logo

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని..

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు.

Published : 07 May 2024 02:42 IST

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య
నిందితుల అరెస్టు

నెహ్రూనగర్‌(గుంటూరు), న్యూస్‌టుడే : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భర్తను ప్రియుడితో హత్య చేయించిన భార్యను, మరో ముగ్గురు నిందితులను గుంటూరులోని కొత్తపేట పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల వివరాలను సోమవారం ప్రత్యేక విచారణాధికారి, డీఎస్పీ వీవీ నాయుడు, కొత్తపేట సీఐ అన్వర్‌ బాషా తెలిపారు. పుల్లలచెరువు మండలం ఆర్‌ ఉమ్మడివరం గ్రామానికి చెందిన ప్రేమ్‌కుమార్‌(35) తన భార్య పిల్లలతో బతుకు దెరువుకు గుంటూరు వచ్చి బుచ్చయ్యతోటలో నివాసం ఉంటున్నాడు. అతను పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. అతని భార్య భారతి సమోసాలు తయారు చేసే షాపునకు వెళుతుండేది. షాపు యజమాని గౌస్‌తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు తెలుసుకున్న ప్రేమ్‌కుమార్‌ మందలించాడు. అప్పటి నుంచి వారిద్దరి మధ్య స్పర్థలు వచ్చి గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో ఏప్రిల్‌ 28వ తేదీ రాత్రి ప్రేమ్‌కుమార్‌ ఓ పెళ్లికి వెళుతున్నానని చెప్పి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదని భార్య భారతి 29వ తేదీన కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వస్తుందని, భర్త కనిపించడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. సీఐ అన్వర్‌ బాషా అదృశ్యం కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేశారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి విచారించగా భారతి తన భర్తను చంపించినట్లు గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను హతమార్చడానికి భారతి తన ప్రియుడు గౌస్‌తో కలిసి కుట్ర పన్నింది. ప్రియురాలి కోరిక మేరకు గౌస్‌ తన తమ్ముడు షేక్‌ ఖాసిం, అతని స్నేహితుడు పఠాన్‌ రెహమాన్‌తో కలిసి పథకం రచించాడు. ప్రేమ్‌కుమార్‌కు మాయమాటలు చెప్పి కొర్నెపాడులోని జగనన్నకాలనీ లేఔట్‌ దగ్గరకు తీసుకువెళ్లారు. బాగా మద్యం తాగించి కర్రతో కొట్టి, తర్వాత కత్తులతో పీకకోసి కిరాతకంగా హత మార్చి అక్కడే పడేసి వెళ్లారు. ఇంటికి వచ్చి భారతితో తన భర్త కనిపించడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేయించారు. నిందితులు భారతి, గౌస్‌, ఖాసిం, పఠాన్‌ రెహమాన్‌లను సోమవారం అరెస్టు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. హత్య కేసు ఛేదించి నిందితులను అరెస్టు చేసిన సీఐ అన్వర్‌బాషా, ఎస్సై హనుమంతురావు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని