logo

దళారుల చీడ.. కాలేదు విరగడ

రాయలసీమ జిల్లాల తర్వాత అత్యధికంగా బత్తాయి పండించే ప్రాంతం కనిగిరి. ఇక్కడ వేల ఎకరాల్లో వందల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించినా వారికి గిట్టుబాటు ధర దక్కడం లేదు.

Published : 16 Apr 2024 04:16 IST

నేరుగా ఎగుమతులంటూ అప్పట్లో హామీలు
కలగానే మిగిలిన బత్తాయి మార్కెట్‌ ఏర్పాటు

కాయలు కోసి కుప్పగా పోస్తున్న కూలీలు

రాయలసీమ జిల్లాల తర్వాత అత్యధికంగా బత్తాయి పండించే ప్రాంతం కనిగిరి. ఇక్కడ వేల ఎకరాల్లో వందల మంది రైతులు సాగు చేస్తున్నారు. ఆరుగాలం శ్రమించినా వారికి గిట్టుబాటు ధర దక్కడం లేదు. దళారుల చేతిలో చిక్కి తీవ్రంగా నష్టపోతున్నారు. అందుకే కనిగిరిలో మార్కెట్‌ సౌకర్యం కల్పించి ఇక్కడ నుంచే నేరుగా రైతులు ఇతర రాష్ట్రాలకు పంట ఉత్పత్తులు విక్రయించుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తాను   - ప్రతిపక్ష నేతగా కనిగిరి నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి చెప్పిన మాటలివి.


న్యూస్‌టుడే, కనిగిరి: బత్తాయి అంటే జిల్లాలో మొదటిగా గుర్తొచ్చే ప్రాంతం కనిగిరి. జిల్లాలో దర్శి, మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కొండపి తదితర ప్రాంతాల్లో సుమారు ముప్ఫై వేల ఎకరాల్లో ఈ పంట సాగు చేస్తున్నారు. అందులో కనిగిరి, పామూరు, పీసీపల్లి, సీయస్‌పురం, వెలిగండ్ల మండలాల్లోనే దాదాపు పది వేల ఎకరాల్లో విస్తరించి ఉంది. వందలాది కుటుంబాలు ప్రత్యక్షంగా, మరెందరో పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్నారు. ఇంతటి కీలకమైన పంట సాగు చేసే రైతులకు కష్టాలు తప్పడం లేదు. ఆరుగాలం శ్రమించినప్పటికీ దళారుల చేతిలో చిక్కి దగా పడుతున్నారు. సరైన మార్కెట్‌ సౌకర్యాలు లేక తెగనమ్ముకుంటూ నష్టాలపాలవుతున్నారు.
తాము చెప్పిందే ధరంటూ దగా...: గత అయిదేళ్ల వైకాపా పాలనలో ప్రకృతి వైపరీత్యాలతో వర్షాలు లేక సగం చెట్లు ఎండిపోయాయి. మిగతా కాపాడుకున్నప్పటికీ ప్రభుత్వ పరంగా ఎలాంటి రాయితీలు, పథకాలు రైతులకు దక్కడం లేదు. ఉన్న చెట్లతోనే మంచి దిగుబడి సాధించినా స్థానికంగా విక్రయించుకునేందుకు సరైన మార్కెట్‌ సౌకర్యం లేదు. విధి లేని పరిస్థితుల్లో దూర ప్రాంతాలకు వెళ్లి కాయలను విక్రయించుకోవాల్సిన దుస్థితి. దీంతో రవాణా ఛార్జీల భారం భరించలేక.. కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన దళారులకు చెట్ల మీదనే కాయలను తక్కువ ధరకు రైతులు విక్రయించుకుంటున్నారు. కొందరు ఇతర జిల్లాల్లోని మార్కెట్‌లకు తరలించినా.. వ్యాపారులు తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. తరుగు పేరుతో ఇరవై శాతం వరకు ఉచితంగా తీసుకుంటున్నారు. కూటమిగా ఏర్పడి చెప్పినంతకు సరకు ఇచ్చి వెళ్లాలని.. లేకుంటే తీసుకెళ్లాలంటూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. చేసేదేమీ లేక దళారులు చెప్పిన ధరకు తెగనమ్ముకుంటూ రైతులు నష్టపోతున్నారు.
ఇతర రాష్ట్రాల్లో మాత్రం దగదగ...: ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల్లో బత్తాయికి విపరీతమైన డిమాండ్‌ ఉంటుంది. ప్రస్తుతం కోల్‌కతా, దిల్లీ, ముంబాయి తదితర రాష్ట్రాల్లో టన్ను ధర రూ. 32 వేలుంటే.. ఇక్కడ రైతుల నుంచి మాత్రం టన్ను రూ. 20 వేలకే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. దీనంతటికీ స్థానికంగా మార్కెట్‌ సౌకర్యం లేక పోవడమే కారణమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్‌ పాదయాత్ర సందర్భంగా చెప్పిన మాటలు.. ఇచ్చిన హామీలు నీటి మీద రాతలుగానే మిగిలాయని, తమ కష్టాలు మాత్రం తీరలేదని కర్షకులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇప్పటికైనా కనిగిరిలో మార్కెట్‌ సౌకర్యం కల్పించి దళారులు చేతిలో మోసపోకుండా చూడాలని కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని