logo

సేవకుడిని కాదని స్మగ్లర్‌కు వైకాపా సీటు

సైకో జగన్‌ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదని తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని తెచ్చి సీటిచ్చారు. తాతల నాటి ఆస్తులను కొట్టేసేందుకు భూరక్షణ చట్టం తెచ్చారు.

Published : 04 May 2024 06:26 IST

పొదిలిలో తెదేపా అధినేత చంద్రబాబు విమర్శ

పొదిలి ప్రచార సభలో విజయసంకేతం చూపుతున్న చంద్రబాబు, చిత్రంలో మార్కాపురం అభ్యర్థి నారాయణరెడ్డి,  బాలాజీ

ఈనాడు, ఒంగోలు: సైకో జగన్‌ మాగుంట శ్రీనివాసులురెడ్డిని కాదని తిరుపతి నుంచి ఎర్రచందనం స్మగ్లర్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డిని తెచ్చి సీటిచ్చారు. తాతల నాటి ఆస్తులను కొట్టేసేందుకు భూరక్షణ చట్టం తెచ్చారు. ఈ చట్టాన్ని రద్దు చేయాలి. లేకుంటే వైకాపా ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దాం అని తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పొదిలిలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే భూరక్షణ చట్టం రద్దుపై రెండో సంతకం చేస్తానని హామీ ఇచ్చారు. మంచి వ్యక్తి, నలభై ఏళ్లుగా సేవ చేసే మాగుంటని ఎంపీగా, కందుల నారాయణరెడ్డిని ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మార్కాపురంలో దోపిడీ చేసిన వైకాపా ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డిని గిద్దలూరుకు మార్చి, అక్కడ ఛీ పో అన్న అన్నా రాంబాబును మార్కాపురం పంపారని, చెత్త ఎక్కడైనా చెత్తే అని.. స్థానాలు మారిస్తే మాత్రం ఎలా పనికొస్తుందని ఎద్దేవా చేశారు.

  •  ముస్లిం సోదరులను ఆదుకుంటాం...: అధికారంలోకి వస్తానే ముస్లిం సోదరులకు యాభై ఏళ్లకే పింఛన్‌ అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తామని, ఉద్యోగాల్లో నాలుగు శాతం రిజర్వేషన్‌ అమలు చేస్తామని చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్లను ఏబీసీడీలుగా వర్గీకరించి మాదిగలకు న్యాయం చేస్తామని తెలిపారు. బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం తెస్తామని, అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రూ.10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు, రూ.3 వేలు నిరుద్యోగ భృతి, యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
  • తెదేపాను గెలిపిస్తారో.. నా తల తీసేస్తారో...: పొదిలి సభలో మార్కాపురం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తొలుత మాట్లాడారు. వైకాపా అయిదేళ్ల పాలనలో అంతా ఇబ్బంది పడ్డారని, మళ్లీ అలాంటి కష్టాలు రాకుండా కాపాడుకుంటానని మాటిస్తున్నానని అన్నారు. నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా తెదేపా గెలుపునకు కృషిచేయాలని కోరారు. అంతా కలిసి తెదేపాను గెలిపిస్తారో, లేక నా తల తీసేస్తారో ఆలోచించుకోవాలని భావోద్వేగానికి గురయ్యారు. బహిరంగ సభలో తెదేపా కూటమి అభ్యర్థి కందుల నారాయణరెడ్డి, నేతలు నూకసాని బాలాజి, గునుపూడి భాస్కర్‌, కాటూరి నారాయణప్రతాప్‌, కందుల విగ్నేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని