logo

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి దుర్మరణం

కూలీలను తీసుకెళ్తున్న డీసీఎం లారీని వేగంగా దూసుకొచ్చిన మినీ వ్యాన్‌ ఢీకొట్టడంతో మహిళా కూలీ మృతి చెందారు. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలో మాచవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగింది.

Published : 23 May 2024 02:29 IST

ముగ్గురికి గాయాలు

రోడ్డు పక్కనే పడి పోయిన డీసీఎం లారీ 

కనిగిరి, న్యూస్‌టుడే: కూలీలను తీసుకెళ్తున్న డీసీఎం లారీని వేగంగా దూసుకొచ్చిన మినీ వ్యాన్‌ ఢీకొట్టడంతో మహిళా కూలీ మృతి చెందారు. ఈ సంఘటన మున్సిపాలిటీ పరిధిలో మాచవరం జాతీయ రహదారిపై బుధవారం జరిగింది. ఎస్‌ఐ త్యాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..మాచవరం నుంచి బేల్దారీ కూలీలను కనిగిరికి డీసీఎం లారీలో తీసుకొస్తున్నారు. మాచవరం వద్ద డీసీఎంను, వేగంగా వచ్చిన మినీ వ్యాన్‌ ఢీకొట్టింది. ప్రమాద ధాటికి డీసీఎం లారీ రెండు చక్రాలు ఊడిపోగా, వాహనం బోల్తాపడింది. ఈ సంఘటనలో లారీ ముందు భాగంలో కూర్చున్న మాచవరానికి  చెందిన ఉప్పు రమాదేవి (51)కి తీవ్ర గాయాలు కాగా, మినీ వ్యాన్‌ డ్రైవర్‌ సురేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి. రమాదేవి పరిస్థితి విషమంగా ఉండటంతో ఆమెను ఒంగోలు తరలిస్తుండగా, మార్గమధ్యలో మృతి చెందారు. మృతురాలి బంధువులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. వ్యాన్‌ చోదకుడిని  అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

గుర్తు తెలియని వాహనం ఢీకొని..

కొనకనమిట్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ ద్విచక్ర వాహన చోదకుడు ప్రాణాలు కోల్పోయారు. 565 జాతీయ రహదారిపై కొనక¢నమిట్ల మండలంలోని పెదారికట్ల గ్రామ సమీపంలో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదారికట్ల గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు (32) ద్విచక్ర వాహనంపై చినారికట్ల వెళ్లి అక్కడ పని ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పెదారికట్ల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న ఎస్సై మాధవరావు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు.  

మార్కాపురం: పూర్తిగా దెబ్బతిన్న ట్రాలర్‌ ముందు భాగం 

జాతీయ రహదారిపై.. 

మార్కాపురం: ట్రాలర్, బొలేరో ఢీకొన్న ప్రమాదంలో ఇరు వాహన చోదకులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన బుధవారం అమరావతి- అనంతపురం జాతీయ రహదారిపై నికరంపల్లి వద్ద చోటు చేసుకుంది. మార్కాపురం గ్రామీణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంభం నుంచి యర్రగొండపాలెం వెళ్తున్న బోలెరో, విజయవాడ నుంచి కడపకు వెళ్తున్న ట్రాలర్‌ అమరావతి - అనంతపురం జాతీయ రహదారిపై నికరంపల్లి వద్ద ఢీకొన్నాయి. బుధవారం తెల్లవారు జామున ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో రెండు వాహనాల ముందు భాగాలు పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యాయి. వాహన చోదకులిద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. దీనిపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని, ఈ ప్రమాదంపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని