాళ్లు అలాగే ఉన్నాయి. మురుగు నీరు పారడం లేదు. తాగునీటికి ఇబ్బందులు పడుతున్నాం. ఎవరికి చెబితే సమస్యలు తీరుతాయో తెలీడం లేదు.


కుళాయి నీరు హుళక్కే..
రమణ, మరడపాలెం పునరావాస కాలనీ

ఎగువ వీధిలో ఉన్న 70 కుటుంబాలకు మూడు నెలలుగా కుళాయి నీరు రావడం లేదు. అధికారులు ఎలాంటి  చర్యలు చేపట్టడం లేదు. వీధుల్లో బోరు బావులు పనిచేయడం లేదు. ప్రధాన రహదారిలో వీధిదీపాలు లేక చీకట్లు తప్పడం లేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని