logo

రౌడీ నేతలు.. నాటకాల పోలీసులు

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లర్లకు పాల్పడే వారిపై రౌడీషీట్‌ తెరుస్తాం’ అంటూ పోలీసు ఉన్నతాధికారులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యేక బలగాలతో ఊరూరా కవాతులు చేయిస్తున్నారు.

Updated : 23 May 2024 04:26 IST

పోలింగ్‌ వేళ బరితెగించిన వైకాపాప్రజాప్రతినిధులు
ఏకంగా ఆర్వోకే ఎంపీ అభ్యర్థి బెదిరింపులు
ఒంగోలులో రెచ్చిపోయిన అల్లరిమూకలు
అయినా కేసులుండవు.. చర్యలు  తీసుకోరు 

శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఎలాంటి సంఘటనలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం. అల్లర్లకు పాల్పడే వారిపై రౌడీషీట్‌ తెరుస్తాం’ అంటూ పోలీసు ఉన్నతాధికారులు పదే పదే ప్రకటనలు చేస్తున్నారు. ప్రత్యేక బలగాలతో ఊరూరా కవాతులు చేయిస్తున్నారు. అల్లర్లను తామెలా అడ్డుకుంటామో తెలిపేలా తమ సిబ్బందితో మాక్‌ డ్రిల్‌ చేయిస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. మరి ఈ వైఖరి ఎన్నికల వేళ ఏమైంది అనే ప్రశ్నలు ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్నాయి. పోలింగ్‌ రోజు వైకాపా నేతలు బరితెగించారు. రౌడీల్లా రెచ్చిపోయి ఇష్టారీతిన వ్యవహరించారు. అయినా పోలీసులు చూస్తుండిపోయారు. తమ ఎదుటే అధికారులను బెదిరింపులకు గురిచేసినా.. గొడవలకు కాలు దువ్వినా మిన్నకుండిపోయారు. డబ్బులు పంచుతూ దొరికినా వదిలేసి చేతులు దులుపుకొన్నారు. అధికార పార్టీ అల్లరిమూకలపై కేసులు కట్టకుండా.. బాధితులపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. కొందరు పోలీసులు ఏకంగా వైకాపా ప్రజాప్రతినిధులకు తొత్తులుగా వ్యవహరించారు.

న్యూస్‌టుడే, ఒంగోలు

అధికారిణికి భరోసా కల్పించేది ఇలాగేనా..!

వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి పోలింగ్‌ వేళ పశ్చిమ ప్రాంతంలో దూకుడుగా వ్యవహరించారు. యర్రగొండపాలెం వైకాపా అసెంబ్లీ అభ్యర్థి తాటిపర్తి చంద్రశేఖర్‌ నామినేషన్‌ సందర్భంలో రిటర్నింగ్‌ అధికారిణి డాక్టర్‌ శ్రీలేఖ పట్ల దురుసుగా ప్రవర్తించారు. తమపై ఎక్కువ కేసులు నమోదు చేస్తున్నారని, భవిష్యత్తులో ఇబ్బందులుంటాయని బెదిరించారు. ఈ విషయం జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పోలింగ్‌ రోజునా చెవిరెడ్డి ఇదే తీరు ప్రదర్శించారు. వీరభధ్రాపురంలో ఆర్వోను వెంబడించారు. 

నమూనా ప్రదర్శనలకే  పరిమితమా..!

జిల్లాలో పలు చోట్ల ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్నా.. పోలీసు యంత్రాంగం నామమాత్రపు చర్యలకే పరిమితమైంది. తాజాగా ఓట్ల లెక్కింపు వేళ అల్లర్లకు పాల్పడితే తాము ఎటువంటి చర్యలు తీసుకుంటామో తెలుపుతూ నమూనా ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఇవన్నీ మాక్‌ డ్రిల్‌ వరకే పరిమితం అవుతున్నాయి. ఎన్నికల ప్రక్రియలో హింసకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసింది లేదు. ఎటువంటి చర్యలు తీసుకోలేదు.

మోహరించి.. కాలుదువ్వి

పోలింగ్‌ రోజైన ఈ నెల 13వ తేదీ సాయంత్రం వెంగముక్కలపాలెంలో బాలినేని కుటుంబం అరాచకం సృష్టించింది. మాజీ మంత్రి తనయుడు ప్రణీత్‌రెడ్డి, ఆయన భార్య కావ్యరెడ్డి, బాలినేని వియ్యంకుడు కుండా భాస్కర్‌రెడ్డి అక్కడే మోహరించారు. స్థానిక వైకాపా నేతల సహాయంతో దొంగ ఓట్లు వేయించేందుకు ప్రయత్నించారు. అడ్డుకున్న తెదేపా ఏజెంట్లు, కార్యకర్తలపై దాడి చేసి కొట్టారు. ఈ ఉదంతంలో ఒంగోలు తాలూకా పోలీస్‌ స్టేషన్‌లో నాలుగు కేసులు నమోదయ్యాయి. వీటిల్లో వైకాపా మద్దతుదారులపై కనీస చర్యలు తీసుకోని పోలీసులు, తెదేపా కార్యకర్తలను స్టేషన్‌కు తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. నిరసన వ్యక్తం కావడంతో వెనకడుగు వేశారు. 

ఆ ఎమ్మెల్యే  ఎందుకున్నారు..?

సంతనూతలపాడు వైకాపా ఎమ్మెల్యే సుధాకర్‌బాబుకు యర్రగొండపాలెంతో ఎటువంటి సంబంధం లేదు. అయినా తాను ఆ నియోజకవర్గంలోని పలు పోలింగ్‌ బూత్‌లలో హల్‌చల్‌ చేశారు. నిబంధనల ప్రకారం ఆయన పర్యటించకూడదు. ఈసీ సూచనల మేరకు ఇతరులను అక్కడి నుంచి బయటకు పంపాలి. తమ కళ్లెదుటే రిటర్నింగ్‌ అధికారిణిని చెవిరెడ్డి బెదిరిస్తున్నా.. ఆ పక్కనే స్థానికేతరుడైన ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఉన్నా యర్రగొండపాలెం పోలీసులు కనీసం పట్టించుకోలేదు. చివరికి ఆర్వో వ్యక్తిగత సహాయకుడు ఆమెకు అడ్డుగా నిలిచి దూషణ పర్వాన్ని అడ్డుకోవాల్సి వచ్చింది. 

బాలినేని కుటుంబం  అరాచకం... 

ఒంగోలు నియోజకవర్గంలో వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కుటుంబం పదే పదే అరాచకాలకు పాల్పడింది. తమ ప్రచారంలో పూర్తిగా వాలంటీర్ల పైనే ఆధారపడి ఒంగోలులో ఉద్రిక్త వాతావరణానికి కారణమైంది. సమతానగర్‌లో బాలినేని కోడలు కావ్య స్థానిక వాలంటీర్‌ను వెంట బెట్టుకొని వెళ్లడం, అక్కడ తెదేపా మద్దతుదారులు ప్రశ్నించడం ఘర్షణకు కారణమైంది. తెదేపా కార్యకర్త చప్పిడి ప్రభావతి, ఆమె కుటుంబీకులపై బాలినేని కోడలు కావ్యరెడ్డి అనుచరులు దాడి చేసి కొట్టారు. అదేమని ప్రశ్నించిన డివిజËన్‌ పార్టీ అధ్యక్షుడు మేడికొండ మోహన్‌పై వైకాపా అల్లరి మూకలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. బాధితులు పోలీసులకు పదే పదే ఫిర్యాదులు చేసినా కనీసం పట్టించుకోలేదు. 

రిమ్స్‌లో వీరంగం వేసినా... 

వైకాపా అల్లరి మూకల దాడిలో గాయపడి వైద్యశాల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించేందుకు తెదేపా ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ జీజీహెచ్‌కు వెళ్లారు. ఆయన్ను లక్ష్యంగా చేసుకొని రాత్రి 11 గంటల సమయంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆయన తనయుడు ప్రణీత్‌రెడ్డి వందలాది మంది అనుచరులతో రాత్రి 11 గంటల సమయంలో తమ నివాసం నుంచి జీజీహెచ్‌కు భారీ ర్యాలీగా తరలివచ్చారు. ఇది ఎన్నికల నియామళిని ఉల్లంఘించడమే అయినా పోలీసులు కనీసం అడ్డగించే ప్రయత్నం చేయలేదు. అర్ధరాత్రి వేళ వైకాపా మూకలు జీజీహెచ్‌లో వీరంగం సృష్టించినా కిమ్మనలేదు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని