logo

వాలంటీర్ల తిరుగుబాటు

సర్కారీ సేవలను గడప గడపకూ చేర్చేందుకంటూ వాలంటీర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చింది.

Updated : 06 May 2024 05:27 IST

జీతాలిప్పించాలంటూ నేతలపై ఒత్తిళ్లు

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: సర్కారీ సేవలను గడప గడపకూ చేర్చేందుకంటూ వాలంటీర్ల వ్యవస్థను వైకాపా ప్రభుత్వం తీసుకొచ్చింది. ప్రజాధనం అందిస్తూ వారితో పార్టీ పనులు చేయించుకుంది. ఈ వ్యవహారంపై ఈసీ కన్నెర్ర చేసింది. ఎన్నికల విధులకు వారిని దూరంగా ఉంచాలని ఆదేశించింది. దీంతో వైకాపా నేతలు మరో కుట్ర పన్నారు. ఎన్నికల్లో లబ్ధికి జిల్లావ్యాప్తంగా వందల సంఖ్యలోని వాలంటీర్ల మెడపై కత్తి పెట్టి రాజీనామా లేఖలు తీసుకున్నారు.

విధుల్లో చేరతామంటూ హెచ్చరికలు

ఒంగోలు నగరంలో 1,250 మంది వార్డు వాలంటీర్లున్నారు. వైకాపా నేతలు ఒత్తిడి తెచ్చి ఏప్రిల్‌ మూడోవారంలో 583 మంది, తర్వాత మరో 190 మంది రాజీనామా లేఖలను అధికారులకు అందజేయించారు. వీరిలో ఎక్కువ మంది ప్రస్తుతం ఆ పార్టీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే వాలంటీర్ల వేతనాల బిల్లు ప్రతి నెలా 20-24 తేదీల మధ్య ఆమోదం కోసం ఆన్‌లైన్‌లో అధికారులు ప్రభుత్వానికి పంపుతారు. రాజీనామాల అంశం వివాదాస్పదంగా మారడంతో ఓఎంసీ కమిషనర్‌ ఏ రోజు అందిన రాజీనామా లేఖలను అదేరోజు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసి తొలగించారు. దీంతో వారు పనిచేసే కాలానికి వేతనాలు పొందే అవకాశం లేకుండా పోయింది. దీంతో పలువురు వాలంటీర్లు తిరుగుబాటు చేస్తున్నారు. జీతాలిప్పిస్తారా లేకుంటే రాజీనామాలు ఉపసంహరించుకోమంటారా అంటూ అధికార పార్టీ నేతలపై ఒత్తిడి తెస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని