logo

యువతా మేలుకో.. భవిత మార్చుకో!

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది! ఇది నిజమో కాదో.. కాసేపు పక్కన పెడితే.. మరో అయిదు రోజుల్లో మీరు వేసే రెండు ఓట్లు మాత్రం మీ జీవితాలను మార్చుతాయి. చీకట్లను తరిమేసి వెలుగుల మయం చేస్తాయి.

Published : 09 May 2024 03:33 IST

కారు చీకట్లలో కాంతిపుంజంలా ఎన్డీయే హామీలు
లక్షల ఉద్యోగాలతో నిరుద్యోగులకు ఊరట
మెగా డీఎస్సీతో భావి గురువుల జీవిత కల సాకారం
వాలంటీర్లకు రెట్టింపు జీతాలతో గౌరవం
న్యూస్‌టుడే- రాజాం

ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది! ఇది నిజమో కాదో.. కాసేపు పక్కన పెడితే.. మరో అయిదు రోజుల్లో మీరు వేసే రెండు ఓట్లు మాత్రం మీ జీవితాలను మార్చుతాయి. చీకట్లను తరిమేసి వెలుగుల మయం చేస్తాయి. ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలలను సాకారం చేస్తాయి. యువత తన కాళ్లపై తాము నిలబడేలా తీర్చిదిద్దుతాయి. మెరుగైన జీవితానికి బాటలు వేస్తాయి. గడిచిన అయిదేళ్లలో యువత, నిరుద్యోగులను వైకాపా ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురిచేసింది. ఉద్యోగాలు, ఉపాధి కల్పించకుండా వీరిని రోడ్డున పడేసింది. ఈ కారు చీకట్లో కాంతిపుంజంలా కూటమి ప్రకటించిన మేనిఫెస్టో వీరికి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. వీరు అధికారంలోకి వస్తే అయిదేళ్ల నిర్లిప్తత, నిరీక్షణకు తెరపడుతుంది. యువత చేయాల్సిందల్లా సరైన నిర్ణయంతో ఈవీఎంల్లో రెండు మీట్లను నొక్కి ఓటేయడమే. దీన్ని కాదని ప్రలోభాలకో, పచ్చనోటుకో, కులానికో, మతానికో సాగిలపడి తప్పు చేస్తే మరో అయిదేళ్లు శిక్ష అనుభవించేందుకు బాటలు వేసుకున్నట్లే!


20 లక్షల ఉద్యోగాలు

తెదేపా కూటమి అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని ప్రకటించారు. ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారు. చదువుకున్న నిరుద్యోగ యువతకు ఇది సువర్ణవకాశం. అందుకే తెదేపా శ్రేణులు ‘జాబు రావాలంటే.. బాబు రావాలని’ దిక్కులు పిక్కటిల్లేలా నినదిస్తున్నారు. వైకాపా అధికారంలోకి వచ్చిన తరువాత అయిదేళ్లలో వీరికి దక్కిన ఉద్యోగాలు పెద్దగా ఏమీ లేవు. ఉన్నత చదువులు చదివిన వారు సైతం వారి స్థాయికి తగిన ఉద్యోగాలు లభ్యం కాక చిన్నా, చితకా ఉద్యోగాల కోసం పాకులాడి నిరుత్సాహానికి గురవుతున్నారు. సచివాలయాల ఉద్యోగాల పేరుతో వైకాపా డప్పుకొట్టుకోవడం తప్ప కొత్తగా ఒరిగిందేమీ లేదు. వీరిని సకాలంలో రెగ్యులర్‌ చేయకపోగా అవస్థలకు గురిచేస్తూ వచ్చారు. ఇదేదో గొప్పగా ప్రచారం చేసుకుని ఓట్లు కొల్లగొట్టేందుకు వైకాపా నాయకులు ఊదరగొడుతుండటాన్ని యువత గమనిస్తోంది. మరి మిగిలినవారి పరిస్థితి ఏమిటనేదానికి అధికార పార్టీ నాయకుల నుంచి మౌనమే సమాధానం అవుతోంది. యువత, నిరుద్యోగులు సరైన నిర్ణయం తీసుకోవాల్సిన తరుణమిది.  దీనికి భిన్నంగా వ్యవహరించి ఓటేస్తే బతుకు బస్టాండవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

  • ఒక్క విజయనగరం జిల్లాలోనే 18-39 ఏళ్ల వయసున్న వారు 7,03,380 మంది ఉన్నారు. వీరిలో 18-19 వయసు వారు 39,612 కాగా 20-29 వయసున్న వారు 2,45,813 మంది ఉన్నారు. లక్షల మంది యువత ఉద్యోగాలు కోసం నిరీక్షిస్తుంటే ఈ అయిదేళ్లలో విజయనగరం, పార్వతీపురం జిల్లాల్లో కలిపి సచివాలయాల్లో 16,322 మందిని ఎంపిక చేశారు. ఇవన్నీ చిరుద్యోగాలే.  

వాలంటీర్లకు రూ.10 వేలు

విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో 1,085 సచివాలయాల పరిధిలో 16,125 మంది వాలంటీర్లు పనిచేస్తూ వచ్చారు. సేవా దృక్పథంతో పనిచేయాలనే షరతుతో వీరిని ఎంపిక చేశారు. ఇంజినీరింగ్‌ వంటి ఉన్నత చదువుల్లో డిగ్రీలు సాధించిన వారు సైతం వాలంటీర్ల పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకుని ఎంపికయ్యారు. నెలంతా ప్రభుత్వం చెప్పిన పనులన్నీ చేస్తే వీరికి ఇస్తున్న గౌరవ వేతనం కేవలం రూ.5 వేలు. అంటే రోజుకు సగటున రూ.166. ఉపాధి పనులకు వెళ్తున్న నిరక్షరాస్యులు సైతం రూ.250-300 తెచ్చుకుంటున్నారు. పనులు దొరికితే భవన నిర్మాణ కార్మికులకు రూ.500-650 గిట్టుబాటు అవుతోంది. చదువుకున్న యువతను మాత్రం వాలంటీర్లుగా నియమించి ఊహల్లో తిప్పుతూ వారి జీవితాలను నాశనం చేసి పార్టీ బలోపేతానికి జగన్‌ వినియోగించుకుంటూ వచ్చారు. ఇప్పుడు వీరితో రాజీనామాలు చేయించి ఎన్నికల్లో తురుపు ముక్కలుగా ప్రయోగిస్తున్నారు. వీరంతా విజ్ఞతతో వ్యవహరించి రాజకీయాలకు దూరంగా ఉండి పోలింగ్‌ రోజున సరైన నిర్ణయం తీసుకుంటే జీవితాలను వారికి వారే చక్కదిద్దుకున్న వారవుతారు.

  • వాలంటీర్ల అవస్థలను గుర్తించిన కూటమి గౌరవ వేతనాలను రెట్టింపు చేస్తూ నెలకు రూ.10 వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఇటీవల వరకూ రెండు జిల్లాల్లో నెలకు వీరికి రూ.8.06 కోట్లు అందుతుండగా కూటమి అధికారంలోకి వస్తే రూ.16.12 కోట్లు నెలకు వేతనాల రూపంలో అందుతాయి. వీరిలో నైపుణ్యాలకు పదును పెట్టి లక్షాధికారులను చేయాలని చంద్రబాబు పరితపిస్తున్నారు.

మెగా డీఎస్సీ

ఏటా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని అధికారంలోకి వచ్చిన జగన్‌ అయిదేళ్లలో ఆ విషయాన్నే విస్మరించారు. ఉమ్మడి జిల్లాలో హేతుబద్ధీకరణకు ముందు 9,800 పోస్టులను చూపగా, తరువాత ఈ సంఖ్య 8,082కు పడిపోయింది. తీరా ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ లబ్ధి కోసం ఆదరాబాదరాగా జగన్‌ డీఎస్సీ ప్రకటించారు. ఉన్న పోస్టులను తగ్గించి చూపి ప్రకటించడంతో అభ్యర్థుల్లో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. ఎన్నికల ముందు ఆడిన రాజకీయ క్రీడకు ఎన్నికల సంఘం అడ్డుకట్ట వేయడంతో ప్రక్రియ నిలిచిపోయింది. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే మెగా డీఎస్సీతో వేల మందికి మేలు కలగనుందనే అభిప్రాయం శిక్షణ పొందిన నిరుద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.

  • తెదేపా కూటమి అధికారంలోకి వచ్చాక తొలి సంతకం మెగా డీఎస్సీపైనే అని ఇప్పటికే మేనిఫెస్టోలో ప్రకటించారు. ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్న వేలాది మంది భావి గురువులకు ఇది సంజీవనిలా నిలవనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని