logo

ఫ్యాన్‌ మీట నొక్కాలంటే వణుకు

అధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఇక పనేముందన్నట్లు వ్యవహరించారు. పాదయాత్ర వేళ ఇచ్చిన హామీకి నిలువునా పాతరేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సర్దుబాటు ఛార్జీల పేరుతో బాదుడు ప్రారంభించారు.

Updated : 10 May 2024 05:15 IST

ప్రతి నెలా రూ. 20 కోట్ల బాదుడు
తొమ్మిదిసార్లు విద్యుత్తు ఛార్జీల పెంపు
జగన్‌ సర్కారులో షాకిస్తున్న బిల్లులు
న్యూస్‌టుడే, ఒంగోలు గ్రామీణం

పెంచనంటూ మాయమాటలు

ప్రతిపక్ష నేత హోదాలో జగన్‌ మోహన్‌ రెడ్డి రాష్ట్రమంతా పాదయాత్ర చేశారు. ‘చంద్రబాబు పాలనలో విద్యుత్తు బిల్లు ముట్టుకుంటే షాక్‌ కొడుతున్నాయి. నేను అధికారంలోకి వచ్చాక ఛార్జీలు పెంచబోం’ అని మాటలు చెప్పారు. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్నారు.


ధికారంలోకి వచ్చిన తర్వాత జనం ఇక పనేముందన్నట్లు వ్యవహరించారు. పాదయాత్ర వేళ ఇచ్చిన హామీకి నిలువునా పాతరేశారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే సర్దుబాటు ఛార్జీల పేరుతో బాదుడు ప్రారంభించారు. అదే పనిగా బిల్లులు పెంచి పేద, మధ్య తరగతి ప్రజల నడ్డి విరుస్తున్నారు. స్లాబుల మార్పు, ఇంధన సర్దుబాటు ఛార్జీలు, స్థిర ఛార్జీలు, విద్యుత్తు సుంకం, ట్రూఅప్‌ ఛార్జీల పేరుతో ప్రతి నెలా వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నారు. జగన్‌ పాలనలో మొత్తం తొమ్మిది సార్లు బిల్లులు పెంచారు. తద్వారా జిల్లా ప్రజలపై ప్రతి నెలా రూ.20 కోట్ల మేర భారం మోపారు.


అన్ని వర్గాలపై భారం...

ఉమ్మడి ప్రకాశంలో సుమారు 12 లక్షల ఎల్‌టీ కనెక్షన్లున్నాయి. హెచ్‌టీ కింద కనెక్షన్లు: మరో 1,200 ఉన్నాయి. గతేడాదిగా వసూలు చేస్తున్న సర్దుబాటు ఛార్జీలు 2019 సంవత్సరంలోపు కనెక్షన్‌ ఉన్న వినియోగదారులకు మాత్రమే. దీంతో ఎల్‌టీ పరిధిలోని 8,93,675 కనెక్షన్లపై మాత్రమే ట్రూ అప్‌ ఛార్జీలు వేశారు. మిగిలిన అన్ని కేటగిరీల వినియోగదారులు అదనపు మొత్తం చెల్లించాల్సిందే. గతంలో జిల్లాకు విద్యుత్తు బిల్లుల డిమాండ్‌ రూ.80 కోట్ల వరకు ఉండగా, ప్రస్తుతం ఆ మొత్తం రూ.100 కోట్లకు చేరింది. అటే సర్దుబాటు పేరుతో జిల్లాలోని వినియోగదారులపై నెలకు సుమారు రూ.20 కోట్ల మేర అదనపు భారం మోపారు. దీంతో వినియోగదారులు బెంబేతెత్తుతున్నారు. వేసవిలో ఉక్కపోత నుంచి ఉపశమనానికి ఫ్యాన్‌ వినియోగించేందుకు మీట నొక్కాలన్నా భయపడుతున్నారు. వీరితో పాటు విద్యుత్తు పరికరాలు ఉపయోగించే దర్జీలు, చిరువ్యాపారులు, క్షౌర, వెల్డింగ్‌, చిన్న దుకాణాల నిర్వాహకులు అధిక బిల్లులతో అల్లాడుతున్నారు.


మూడు విధాలా భారం...

పెరిగిన విద్యుత్‌ బిల్లులకు అదనంగా ఎడాపెడా విధిస్తున్న సర్దుబాటు ఛార్జీలు వినియోగదారులకు మరింత భారంగా మారాయి. వాడుకున్న రీడింగ్‌తో పాటు, అదనంగా ప్రతి నెలా మూడు సర్దుబాటు ఛార్జీలు విధించడంతో పేద, మధ్య తరగతి కుటుంబాల విద్యుత్తు బిల్లు రెట్టింపైంది.

  • రాష్ట్ర విద్యుత్తు నియంత్రణ మండలి ఆదేశాల మేరకు 2019 ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి నెల వరకు ఉన్న వ్యత్యాసాన్ని గత ఏడాది మే నుంచే జారీ చేస్తున్న బిల్లులో సర్దుబాటు చేస్తున్నారు. విద్యుత్తు కొనుగోలు, సిబ్బంది జీతభత్యాలు, నిర్వహణ తదితరాలకు కావాల్సిన నిధుల కోసం వేసిన అంచనా వ్యయానికి, వాస్తవ వినియోగానికి తేడా వస్తోందనే కారణంతో వినియోగదారుల నుంచి ట్రూ అప్‌ ఛార్జీలను వసూలు చేస్తున్నారు.
  • తాజాగా మరో రెండు సర్దుబాటు ఛార్జీల కింద ప్రతి నెలా అదనంగా 2021-22 సంవత్సరానికి జరిగిన వినియోగానికి రూ.20 పైసలు, 2023-24 సంవత్సరానికి రూ.40 పైసలు చొప్పున వసూలు చేస్తున్నారు. ఇలా ప్రతి నెలా మూడు రకాల సర్దుబాటు ఛార్జీలు కలిపి ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు సరాసరిన రూ.350 నుంచి రూ. 400 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని