logo

కలలోనే కిలోల కొనుగోలు

మార్కెట్‌కు వెళ్లిన వారు కూరగాయల ధరలు విని బెంబేలెత్తుతున్నారు. టమాటా, పచ్చిమిర్చి వంటింట్లో నిత్యావసరాలుగా మారాయి. గత పది రోజులుగా ఇవి కొండెక్కి కూర్చున్నాయి.

Updated : 02 Jul 2023 05:23 IST

ధరలు వింటూనే వంటిళ్లలో వణుకు
కొండెక్కి కూర్చున్న  కూరగాయలు, సరకులు

ఈనాడు, ఒంగోలు ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: మార్కెట్‌కు వెళ్లిన వారు కూరగాయల ధరలు విని బెంబేలెత్తుతున్నారు. టమాటా, పచ్చిమిర్చి వంటింట్లో నిత్యావసరాలుగా మారాయి. గత పది రోజులుగా ఇవి కొండెక్కి కూర్చున్నాయి. ధరలు వింటుంటేనే వండకుండానే ఇళ్లలో వణుకు పుడుతోంది. కూరగాయల కోసం మార్కెట్‌కు వెళ్లిన కొందరు కొనుగోలు చేయలేక వెనుదిరుగుతుండగా.. మరికొందరు విధి లేని పరిస్థితుల్లో కిలోలకు బదులు పావులతో నెట్టుకొస్తున్నారు.

* ఎందుకీ పరిస్థితి...: మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణా రాష్ట్రాల్లో కూరగాయల దిగుబడి పడిపోవడంతో ఆంధ్రప్రదేశ్‌ నుంచి అక్కడికి ఎగుమతి అవుతున్నాయి. దీంతో ఇక్కడి సరకుకు గిరాకీ పెరిగింది. జిల్లాలోని గిద్దలూరు ప్రాంతంలో టమాటా ఎక్కువగా పండిస్తారు. మరో 15 రోజుల్లో ఆక్కడి సరకు అందుబాటులోకి వస్తుంది. గత కొన్ని రోజులుగా పలమనేరు, మదనపల్లి ప్రాంతాల నుంచి టమాటా, మార్టూరు, విజయవాడ, తెలంగాణా జిల్లాల నుంచి పచ్చిమిర్చి ఇతర కూరగాయలు తక్కువ పరిమాణంలోనే వస్తున్నాయి. అదేసమయంలో సుదీర్ఘ వేసవి ఉండటం.. వరుణుడి జాడ లేకపోవడం దిగుబడిపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి.

* మధ్యతరగతిపై మహా భారం...: నలుగురు సభ్యులున్న కుటుంబంలో నెలకు సగటున మూడు కిలోల పప్పు, అయిదు కిలోల టమాటా వినియోగం ఉంటుంది. ప్రస్తుతమున్న ధరల ప్రకారం టమాటాకు రూ.650, కందిపప్పునకు రూ.450 వరకు వెచ్చించక తప్పడం లేదు. వంటనూనె నెలకు 5 ప్యాకెట్లు వినియోగిస్తే.. నెలకు రూ.800 అవుతోంది. 30 గుడ్లు తింటే రూ.180, కోడి మాంసానికి రూ.1,200 ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రస్తుతం గ్యాస్‌ బండ ఇంటికొచ్చే సరికి రూ.1250 అవుతోంది. వీటికే నెలకు రూ.4,530 వరకు వ్యయమవుతోంది. వీటితోపాటు పాలు 30 లీటర్లకు రూ.2,100, చక్కెర మూడు కిలోలకు రూ.135 వెచ్చించక తప్పడం లేదు. ఉల్లిగడ్డలు 5 కిలోలు రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతోంది. మిర్చి నాణ్యతను బట్టి కిలో రూ.100కు పైగా ఉంది. వంకాయ, బెండకాయ, బీరకాయ, కాకరకాయ వంటివి కిలో రూ.60 నుంచి రూ.80 వరకు ఉన్నాయి. కొత్తిమీర కట్ట రూ.50కి చేరింది.. పుదీనా రూ.30, పాలకూర, తోటకూర, కొనగంటికూర, గోంగూర కట్ట రూ.10గా ఉన్నాయి. వీటికి మరో రూ.2 వేలు వ్యయం. ఇవికాకుండా బియ్యంతో కలిపి నెలకు రూ.10 వేలు వరకు చేతి చమురు వదులుతోంది.

రైతుబజార్లలోనూ దగా...

వినియోగదారులకు సరసమైన ధరలకు కూరగాయలు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న రైతు బజార్లలోనూ వినియోగదారులకు నిరాశే మిగులుతోంది. లాయర్‌పేట రైతు బజారులో ప్రదర్శించే ధరలకు విక్రయించే వాటికి పొంతన ఉండటం లేదు. దీంతో వ్యాపారులు, వినియోగదారుల మధ్య నిత్యం వాగ్వాదం తప్పడం లేదు. పర్యవేక్షణకోసం నియమితులైన అధికారులేమో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని వినియోగదారులు వాపోతున్నారు. ఒంగోలు నగరంలో రైతుబజార్లు ఉన్నప్పటికీ టమోటా, ఇతర ధర ఎక్కువగా ఉన్న కూరగాయలు దొరకని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోవాల్సిన ఉన్నతాధికారులు చోద్యం చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

నేటి నుంచి టమాటా విక్రయాలు...

టమాటా ధర వినియోగదారులకు అందుబాటులోకి లేకపోవడంతో మార్కెటింగ్‌ శాఖ ద్వారా ఆదివారం నుంచి కిలో రూ.50కు విక్రయించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. పలమనేరు నుంచి ముందుగా 5 టన్నులు తెప్పించి ఒంగోలులోని మూడు రైతు బజార్లలో అందుబాటులో ఉంచుతాం. ఆ తర్వాత అవసరాన్ని బట్టి కొనసాగిస్తాం. ఇతర రాష్ట్రాల్లో పంట దెబ్బతినడం వల్ల ఇక్కడి సరకుకు డిమాండ్‌ పెరిగింది. మరో పది రోజుల్లో ధరలు తగ్గే అవకాశం ఉంది. రైతుబజార్లలో ప్రదర్శించే ధరలకే కూరగాయలు విక్రయించాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం.

ఉపేంద్ర, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని