logo

వైకాపాను ఓడించకపోతే.. యువతకు ఉపాధి కష్టమే

వైకాపా ఆరాచక పాలనకు అంతం పలకాలని  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు.

Published : 04 May 2024 06:24 IST

గిద్దలూరు బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఓపెన్‌ టాప్‌ కారులో ర్యాలీగా వేదిక వద్దకు వస్తున్న పవన్‌కల్యాణ్‌కు స్వాగతం పలుకుతున్న కార్యకర్తలు, అభిమానులు

గిద్దలూరు పట్టణం, కంభం, న్యూస్‌టుడే : వైకాపా ఆరాచక పాలనకు అంతం పలకాలని  జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పిలుపునిచ్చారు. గిద్దలూరులో శుక్రవారం నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. వైకాపాను ఓడించే సమయం ఆసన్నమైందని ఆపార్టీని ఓడించకపోతే యువత ఉపాధి ఉండదన్నారు. జిల్లా వెనుకబడి ఉందని, వెలిగొండ ప్రాజెక్టు పూర్తయితే గిద్దలూరు, మార్కాపురం, నెల్లూరు జిల్లాలకు మేలు జరుగుతుందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే  ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. గిద్దలూరులో ఒంటరిగా పోటీచేసే సత్తా జనసేనకు ఉన్నా 5 కోట్ల ప్రజల క్షేమం కోరి తెదేపాకు సీటు ఇచ్చామని పేర్కొన్నారు.  గిద్దలూరు మండలంలోని గుండ్లమోటుకు తెలుగుగంగ ప్రాజెక్టు నీటిని అనుసంధానం చేయాలన్నది దశాబ్దాల కల అని అనుసంధానం చేస్తామని హామీ ఇచ్చారు. వైశ్య సామాజిక వర్గానికి చెందిన పొట్టిశ్రీరాములు బలిదానం వల్ల వచ్చిన రాష్ట్రం మనదని, కన్యకాపరమేశ్వరి బలిదానాన్ని అధికారిక దినోత్సవంగా జరుపుతామన్నారు. జిల్లాలో 2013 బ్యాచ్‌కు చెందిన కానిస్టేబుల్‌ ఉదయకృష్ణారెడ్డి ఇటీవల సివిల్స్‌లో 780 ర్యాంకు సాధించాడని, యువత లోని ప్రతిభకు నిదర్శనమన్నారు. అందరూ కుల గణాంకాలు తీసుకుంటారు, నేను కోరుకునేది ప్రతిభా గణాంకాలని పేర్కొన్నారు.. శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన కంభం చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఎంతో మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. జగన్‌ పింఛన్‌ ఇచ్చేది ఏమిటి? దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య వీటిని ప్రారంభించారని చెప్పారు. గిద్దలూరు ప్రాంతంలో నల్లమల అడవులు ఉన్నాయి, దీనిని టూరిజం హబ్‌గా చేయేందుకు కృషిచేయాలని మాగుంటకు సూచించారు. వెనుకబడిన ఈ ప్రాంతంలో వలసలు ఆగేందుకు పరిశ్రమలు తేవాలన్నారు. జగన్‌కు  ఎప్పుడూ పచ్చని చెట్లను నరికివేయడం తెలుసు వాటిని పెంచడం తెలియదన్నారు. గిద్దలూరులో అశోక్‌రెడ్డిని గెలిపించండి, నియోజకవర్గ అభివృద్ది బాధ్యత తీసుకుంటామన్నారు. నియోజకవర్గానికి చెందిన జన సైనికుడు వెంగయ్యనాయుడుని  వేధించి ఆత్మహత్య చేసుకోనేలా చేశారని,. వెంగయ్యనాయుడు భార్య పసుపు కుంకుమలు తుడిపేసిన వారిని మళ్లీ గెలిపించాలా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి, జనసేన ఇన్‌ఛార్జి బెల్లకొండ సాయిబాబు, జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్‌, భాజపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి బ్రహ్మేశ్వరప్రసాద్‌, దర్శి ఇన్‌ఛార్జి వెంకట్‌, జడ్పీటీసీ మాజీ సభ్యుడు  కుప్పా రంగనాయకులు, అశోక్‌రెడ్డి తనయుడు దివ్వేష్‌రెడ్డి, మాగుంట తనయుడు రాఘవరెడ్డి పాల్గొన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని