logo

అన్న కళ్లలో ఆనందం.. పొద్దంతా ఏడిపింఛను కుతంత్రం

మీ బిడ్డనంటూ జగన్‌ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది.

Updated : 30 Apr 2024 07:20 IST

ఇంటి వద్ద పంపిణీ పట్టని వైనం
వేసవిలో పండుటాకుల ప్రాణాలతో చెలగాటం
న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం, పెద్దదోర్నాల

మీ బిడ్డనంటూ జగన్‌ నటిస్తూ కపట మాటలు చెబుతారు. చేతల్లో అబద్ధాలని జనానికి తెలియగానే అస్మదీయ అధికార గణం రంగంలోకి దిగుతుంది. మరో జగన్నాటకానికి తెర లేపుతుంది. అన్న కళ్లలో ఆనందం కోసం పరితపిస్తుంది. పండుటాకుల ప్రాణాలతో చెలగాటమాడేందుకూ సిద్ధపడుతుంది. సార్వత్రిక ఎన్నికలు సమీపించిన వేళ ఈ తరహాలోనే పింఛను లబ్ధిదారులను పొద్దంతా ఏడిపించే కుట్రకు తెర లేపారు. ఇళ్ల వద్దకు వెళ్లి పంపిణీ చేయకుండా మండే ఎండల్లో సుదూరాన ఉండే బ్యాంకులకు పంపేలా ఆదేశాలు జారీ చేశారు.


  • పెద్దదోర్నాల మండలం నల్లగుంట్ల చెంచు గిరిజన గూడేల్లో 323 మంది పింఛను లబ్ధిదారులున్నారు. వీరంతా 17 కి.మీల దూరంలో ఉన్న ఎగువ చెర్లోపల్లె యూనియన్‌ బ్యాంకు వద్దకు వచ్చి నగదు తీసుకోవాల్సి ఉంది. ఆ ప్రాంతాల నుంచి చెర్లోపల్లెకి ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదు. ఆటోల్లో ప్రయాణించాలి. రవాణాకే రూ. వంద వరకు ఖర్చు చేయాల్సి వస్తుంది.

  • పెద్దదోర్నాల మండలం చింతల, తుమ్మలబైలు, చిన్నారుట్ల చెంచు గిరిజన గూడేలకు చెందిన 73 మంది లబ్ధిదారులు 15 నుంచి 30 కి.మీల దూరంలోని పెద్దదోర్నాలలో ఉన్న  బ్యాంకులకు వచ్చి నగదు తీసుకోవాల్సి ఉంటుంది. అక్కడికి రావాలంటే వ్యయప్రయాసాలతో ఇబ్బందులు తప్పవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • పెద్దబొమ్మలాపురం సచివాలయ పరిధిలోని 512 మంది లబ్ధిదారులు 12 కి.మీల దూరంలో ఉన్న పెద్దదోర్నాల బ్యాంకుల వద్దకు వచ్చి నగదు తీసుకోవాల్సి ఉంటుంది. మండే ఎండలకు యువకులే బయటకు రావడానికి భయపడుతున్నారు. వృద్ధులు, దివ్యాంగులు అంతదూరం ఎలా వెళ్లాలని ఆందోళన చెందుతున్నారు.

ఓటే వస్తోంది కదా..!: వృద్ధులు, విభిన్న ప్రతిభావంతుల వెతలను దృష్టిలో ఉంచుకుని పోలింగ్‌ కేంద్రానికి రాలేరన్న ఉద్దేశంతో మే 13న నాటి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల సంఘం వారికి ఈ సారి ఇంటి వద్దనే ఓటు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించింది.


అంటకాగుతున్నారనే వాలంటీర్ల తొలగింపు...: రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఇంటింటికీ లబ్ధిదారులకు పింఛను అందించేది. సార్వత్రిక ఎన్నికల కోడ్‌ దృష్ట్యా వైకాపా కార్యకర్తలుగా భావిస్తున్న గ్రామ, వార్డు వాలంటీర్లను సామాజిక పింఛన్ల పంపిణీ బాధ్యత నుంచి ఈసీ తప్పించింది. ప్రత్యామ్నాయంగా ఉద్యోగులతో వారికి ఇబ్బంది లేకుండా అందించాని ఆదేశించింది.


నిందలు ఇతరుల పైకి నెట్టేలా...: ఇదే అదునుగా ఉన్నత స్థాయిలో కుట్రలకు తెర లేచింది. వాలంటీర్లతో పంపిణీని ఆపేయించారనే నిందలు ప్రతిపక్షంపై మోపేలా గత నెలలో సచివాలయాల వద్ద వైకాపా ప్రభుత్వం పంపిణీ చేయించింది. ఫలితంగా లబ్ధిదారులు ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి నిరీక్షించడంతో పాటు, పలుచోట్ల సొమ్మసిల్లి పడిపోయారు. వడదెబ్బకు గురయ్యారు.


కష్టాలు పెంచేలా వికృత విధానం...: వృద్ధులు, విభిన్న ప్రతిభావంతులనే కనికరం లేకుండా వైకాపా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. గత నెలలో పండుటాకుల ఇబ్బందుల దృష్ట్యా మే నెలలోనైనా ఇంటి వద్దే పింఛన్లు పంపిణీ చేయిస్తారని అంతా భావించారు. ఎన్నికల్లో లబ్ధి మాత్రమే ఆశించే కొందరు ఉన్నతాధికారులు జగనన్న కళ్లలో ఆనందం చూడాలన్న ఉద్దేశంతో వికృత విధానానికి తెర లేపారు. పింఛను నగదును నేరుగా అందించకుండా బ్యాంక్‌ ఖాతాలకు జమ చేయనున్నట్లు ప్రకటించారు. నెపం ప్రతిపక్షాలపై నెట్టేలా కొత్త నాటకానికి తెర లేపారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 45 డిగ్రీల మేర అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పండుటాకులు ఇళ్ల నుంచి బయటకు వస్తే వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఉంది. అవసరమైతేనే తప్ప బయటకు రాకూడదంటూ విపత్తుల సంస్థ ఇప్పటికే ప్రజలను హెచ్చరించింది. పింఛను లబ్ధిదారులు మాత్రం గ్రామీణ ప్రాంతాల నుంచి కి.మీ దూరంలో ఉన్న బ్యాంక్‌లకు వెళ్లి నగదు తెచ్చుకోవడం ఎలా సాధ్యపడుతుందనే విషయాన్ని విస్మరించారు. ఇంటి దగ్గరనే ఉద్యోగులతో అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా ఆలోచనే చేయలేదు.

ఇలా చేస్తే.. కాదా సులువు...

  • జిల్లా వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయాలు: 717
  • ఉద్యోగులు, సిబ్బంది: 7,000కు పైగా
  • మొత్తం పింఛన్లు: 2,92,525
  • బ్యాంకు ఖాతాలు లేనివి: 69,918
  • ఖాతాలకు జమ కానున్నది: 2,22,607 మందికి
  • నాలుగు వేల జనాభా యూనిట్‌ ఆధారంగా గ్రామ, వార్డు సచివాలయాల ఏర్పాటు.
  • ఒక్కో సచివాయలం పరిధిలోని పింఛన్లు: సుమారు 405
  • ప్రతి గ్రామంలోని ఉద్యోగులు: 11 మంది
  • వార్డు పరిధిలో పనిచేస్తున్నది: 10 మంది
  • ఎంత పెద్ద గ్రామమైనా, వార్డు అయినా పది వీధులకు మించి ఉండవు. ఒక్కో సచివాలయ ఉద్యోగికి గ్రామాల్లో అయితే 40, వార్డుల్లో అయితే 45 మందిలోపు లబ్ధిదారులకు మాత్రమే నగదు అందజేయాల్సి వస్తుంది. ఈ చొప్పున ఇంటి వద్దకు వెళ్లి ఇచ్చినా రెండు రోజుల్లోనే వంద శాతం పంపిణీ పూర్తి చేయొచ్చు.

అంతదూరం ఎలా వెళ్లాలో తెలీదు...
- వీరమ్మ, నల్లగుంట్ల

మా గూడేనికి దగ్గరలో బ్యాంకు లేదు. 15 కి.మీల దూరంలోని ఎగువ చెర్లోపల్లెలో బ్యాంకు ఉందట. అక్కడికి ఎలా వెళ్లాలో నాకు తెలియదు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రాలేకున్నాం. అంతదూరం వెళ్లి డబ్బులు తీసుకునే స్థితిలో లేను. ప్రభుత్వం స్పందించి సిబ్బందితో ఇంటి వద్దే డబ్బులు ఇప్పిస్తే బాగుంటుంది. 


కర్ర లేనిదే కదలలేను...
- అంబమ్మ, పెద్దబొమ్మలాపురం

ఊతకర్ర లేనిదే ఇంటి నుంచి బయటికి కూడా రాలేను. అలాంటిది పెద్దదోర్నాల బ్యాంకు వద్దకు వెళ్లి డబ్బులు తెచ్చుకోవడం చాలా కష్టమైన పని. ఇప్పటికే అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నాను. మందులు తెప్పించుకోవాలి. పింఛను డబ్బులే ఆధారం. ఆటోలో బ్యాంకు వద్దకు వెళ్లి తెచ్చుకునే పరిస్థితిలో లేను. ఉద్యోగులతో ఇంటి వద్దే డబ్బులిప్పించాలి.


బయటికి వెళ్లే ఓపికే లేదు...
- నాగమ్మ, నల్లగుంట్ల గూడెం

బ్యాంకులో పింఛను డబ్బు వేస్తే ఎగువ చెర్లోపల్లె వెళ్లి తెచ్చుకునే ఓపిక లేదు. బస్సులు కూడా లేవు. పైగా ఇంకొకరి తోడు అవసరం. అక్కడికి వెళ్లగానే డబ్బులిస్తారనే నమ్మకం కూడా లేదు. ప్రభుత్వం స్పందించి అధికారులతో ఇంటి వద్దే డబ్బులివ్వాలి.


పింఛనుకెళ్తే ఊపిరి పోతుందేమో..
- చిన్నక్క, పడమటి బొమ్మలాపురం

పింఛన్‌ సోమ్ము బ్యాంకులో వేస్తే ఆ డబ్బు ఎలా తెచ్చుకోవాలో తెలియడం లేదు. 12 కి.మీ దూరంలో ఉన్న పెద్దదోర్నాలలో బ్యాంకు ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. అక్కడికి వెళ్లి డబ్బులు ఎలా తెచ్చుకోవాలి. మండుటెండలో వెళ్తే వడదెబ్బ బారిన పడతాను. పింఛన్‌ సొమ్ము నా ఊపిరి తీసేలా ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు