logo

వైద్యుడిగా బాధపడుతున్నా..

ఏందయ్యా ఇది..ఒక్క వైద్యుడు కూడా లేడు. ఏం చేస్తున్నారిక్కడ.. ఒక వైద్యుడిగా చాలా బాధపడుతున్నా... ఇంత మంది వైద్యులుండి ఏం లాభం.. విధులకు డుమ్మా కొడితే ఎలా..? అంటూ మంత్రి సీదిరి

Published : 25 Sep 2022 03:48 IST

పలాస ఆసుపత్రిలో మంత్రి అప్పలరాజు ఆకస్మిక తనిఖీ

ఒక్కరే  డాక్టరు ఉండటంతో అసహనం

పలాస, న్యూస్‌టుడే

సూపరింటెండెంట్‌ రమేష్‌పై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న మంత్రి అప్పలరాజు

ఏందయ్యా ఇది..ఒక్క వైద్యుడు కూడా లేడు. ఏం చేస్తున్నారిక్కడ.. ఒక వైద్యుడిగా చాలా బాధపడుతున్నా... ఇంత మంది వైద్యులుండి ఏం లాభం.. విధులకు డుమ్మా కొడితే ఎలా..? అంటూ మంత్రి సీదిరి అప్పలరాజు పలాస ప్రభుత్వ సామాజిక ఆసుపత్రి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

..శనివారం ఉదయం 11.35 గంటలకు ఆసుపత్రిని మంత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్‌సీడీ విభాగానికి చెందిన ఒక్క వైద్యుడు మాత్రమే విధులు నిర్వహిస్తూ కనిపించారు. మిగిలిన ఇద్దరు గైనికాలజిస్టులు, ఇద్దరు ఆర్థోపెడిక్‌ వైద్యులతో పాటుగా సూపరింటెండెంట్‌ సైతం రాకపోవటంతో అసహనంతో నిరీక్షించారు. కాసేపటికి సూపరింటెండెంట్‌ రావడంతో ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన్ను వెంటబెట్టుకొని వార్డుల్లోని రోగుల్ని, సదుపాయాల్ని ప్రశ్నించారు. ఆసుపత్రి మొదటి అంతస్తు పనులు సక్రమంగా లేకపోవటంతో ఇంజినీర్లను ప్రశ్నించారు. ఎత్తు పల్లాలతో నిర్మిస్తే రోగులను స్ట్రెచర్‌పై ఎలా తీసుకొస్తారని ప్రశ్నించారు.

మీరూ పరిశీలించండి
ఆసుపత్రిలో వైద్యులు అందుబాటులో లేకపోవటంతో కలెక్టర్‌ శ్రీకేష్‌ బి.లఠ్కర్‌కు మంత్రి ఫోన్లో ఫిర్యాదు చేశారు. మీరూ ఒకసారి వచ్చి పరిశీలించి చర్యలు తీసుకోవాలని కోరారు.

ఆవేదనతోనే చర్యలు తీసుకోమన్నా..
ఆసుపత్రిని రూ.5 కోట్లతో తీర్చిదిద్దుతుంటే ప్రత్యేక వైద్యులు ఒక్కరూ మధ్యాహ్నం వరకూ అందుబాటులో లేకపోవటంతో ఏమనాలో తెలియటం లేదని మంత్రి అన్నారు. ఆసుపత్రి బయట విలేకర్లతో మాట్లాడుతూ గైర్హాజరవుతున్న వైద్యులపై మెడికల్‌ అండ్‌ హెల్త్‌ అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తామని వివరించారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఇకపై సాధ్యమైనంత వరకు రోజూ    ఆసుపత్రికి వస్తానని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని