logo

వైకాపా మద్యమా.. మాకేం కనిపించదు

‘రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తాం. మద్యం ముట్టుకోవాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తాం. పూర్తిగా మద్యనిషేధం విధించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తాం..

Published : 02 May 2024 02:30 IST

సీఎం సభలోనే ఏరులై పారిన మందు
చోద్యం చూసిన సెబ్‌, పోలీసు అధికారులు
ఒంగోలు, న్యూస్‌టుడే

‘రాష్ట్రంలో దశలవారీగా మద్య నిషేధం విధిస్తాం. మద్యం ముట్టుకోవాలంటేనే భయం పుట్టేలా చేస్తాం. కేవలం ఫైవ్‌ స్టార్‌ హోటళ్లకే పరిమితం చేస్తాం. పూర్తిగా మద్యనిషేధం విధించిన తర్వాతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు మీ ముందుకొస్తాం..

గత ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్‌.జగన్‌

అందరూ అక్కడే ఉన్నా...: టంగుటూరులో మంగళవారం నిర్వహించిన సీఎం జగన్‌ సభలో మద్యం ఏరులై పారింది. జిల్లాస్థాయి అదికార యంత్రాంగంతో పాటు క్షేత్రస్థాయి అధికారులు, సిబ్బంది అదే ప్రాంతంలో విధి నిర్వహణలో ఉన్నారు. అయినా విచ్చలవిడిగా మద్యం పంపిణీ చేశారు. ఉన్నతస్థాయి నుంచి చిన్నాచితకా అధికారుల వరకు అంతా అక్కడే ఉన్నా.. ఎవరూ ఆ వైపు కన్నెత్తి చూసేందుకు సాహసించలేదు. అదే సమయంలో ఒక అధికారి తనిఖీలు చేపట్టారు. ఏకంగా రాష్ట్రంలో నిషేధించిన గోవా, పుదుచ్చేరిలకు చెందిన నాన్‌ పెయిడ్‌ డ్యూటీ లిక్కర్‌ను పట్టుకున్నారు.

టంగుటూరు మండలం జమ్ములపాలెం శివారులో వాహనాలను తనిఖీ చేస్తున్న అధికారులు(పాత చిత్రం)

హెలీప్యాడ్‌ చెంతనే పంపిణీ...: సీఎం జగన్‌ టంగుటూరులో నిర్వహించిన సభకు జిల్లా పోలీసు శాఖ పెద్దఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసింది. సుమారు 800 మందికి పైగా అధికారులు, సిబ్బంది ఈ విధులకు హాజరయ్యారు. కొండపి నియోజకవర్గంలోని కొండపి, సింగరాయకొండ, టంగుటూరు, జరుగుమల్లి, పొన్నలూరు, మర్రిపూడి మండలాల నుంచి ఈ సభకు జనాన్ని తరలించారు. గ్రామాలకు పంపిన ప్రతి కారు, బస్సు, ఆటోలకు పెద్దఎత్తున మద్యం అందించారు. ఈ తతంగమంతా బహిరంగంగానే సాగింది. సాక్షాత్తూ అధికారుల కళ్లెదుటే హెలీప్యాడ్‌ సమీపంలోనూ పెద్దఎత్తున మద్యం పంపిణీ చేశారు. అయినా అధికార యంత్రాంగం కిక్కురుమనలేదు. కనీసం వారించే ప్రయత్నం కూడా చేయలేదు.

సీఎం జగన్‌ ఎన్నికల ప్రచార సభ సందర్భంగా టంగుటూరులో వైకాపా కార్యకర్తల
నుంచి అధికారులు స్వాధీనం చేసుకున్న గోవా మద్యం సీసాల సంచులు

స్వాధీనం చేసుకున్న ఐఏఎస్‌ అధికారి...: బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులతో పాటు మద్యం అక్రమ రవాణాపై దృష్టి సారించాల్సిన సెబ్‌ అధికారులు ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. అదే సమయంలో ట్రైనీ ఐఏఎస్‌ అదికారి శౌర్యమన్‌ పటేల్‌ తమ సిబ్బందితో దాడులు నిర్వహించారు. పలు కార్లలో పెద్దఎత్తున మద్యం అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించారు. గోవా, పుదుచ్చేరి రాష్ట్రాలకు చెందిన మద్యాన్ని స్వాధీనం చేసుకుని నాలుగు కార్లను జప్తు చేశారు. తొమ్మిది మంది నిందితులను అరెస్టు చేయించారు. ఇప్పుడీ వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. విధి నిర్వహణలో ఉన్న పోలీసు, సెబ్‌ సిబ్బంది అలసత్వంపై జిల్లా ఎస్పీ గరుడ్‌ సుమిత్‌ సునీల్‌ తీవ్రంగా ఆగ్రహించినట్లు తెలిసింది. క్షేత్రస్థాయిలో అంతమంది ఉన్నా, విచ్చలవిడిగా మద్యం పంపిణీని పట్టించుకోలేదని.. రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని దాడులు చేసే వరకు మీరేం చేశారని ఆయన అధికారులపై మండిపడినట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని